విద్యార్థినుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి : హ‌న్మ‌కొండ ఆర్డీవో

by Aamani |   ( Updated:2024-11-27 12:38:08.0  )
విద్యార్థినుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి : హ‌న్మ‌కొండ ఆర్డీవో
X

దిశ‌, వ‌ర్ధ‌న్న‌పేట : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని క‌స్తూర్బాగాంధీ బాలిక‌ల విద్యాల‌యం సిబ్బందికి హ‌న్మ‌కొండ ఆర్డీవో ర‌మేష్ రాథోడ్ సూచించారు. హ‌న్మ‌కొండ జిల్లా ఐన‌వోలు మండ‌లంలోని కేజీబీవీ హాస్ట‌ల్‌ను బుధ‌వారం ఆర్డీవో ర‌మేష్ రాథోడ్ త‌హ‌సీల్దార్ విక్ర‌మ్‌కుమార్‌, ఐన‌వోలు ఎంపీడీవోతో క‌లిసి త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. విద్యాలయాల్లో కిచెన్‌ గదులు, కూరగాయలు, వంట సరుకుల స్టోర్‌ రూమ్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు తాజా కూరగాయలు, ఆకుకూరలతో భోజనం వడ్డించాలన్నారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వంట ఏజన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈసంద‌ర్భంగా హాస్ట‌ల్‌లో అందుతున్న భోజ‌నంపై విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెనుపై ఆరా తీశారు. హాస్ట‌ల్ అంత‌టా క‌లియ‌తిరిగిన ఆర్డీవో వ‌స‌తుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. నిత్యం హాస్ట‌ల్‌ను శుభ్రంగా ఉంచాల‌ని, విద్యార్థినులు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా చూడాల్సిన బాధ్య‌త సిబ్బందిపై ఉంద‌న్నారు. అంత‌కు ముందు ఐన‌వోలు త‌హ‌సీల్దార్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ఆర్డీవో కార్యాల‌య సిబ్బందితో మాట్లాడారు. కార్యాల‌యానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు త్వ‌రిత గ‌తిన సేవ‌లందే విధంగా ప‌నిచేయాల‌ని, సేవ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పాటించాల‌ని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed