ఇండియా టూర్.. హోవర్ టు ట్రంప్?

by Shamantha N |
ఇండియా టూర్.. హోవర్ టు ట్రంప్?
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. భారత పర్యటన ట్రంప్‌నకు ఇది తొలిసారే. కానీ, ఇండియాలో పర్యటించిన అమెరికా అధక్షుల్లో డోనాల్డ్ ఏడో వ్యక్తి. ట్రంప్ కన్నా ముందు ఆరుగురు అగ్రరాజ్య అధ్యక్షులు భారత్‌లో పర్యటించారు. అయితే, శ్వేతసౌధం అధిపతుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు భారత్‌లో పర్యటించారో బ్రీఫ్‌గా తెలుసుకుందాం…

డ్వైట్ డి.ఐసన్ హోవర్ (1959)

తొలిసారి భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి.ఐసన్ హోవర్. ఈయన 1959లో జవహర్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మనదేశాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రసగించారు. అలాగే, పార్లమెంట్‌లోని ఉభయసభల్లోనూ పాల్గొన్నారు. తాజ్‌మహల్‌ను సందర్శించి, లార్మ్డా అనే గ్రామంలో కొద్దిసేపు గడిపారు.

రిచర్డ్ నిక్సన్ (1969)

ఐసన్‌ హోవర్ తర్వాత భారత్‌లో పర్యటించిన రెండో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. శాంతి స్థాపన కోసం ఆసియా దేశాల పర్యటనలో భాగంగా 1969లో భారత్‌ను సందర్శించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు.

జిమ్మి కార్టర్ (1978)

భారత్‌లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్. జిమ్మి, ఆయన సతీమణితో కలిసి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వ హయాంలో 1978లో భారత్‌ను సందర్శించారు. వీరి పర్యటనలో భాగంగా హర్యానాలోని దౌలత్‌పూర్ అనే గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆ గ్రామానికి కార్టర్‌పురిగా పేరు మార్చారు.

బిల్ క్లింటన్ (2000)

జిమ్మికార్టర్ పర్యటన అనంతరం 20 ఏండ్ల వరకు అమెరికా అధ్యక్షులెవరూ భారత్‌లో పర్యటించలేదు. 20 ఏండ్ల తర్వాత 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పాయ్ హయాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియాను సందర్శించారు. ఈయన భారత్‌ను సందర్శించిన అమెరికా ప్రెసిండెంట్లలో నాలుగో వ్యక్తి. క్లింటన్.. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, హైదరాబాద్, ముంబై పట్టణాల్లో పర్యటించారు.

జార్జ్ డబ్ల్యూ.బుష్ (2006)

బిల్ క్లింటన్ తర్వాత భారత్‌లో పర్యటించిన ఐదో అధ్యక్షుడు జార్జ్ బుష్. 2006లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో బుష్ పర్యటించారు. ఈ పర్యటనలో భారత్, అమెరికాల మధ్య పౌర, అణు ఒప్పందాలకు సంబంధించిన సంతకాలు జరిగాయి.

బరాక్ ఒబామా స్పెషాలిటీ (2010, 2015)

ట్రంప్ కన్నా ముందు.. భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, భారత్‌లో రెండు సార్లు పర్యటించిన మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామానే కావడం విశేషం. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారి 2010లో నవంబర్ 6 నుంచి 9 వరకు పర్యటించారు. అనంతరం ప్రధాని మోడీ హయాంలో రెండోసారి 2015లో గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనవరి 24 నుంచి 27 వరకు ఆయన భారత్‌లో పర్యటించారు.

షేక్‌హ్యాండ్‌కు బదులు ఆలింగనం

మోడీ కన్నా ముందున్న భారత ప్రధానులు ప్రొటోకాల్ ప్రకారం.. అమెరికా అధ్యక్షులను షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చేవారు. కానీ, మోడీ ఆ విధానానికి స్వస్తి పలికినట్టు కనిపిస్తోంది. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన ఒబామాను, ట్రంప్‌లను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వీరిరువురితోనూ మోడీకి సత్సంబంధాలున్నాయి.

Read also..

అందాల తాజ్‌లో ..అగ్రరాజ్య దంపతులు

Advertisement

Next Story

Most Viewed