డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు

by vinod kumar |
డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు
X

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా అతలాకుతలమైంది. భారీగా ప్రాణనష్టమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఒకవైపు కరోనా కట్టడి, నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో లాక్‌డౌన్ నిబంధనలపై సమీక్ష జరుపుతామని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నిబంధనలు సడలిస్తామని ట్రంప్ ప్రకటించారు. కాగా ఇదే సమయంలో ఆమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ట్రంప్ ఒక కార్యచరణకు శ్రీకారం చుట్టారు. పలు రంగాలకు చెందిన 200 మంది నిపుణులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఆరుగురు భారతీయ-అమెరికన్లకు చోటు దక్కింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద కృష్ణ, మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రతా, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, పెర్నోర్డ్ రిచర్డ్‌కు చెందిన ఆన్ ముఖర్జీలు ఉన్నారు. కాగా వీరిలో సత్య నాదెళ్ల, అరవింద కృష్ణ తెలుగు వాళ్లు కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు ఈ 200 మంది అవసరమైన ప్రణాళికలు, సలహాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందిస్తారు. ఈ బృందంలోని సభ్యులను ఆయా రంగాల వారీగా విభజించారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అరవింద కృష్ణ, సంజయ్ మెహ్రతా టెక్నాలజీ గ్రూప్‌లో.. ఆన్ ముఖర్జీ తయారీ రంగం, బంగాను ఫైనాన్స్ రంగంలో సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా రంగాలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్ల సన్ మైక్రో సిస్టమ్‌లో తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరి అంచలంచలుగా ఎదిగారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాన్ని విజయవంతంగా నడిపించిన నాదెళ్ల.. ఆ తర్వాత బిల్‌గేట్స్ వారసుడిగా మైక్రోసాఫ్ట్‌‌ను నడిపించే బాధ్యతలను చేపట్టారు. ప్రపంచంలో పవర్ ఫుల్ సీఈవోలలో సత్య నాదెళ్ల ఒకరు. ఇక ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అరవింద కృష్ణ 1990లో ఐబీఎంలో చేరారు. ఐబీఐలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈయన హయాంలోనే రెడ్ హ్యాట్ సంస్థను ఐబీఐం 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి 31న ఐబీఎం సీఈవోగా ప్రమోషన్ పొందిన అరవింద్ కృష్ణ.. ప్రపంచంలో టాప్ సంస్థల భారతీయ సీఈవోల లిస్టులో చేరారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సరసన నిలిచిన అరవింద కృష్ణకు ట్రంప్ టీంలో స్థానం దక్కడం విశేషం.

Tags: America, donald trump, advisers, satya nadella, aravind krishna, corona

Advertisement

Next Story

Most Viewed