ఆ ఎడబాటును తట్టుకోలేక కవలలు ఆత్మహత్య..

by Anukaran |   ( Updated:2021-07-06 05:14:46.0  )
karnataka news
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ కవలలు.. ఒకరి కోసం ఒకరిలా బ్రతికారు. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. రక్త సంబంధం, అక్కాచెల్లెళ్ల పేగు బంధం.. మధ్యలో వచ్చే వివాహ బంధం వేరు చేస్తుంది అనుకున్నారు. తల్లిదండ్రులు పెళ్లి చేస్తే విడిపోతామనే భయం వారికి ఊపిరాడకుండా చేసింది. ఏం చేయాలి.. ఒకటిగా ఉండలేకపోతే.. ఒకటిగానే చనిపోదాం అని అనుకున్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక తనువూ చాలించారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే మాండ్యా జిల్లా హనసనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతులకు దీపిక, దివ్య (19) అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. ఇప్పటివరకు వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లలు ఎదిగారు అని భావించిన తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయాలనీ భావించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లకి ఒకే ఇంట్లో సంబంధాలు చూడాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, వీలుపడలేదు. ఈక్రమంలో కుమార్తెలకు వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.ఈ విషయాన్ని పిల్లలకు తెలిపారు. దీంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

వివాహమైతే ఇద్దరం ఒకే చోట ఉండలేమని ఆవేదన చెంది శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో తమ గదుల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కళకళలాడే తమ బిడ్డలు ఇల్లు చీకటి చేశారని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed