Israel-Hezbollah ceasefire: ఇజ్రాయెల్- హెజ్ బొల్లా కాల్పుల విరమణపై భారత్ హర్షం

by Shamantha N |
Israel-Hezbollah ceasefire: ఇజ్రాయెల్- హెజ్ బొల్లా కాల్పుల విరమణపై భారత్ హర్షం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ (Israel-Hezbollah ceasefire) ఒప్పందం జరిగింది. ఈనిర్ణయంపై భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) బుధవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇజ్రాయెల్‌ (Israel), లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని మేం ఎప్పుడూ కోరుతున్నాం. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం వస్తాయని మేం విశ్వాసంగా ఉన్నాం’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. ఇకపోతే, ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలతో సహా ఐక్యరాజ్యసమితి కూడా స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే?

ఇకపోతే, 60 రోజులపాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్‌ భద్రతా వ్యవహారాల కేబినేట్ ఆమోదం తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ Joe Biden)కు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్‌ పైనే ఆధారపడి ఉందన్నారు. ‘‘మేం ఒప్పందాన్ని అమలు చేస్తాం. కానీ, ఉల్లంఘనలు జరిగితే మాత్రం ప్రతిస్పంన తీవ్రంగా ఉంటుంది. విజయం సాధించేవరకు మేం ఐక్యంగా పోరాడుతాం’’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed