మామిడికాయ పచ్చడి తెచ్చిన కరోనా

by vinod kumar |   ( Updated:2020-06-01 04:44:46.0  )
మామిడికాయ పచ్చడి తెచ్చిన కరోనా
X

దిశ, మహబూబ్‌నగర్: గ్రామంలో అందరికీ మామిడికాయ పచ్చడి పంచాలని భావించిన ఓ ప్రజాప్రతినిధి భర్తకు తంటాలు తెచ్చి పెట్టింది. పచ్చడి పేరు వింటే ప్రస్తుతం ఆ గ్రామం భాయాందోళనకు గురవుతోంది. వివరాళ్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి భర్త ఊరంతా మామిడికాయ పచ్చడి పంపిణీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాద్‌‌‌‌నగర్‌‌‌‌లో ఉంటున్న తన బంధువు(చిట్టీల వ్యాపారి) దగ్గరకు 18వ తేదీన వెళ్లారు. అయితే ఆ వ్యాపారి అప్పటికే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌‌‌‌లోని జియాగూడకు వెళ్లొచ్చారు. దీంతో అధికారులు ఆయన వద్ద శాంపిల్స్ తీసుకెళ్లారు. అప్పటికింకా రిపోర్టు రాలేదు. ఈ క్రమంలో ఆ ప్రజాప్రతినిధి భర్త, చిట్టీల వ్యాపారి.. మామిడి తొక్కు పెట్టేవారిని కలిసి తొక్కు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు.

2 క్వింటాళ్ల పచ్చడి – ఉప్మా

తిరిగి ఊరికొచ్చిన ప్రజాప్రతినిధి భర్త.. గ్రామంలో మీటింగ్‌‌ పెట్టి విషయం అందరికీ చెప్పాడు. అదే రోజు రెండు పంచాయితీలను పరిష్కరించారు. 20న షాద్‌‌‌‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొల్లూరుకు వచ్చారు. ఆ రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల పచ్చడి పెట్టారు. అంతా దాన్ని రుచి చూశారు. వారితోనే ఉప్మా వండించుకొని కూడా తిన్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్​చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ, అదే రోజు చిట్టీల వ్యాపారితో పాటు, పచ్చడి పెట్టిన ఇద్దరికీ తర్వాతి రోజు పాజిటివ్ వచ్చింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరిలోనూ భయం మొదలైంది. దీంతో ఆ పచ్చడి మొత్తాన్ని గ్రామ డంప్‌‌‌‌ యార్డులో పడేశారు. ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్‌‌‌‌ ఇచ్చారు. పచ్చడి పెట్టిన వాళ్లతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 12 మందికైనా టెస్టులు చేయండని వేడుకున్నారు. కానీ లక్షణాల్లేనిదే టెస్టులు చేయబోమని చెప్పి ప్రజాప్రతినిధి భర్తతో పాటు 12 మందిని, వారి కుటుంబ సభ్యులు సహా మరో 100 మందిని హోం క్వారంటైన్ పంపారు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో షాపులు కూడా తీయడం లేదు. ప్రజాప్రతినిధి భర్తతోపాటు పలువురికి కరోనా లక్షణాలున్నాయని చెబుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఎవరికీ వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story