ఇదేం న్యాయం

by Sridhar Babu |
ఇదేం న్యాయం
X

దిశ, వైరా : అక్రమ నిర్మాణాల విషయంలో వైరా మున్సిపాలిటీ అధికారులు ద్వందనీతిని ప్రదర్శిస్తూ రెండు నాలుకల విధానాన్ని అవలంబిస్తున్నారు. కొంతమందికి ఒక న్యాయం, మరి కొంతమందికి ఇంకో న్యాయం అమలు చేస్తూ మున్సిపాలిటీ అధికారులు తమ పక్షపాత ధోరణిని చాటుతున్నారు. వైరాలో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని రెండు భవనాలను మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు.

అయితే మరికొన్ని భవనాలకు, వ్యాపార సముదాయాలకు ఈ నిబంధనను అమలు చేయకుండా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటికే అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు, వ్యాపార సముదాయాలకు రెండుసార్లు నోటీసులు మంజూరు చేసిన అధికారులు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు గురించి మరిచిపోయారు.

ఆ వ్యాపార సముదాయాలకు నిబంధనలు వర్తించవా...?

వైరాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు భవనాలను ఇటీవల మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. గాంధీ చౌక్ లో ఒక భవనాన్ని, కాంగ్రెస్ కార్యాలయం ముందు మరో భవనాన్ని సీజ్ చేసిన అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు భవనాలను తెరవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన అనేక వ్యాపార సముదాయాలకు అధికారులు ఈ నిబంధనను అమలు చేయడం లేదు. వైరాలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన భారీ గోడౌన్ లో వజ్రా టీవీఎస్ షోరూంను గత ఆరు నెలలుగా నిర్వహిస్తున్నారు.

అయితే అనుమతులు లేని ఈ వ్యాపార సముదాయంపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కేవలం రెండుసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆరు నెలలుగా ఈ వ్యాపార సముదాయం పై కనీస చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా వైరాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిబంధనకు విరుద్ధంగా ఓ భవనాన్ని నిర్మించారు. సుమారు 130 గజాల స్థలంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించి పలు వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ అనుమతులు పొంది ఈ వ్యాపార సముదాయాన్ని నిర్మించడం విశేషం. అంతేకాకుండా ఎలాంటి పార్కింగ్ సౌకర్యం లేకుండా మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపార సముదాయం నిర్మించారు.

అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్ లో, తల్లాడ రోడ్లో రేకులతో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు వైరాలో పలు అనుమతి లేని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ద్వంద వైఖరి ప్రదర్శించటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయమై వైరా టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ ను దిశ వివరణ కోరగా అనుమతుల్లేని అన్ని భవనాలపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు వ్యాపార సముదాయాలకు రెండు సార్లు నోటీసులు ఇచ్చామని వివరణ ఇచ్చారు. మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశిస్తే అన్ని భవనాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story