- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తుళు’ అధికార భాషోద్యమం
దిశ, ఫీచర్స్ : ‘ప్రతి మైలుకీ నీరు మారిపోతుంది.. ప్రతి నాలుగు మైళ్లకీ భాష మారిపోతుంది’ అనే నానుడిలో నిజం లేకపోలేదు. అఖండ భారతాన అసేతు హిమాచలం భాషల భిన్నత్వం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆయా భాషలు తరతరాల సామాజిక సాంస్కృతిక సంపదను అందించడమే కాకుండా మానవ వికాసానికి, సంబంధాలకు ప్రధాన వారధిగా నిలిచాయి. అంతేకాదు ఓ సమూహానికి గుర్తింపునివ్వడంతో పాటు.. మనిషి ఆలోచన, అంతరంగాన్ని కూడా ప్రభావితం చేశాయి. అలా మనిషి అభ్యున్నతిలో వికసించి, వెలుగులు పంచి.. భాసించిన ‘భాష’లన్నీ అద్భుతమే. కానీ అన్నింటికన్నా శక్తివంతమైనది, మధురమైనది మాత్రం ‘మాతృభాషే’. అలాంటి గొప్పనైన తల్లిభాషను కాపాడుకోవడం బాధ్యత కాగా, దాని ఆత్మగౌరవానికి సమస్య ఎదురైనప్పుడు పోరాటం సాగించడం మన ధర్మం. ఇప్పటికే ఎన్నో భాషోద్యమాలను చూశాం. ప్రస్తుతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ‘తుళు’ను అధికారిక భాషగా ప్రకటించాలంటూ ట్విట్టర్ వేదికగా తుళు ప్రజలు పోరాటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ భాషా చరిత్రతో పాటు విద్య, కళలు, సంస్కృతిలో దాని ఔచిత్యాన్ని తెలుసుకుందాం.
ద్రవిడ భాషా కుటుంబంలో మొత్తం 80 రకాల భాషలు (భాషలు, యాసలు కలిపి) ఉన్నాయని అధ్యయనకారులు గుర్తించారు. దక్షిణ, మధ్య భారతంతో పాటు పొరుగు దేశాల్లోని ఇండియన్స్ ఆయా ద్రవిడ భాషలు మాట్లాడతారు. ఇక ద్రవిడ కుటుంబంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కలిగి ఉండగా.. ఆ జాబితాలో ‘తుళు’ కూడా ఒకటి. ఇండియాలో 20 లక్షల మంది ప్రజలు తుళును మాతృభాషగా (2011 అంచనాలు) మాట్లాడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా నలభై లక్షల మంది ఉన్నట్లు అంచనా. తుళు మాట్లాడే వారిని ‘తుళువ లేదా తుళు’ ప్రజలుగా పిలుస్తుండగా, ఆ ప్రాంతాన్ని ‘తుళునాడు’గా పేర్కొంటున్నారు. సంగం కాలానికి (క్రీ.శ. 200) చెందిన తమిళ కవి మాములార్ తన కవితలో తుళునాడు గురించి వివరించగా, హల్మిడి శాసనాల్లో తుళు దేశాన్ని ‘అలుపాస్’ రాజ్యంగా గుర్తించారు. బ్రిటీష్ చరిత్రకారుడు రాబర్ట్ కాల్డ్వెల్ (1814-1891) తన ‘ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్’ పుస్తకంలో ఈ భాష గురించి వివరిస్తూ.. ద్రవిడంలో అత్యంత అభివృద్ధి చెందిన భాషల్లో ‘తుళు’ ఒకటని అభివర్ణించాడు.
డిమాండ్ ఫర్ వాట్?
