'నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా..'

by Harish |   ( Updated:2020-05-26 06:52:32.0  )
నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా..
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్, ఇండియాలో 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది దేశంలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 25 శాతానికి సమానం. డ్రైవింగ్ సపోర్ట్, లీగల్, ఫైనాన్స్ వంటి పలు విభాగాల్లో ఈ కోతలుండనున్నట్టు తెలిపింది. బాధిత ఉద్యోగులకు 10 వారాల వేతనం, ఆరు నెలల పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ఉబెర్ స్పష్టం చేసింది. ‘కొవిడ్-19 ప్రభావం, రికవరీ కోసం ఉబెర్ ఇండియాకు ఉద్యోగులను తొలగించడం మినహా వేరే మార్గం లేకుండా పోయింది. గతంలో ప్రకటించినట్టుగా ప్రపంచవ్యాప్త ఉద్యోగ కోతల్లో భాగంగానే ఈ తొలగింపులు జరిగాయి’ అని ఉబెర్ ఇండియా దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ తెలిపారు.

‘ఉబెర్ కుటుంబాన్ని విడిచి వెళ్తున్న సహోద్యోగులకు, సంస్థలోని మనందరికీ ఇది బాధాకరమైన రోజు. భవిష్యత్తుపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగాలు కోల్పోయే వారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఉబెర్ కోసం శ్రమించిన ఉద్యోగుల కృషికి కృతజ్ఞతలు’ అని ప్రదీప్ పరమేశ్వరన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉబెర్ సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,700 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 25 శాతం శ్రామిక శక్తిని ఉబెర్ కోల్పోయింది. గత వారం ఇండియాలోని మరో క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా, తమ సంస్థలో 35 శాతానికి సమానమైన 1,400 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed