వాట్సాప్‌లో ఉబెర్ రైడ్స్ బుకింగ్!

by Shyam |
Uber
X

దిశ, ఫీచర్స్ : ఫేమస్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఉబెర్, పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కలిసి ఇండియాలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. వాట్సాప్ చాట్‌బోట్‌ ఉపయోగించి క్యాబ్‌ బుక్ చేసుకునే సౌకర్యాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

క్యాబ్ బుకింగ్స్ కోసం వాట్సాప్‌తో ఉబెర్ టై-అప్ కావడం ఆ కంపెనీకే కాకుండా కస్టమర్స్‌కు కూడా లాభదాయకమే. ముందుగా పైలట్ ప్రాతిపదికన లక్నోలో ఈ ప్రాజెక్ట్‌ను టెస్ట్ చేయనున్న ఉబెర్.. ఇతర భారతీయ నగరాల్లో కూడా ఈ ఫెసిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఉబెర్ కార్లు, ఉబెర్ మోటో(బైక్‌లు)లతో పాటు ఆటోలను కూడా బుక్ చేసుకోవచ్చు.

ఈ మేరకు 400 మిలియన్లకు పైగా యూజర్లతో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్.. ఇకపై ఉబెర్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోకుండానే క్యాబ్ బుక్ చేసుకునే వెసులుబాటును అందిస్తుంది. క్యాబ్ బుకింగ్, ట్రిప్ వివరాలు, రసీదు సహా అన్ని కార్యకలాపాలను ఇప్పుడు వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ ద్వారా రైడ్ బుకింగ్‌ఆప్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉండగా, త్వరలో స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

Uber

ఉబెర్ యాప్ ద్వారా నేరుగా ట్రిప్స్ బుక్ చేసుకునే వారికి లభించే ‘సేఫ్టీ ఫీచర్స్, బీమా భద్రత’.. వాట్సాప్ నుంచి బుక్ చేసుకున్న కస్టమర్స్‌కు కూడా వర్తిస్తాయి. ఉబెర్‌లో కనిపించే డ్రైవర్ పేరు, కారు లైసెన్స్ ప్లేట్‌ ఇందులోనూ కనిపిస్తుంది. అంతేకాదు యూజర్లు పికప్ పాయింట్‌కి వెళ్లే మార్గంలో డ్రైవర్ ఉన్న లొకేషన్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే WhatsApp నుంచి బుక్ చేసిన ట్రిప్‌లో ఉన్నప్పుడు వినియోగదారు ‘ఎమర్జెన్సీ’ ఆప్షన్ ఎంచుకుంటే, Uber కస్టమర్ సపోర్ట్ టీమ్ నుంచి వెంటనే ఇన్‌బౌండ్ కాల్‌ను అందుకుంటారు. ఇక Uber రైడర్స్ ట్రిప్ ముగిసిన 30 నిమిషాల వరకు తమకు అవసరమైతే కాల్ చేసేందుకు సేఫ్టీ లైన్ నంబర్‌కు యాక్సెస్ కలిగి ఉంటారని కంపెనీ తెలిపింది.

‘భారతీయులందరికీ ఉబెర్ ట్రిప్‌ను వీలైనంత సులభతరం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాట్సాప్‌తో మా భాగస్వామ్యం ఆ పని చేయగలదు. రైడర్స్‌కు సులభమైన, సుపరిచిత, విశ్వసనీయ చానల్ ద్వారా రైడ్‌ను పొందేందుకు ఇది మంచి మార్గాన్ని అందిస్తుంద’ని ఉబెర్ సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story