క్లీన్ సిటీ చేసే బాధ్యతను నాతో పాటు అందరూ తీసుకోవాలి : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

by Aamani |
క్లీన్ సిటీ చేసే బాధ్యతను నాతో పాటు అందరూ తీసుకోవాలి : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని అహ్మదీబజార్ లో భారీ వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరూపయోగంగా ఉందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. నెల రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజోపయోగంలోకి తీసుకురావాలని మున్సిపాల్ కమిషనర్ ను ఎమ్మెల్యే ధన్ పాల్ ఆదేశించారు. నగరంలోని ప్రధాన ఏరియాల్లో ఫుట్ ఫాత్ లు కబ్జాలకు గురవడం, అక్రమ కట్టడాల నిర్మాణం వంటి కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

వాటిని వెంటనే తొలగించడానికి అవరసమైన చర్యలు తక్షణమే చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నగరం స్వచ్ఛభారత్ దిశగా క్లీన్ సిటీ చేసే బాధ్యతను నాతో పాటు అందరూ తీసుకోవాలని, నిజామాబాద్ కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలన్నారు.

కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండటంతో కౌన్సిల్ సమావేశాలు త్వరలో నిర్వహించాలాన్నారు. డివిజన్ల వారిగా ఉన్న రోడ్లు , డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి తగిన నిధులు మంజూరు చేయాలన్నారు. , రోడ్లు, డ్రైనేజీల సమస్యలతో ప్రజలు పడుతున్న అవస్థలు దూరం చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజేందర్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్, మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story