కర్నాటకలోని మంగళూరు, ఉడిపి, మంజేశ్వరం, అలాగే కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల్లో ‘తుళు’ భాష మాట్లాడతారు. తులునాడుకు చెందినవారు రాజకీయ, సినీరంగాల్లో రాణిస్తుండగా.. సౌత్ ఇండియా ప్రముఖ నటులైన ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, దీపికా పదుకొణె, ప్రకాష్ రాజ్, అనుష్క శెట్టి తదితరులు కూడా అక్కడివారే. లక్షలాది మంది ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, ప్రాచీన భాషగా వెలుగొందుతున్నా సరే ఇప్పటివరకు అధికారిక భాషగా గుర్తించకపోవడంతో.. కేరళ, కర్ణాటకలో ‘తుళు’కు అధికారిక భాషా హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా #TuluOfficialinKA_KL హ్యాష్‌ట్యాగ్ ప్రచారం మొదలైంది. పలు తుళు సంస్థలు ప్రారంభించిన ఈ ఉద్యమానికి రాజకీయ నాయకులు, తీర ప్రాంత ప్రజలు సపోర్ట్ ఇస్తుండగా, కేవలం ఒక్క రోజులోనే ట్విట్టర్‌లో 2.5 లక్షల మందికిపైగా నెటిజన్లు ఈ భాషోద్యమానికి మద్ధతు తెలిపడం విశేషం. అయితే తమ భాషకు అధికార హోదా కోసం గతంలోనూ ఇక్కడి ప్రజలు ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2017లో ‘జై తుళునాడు’ సభ్యులు ఆన్‌లైన్ ప్రచారం నిర్వహించగా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకులతో పాటు స్థానికులు మద్ధతు పలికారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పుడు, తుళునాడుకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఉండకూడదు? అని అక్కడి స్థానిక ప్రజలు డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎడ్యుకేషన్
కర్ణాటక ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ‘తుళు’ను హైస్కూల్ విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్‌గా చేర్చింది. రాష్ట్ర విద్యా శాఖ ప్రకారం 2020 సంవత్సరంలో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలకు చెందిన 956 మంది (ఎస్‌ఎస్‌ఎల్‌సి)10వ తరగతి విద్యార్థులకు తుళును థర్డ్ ఆప్షనల్ లాంగ్వేజ్‌గా పరీక్ష నిర్వహించింది. 2020లో తుళును కొత్త జాతీయ విద్యా విధానంలో (ఎన్‌ఇపి) చేర్చాలని డిమాండ్ చేస్తూ ‘జై తులునాడు’ ఆన్‌లైన్ ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో #EducationInTulu అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేయడంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా తమ భాషను బోధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యక్షజ్ఞానం, పడ్డానా వంటి జానపద పాటల రూపాలతో ‘తుళు’భాష ఊపిరి పోసుకోగా, అవి భావితరాలకు భాషా సంపదగా నిలవనున్నాయి. ఇక తుళు చిత్ర పరిశ్రమ చాలా చిన్నది కాగా సంవత్సరానికి ఐదు నుంచి పది చిత్రాలు విడుదలవుతుంటాయి. మొదటి చిత్రం ‘ఏన్నా తంగాడి’ 1971లో విడుదల కాగా.. మంగళూరు, ఉడిపిలో రోజుకు ఒక థియేటర్‌లోనైనా తుళు చిత్రాలు ప్రదర్శితమవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ప్రస్తుతం 22 భాషలుండగా, తుళును కూడా అదే షెడ్యూల్‌లో చేర్చడం వల్ల సాహిత్య అకాడమీ గుర్తింపు లభించి, భాషాభివృద్ధి జరుగుతుందని తుళు ప్రజలు కోరుకుంటున్నారు.
దక్షిణ కన్నడ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ తుళులో ట్వీట్ చేశారు. 8వ షెడ్యూల్‌లో తుళును చేర్చేందుకు ప్రయత్నాలు, చర్చలు జరుగుతున్నాయని, కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి తమ ప్రభుత్వ హయాంలోనే అధికారిక భాషగా ప్రకటిస్తామన్నారు. ఇక దక్షిణ కన్నడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోటా శ్రీనివాస్ పూజారీతో పాటు కన్నడ సినీ నటులు, స్థానికంగా తుళు మాట్లాడే రక్షిత్ శెట్టి, పృథ్వీ అంబార్ కూడా ట్విట్టర్ ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేశారు.
తుళు మన ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక సంస్కృతి. అధికార హోదా కోసం మనమంతా ఒక్కటి కావాలి – మాజీ ఎమ్మెల్సీ గణేశ్ కార్నిక్
తుళు మన మాతృభాష, మనలో ప్రతీ ఒక్కరం తుళు అధికారిక భాష హోదా పొందాలని కోరుకుంటున్నాం. అందుకోసం పోరాటం చేద్దాం – ఎమ్మెల్యే వేదవ్యాస్ కమాత్