అమెరికావి అనుమానాలే.. ఆధారాలిస్తే నమ్ముతాం : డబ్ల్యూహెచ్‌వో

by vinod kumar |
అమెరికావి అనుమానాలే.. ఆధారాలిస్తే నమ్ముతాం : డబ్ల్యూహెచ్‌వో
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ పుట్టుకపై చైనాపై అగ్రరాజ్యం అమెరికా పలు ఆరోపణలు చేస్తోంది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని.. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఖండించింది. చైనాపై అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావని.. అవి కేవలం అనుమానాలేనని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగం అధిపతి మైఖేల్ ర్యాన్ స్పష్టం చేశారు. అమెరికా వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని అన్నారు. ఆధారాలు ఇచ్చే వరకు వాటిని అనుమానాలుగానే పరిగణిస్తామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా తీసుకోవడానికి డబ్ల్యూహెచ్‌వో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలో కూడా వైరస్ పుట్టుక గురించి అమెరికా వ్యాఖ్యలు చేసినప్పుడు డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. కరోనా సహజ సిద్ధంగా ఉద్భవించిందేనని స్పష్టం చేస్తూ అమెరికా అనుమానాలను ఖండించింది.

మరోవైపు కరోనా వైరస్ ఏ జీవిలో ఆవాసం ఏర్పరుచుకొని మానవ శరీరంలోకి ప్రవేశించిందో కనుగొనేందుకు జరుగుతున్న పరిశోధనపై డబ్ల్యూహెచ్‌వో దృష్టి సారించింది. ఈ విషయం ఎంత త్వరగా కనుక్కోగలిగితే.. అంత త్వరగా ప్రజా రోగ్య విధానాలను రూపొందించే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది. వైరస్ పుట్టుక, సంక్రమణపై చైనా శాస్త్రవేత్తలు ఇతర దేశాల పరిశోధకులతో కలసి పని చేస్తున్నారని ర్యాన్ తెలిపారు. ఈ విషయంలో చైనాపై తప్పులు నెట్టివేయడం ద్వారా మనకు కీలకమైన సమాచారం అందకుండా పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా వైరస్ పుట్టుక గురించిన పరిశోధనను పూర్తి చేస్తామని ర్యాన్ చెప్పారు. అనవసరమైన వ్యాఖ్యలతో రాజకీయ వైరం పెంచొద్దని పరీక్షంగా అమెరికాకు హితవు పలికారు.

Tags : Coronavirus, Covid 19, China, America, Wuhan Lab, World Health Organization, WHO, Micheal Ryan

Advertisement

Next Story

Most Viewed