దిశ ఎఫెక్ట్: ఆగ్రోస్ కబ్జా బాగోతం బట్టబయలు

by Anukaran |
దిశ ఎఫెక్ట్: ఆగ్రోస్ కబ్జా బాగోతం బట్టబయలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూమిని కబ్జా చేసి తక్కువ ధరకే ఇంటి ప్లాట్ అమ్ముతున్నామని అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నవారిని శనివారం నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఆగ్రోస్ సంస్థకి చెందిన భూములు రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో ఉన్నాయి. అందులో దాదాపు 24 ఎకరాలు నగరంలోని మారేడ్‌పల్లి, ఉప్పల్ రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. ఆగ్రోస్ భూములు కబ్జాకి గురయ్యాయంటూ ఏప్రిల్ 3 న ‘కబ్జా కోరల్లో ఆగ్రోస్ భూములు’ శీర్షికన ‘దిశ’లో ప్రచురించారు. దీంతో ఆగ్రోస్ దర్యాప్తు ప్రారంభించి, రెవెన్యూ అధికారులతో తన భూములను సర్వే చేయించింది.

ఆగ్రోస్ భూములకు ఆనుకొని పక్కనే ఉన్న 28,28/3 సర్వే నెంబరులో ఉన్న ప్లాట్లను తక్కువ రేటుకే ఇస్తున్నామని తమ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నారని ఫిర్జాదీగూడ కు చెందిన కాటమయ్య, ఉప్పల్ కి చెందిన తోకల సునీత లు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ప్రకారం 2015లో 28, 28/3 సర్వే నెంబరు లో 80,87 గజాల ప్లాట్లను ఎ-1 మాదిరాజు లావణ్య, ఎ-2 ఎండీ అబ్దుల్ మాజిద్ లు అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఐదేళ్ళు గడుస్తున్నా భూములు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని, అంతేకాకుండా తమకు చూపించిన భూమి వీరిది కాదని తెలియడంతో మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. తమతో పాటు ఎంతో మంది మోసపోయారని వారు కూడా బయటకొస్తారని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు కేసుల్లో ఎ1, ఎ2 లను శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed