TTD ఆకృతిలో బాలాపూర్ గణేశ్ మండపం.. ఈసారి వేలం పాటకు ఒకే..!

by Shyam |   ( Updated:2021-09-09 11:52:05.0  )
TTD ఆకృతిలో బాలాపూర్ గణేశ్ మండపం.. ఈసారి వేలం పాటకు ఒకే..!
X

దిశ, జల్​‌పల్లి : వేలం పాటలో బాలాపూర్​ గణేష్​ లడ్డు తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా గణనాథున్ని బాలాపూర్​ గ్రామస్థులు 1980లో గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్​లో ప్రారంభమైన గణేష్​ లడ్డుకు దేశవ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు లభించింది. బాలాపూర్​ గణేష్​ లడ్డుకు 26ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉంది. 2020లో కరోనా కారణంగా లడ్డు వేలం పాటకు మొట్టమొదటి సారి బ్రేక్​ పడింది. తిరిగి ఈ యేడు లడ్డు వేలం పాట నిర్వహించనున్నట్టు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో కదిలే తొలి వినాయకుడు బాలాపూర్​ గణపతి. ఈ వినాయకుని చేతిలోని లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న వారు అష్టఐశ్వర్యాలతో తులతూగుతారన్న నమ్మకంతో పంటపొలాల్లో.. వ్యాపార కేంద్రాలలో.. ఇళ్లలో చల్లుతారు. వందల్లో ప్రారంభమైన లడ్డు వేలం రూ. వేల నుంచి ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు సైతం ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడం విశేషం. గణేష్​ నిమజ్జనం సామూహిక ఊరేగింపు రోజున తెల్లవారు జామున బాలాపూర్​ గణేష్​ ప్రతిమను గ్రామంలో ఊరేగిస్తారు. ఉదయం 9 గంటలకు బాలాపూర్​ బొడ్డురాయి ప్రాంతంలో వేలం పాట అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతుంది. 21 కిలోల లడ్డు 1116 రూపాయలతో వేలం పాట ప్రారంభం అవుతుంది. వేలం పాటలో పాల్గొనడానికి నగర శివార్ల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి బాలాపూర్​‌కు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. వేలం పాట ద్వారా గడిచిన 26 ఏళ్లలో 13,387,955.14 కోట్ల రూపాయలు బాలాపూర్​ గణేష్​ అసోసియేషన్​ సొంతమయ్యాయి.

రూ.54 లక్షల 68 వేలతో బాలాపూర్​లో అభివృద్ది పనులు..

వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బాలాపూర్​ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నేపధ్యంలో బాలాపూర్​ గణేష్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో బాలాపూర్​లో హనుమాన్​ మందిరం, లక్ష్మీగణపతి మందిరం నిర్మాణాలకు 28 లక్షల 55 వేల రూపాయలు, బాలాపూర్​ హైస్కూల్​కు 1.45లక్షలు, వేణుగోపాల్​ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 1.12 లక్షలు, మహబూబ్​నగర్​ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు, పోచమ్మ మందిరం నిర్మాణానికి 10,50,000 లక్షలు, గణేష్​ చౌక్​కు 90 వేల రూపాయలు , శివాలయం అభివృద్ది పనుల నిమిత్తం 2,36,000 లక్షలు, మహంకాళి మందిరం నిర్మాణానికి 8,55,000, మల్లన్న మందిరం నిర్మాణానికి లక్ష రూపాయలు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 25000, మొత్తం 54లక్షల 68 వేల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పలువురికి బాలాపూర్​ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.

టీటీడీ దేవస్థానం నమూనాలో గణేష్​ మండప నిర్మాణం..

తిరుపతి దేవస్థానం ఆకృతిలో భారీ గణేష్​ మండపాన్ని నిర్మిస్తున్నారు. కలకత్తాకు చెందిన 56 మంది కళాకారుల బృందం గత వారం రోజులుగా ఈ మండప ఏర్పాటులో నిమగ్నం అయ్యారు. 21 కిలోల లడ్డు, 15 ఫీట్ల ఎత్తులో గణేష్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

వేలం పాటలో గణేష్​ లడ్డును సొంతం చేసుకుంది వీరే…

1994లో జరిగిన బాలాపూర్​ లడ్డు వేలం పాటలో కొలన్​ మోహన్​రెడ్డి రూ. 450 కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 4500, 1996లో కొలన్​ క్రిష్ణారెడ్డి రూ.18000, 1997లో కొలన్​ క్రిష్ణా రెడ్డి రూ.28000, 1998లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.51000, 1999లో కళ్లెం అంజిరెడ్డి రూ. 65000, 2000లో కళ్లెం ప్రతాప్​ రెడ్డి రూ. 66000, 2001లో జి.రఘునందన్​ చారి రూ. 85000, 2002లో కనడ మాధవరెడ్డి రూ.1,05,000, 2003లో చిగిరింత బాల్​రెడ్డి రూ.1,55,000, 2004లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 2,01,000, 2005లో ఇబ్రం శేఖర్​ రూ. 2,08,000, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ. 3,00,000, 2007లో జి.రఘునందన్​ చారి రూ. 4,15,000, 2008లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.5,07,000, 2009లో సరిత రూ. 5,10,000, 2010లో కొడాలి శ్రీధర్​ బాబు రూ. 5,35,000, 2011లో కొలన్​ బ్రదర్స్​ రూ. 5,45,000, 2012లో పన్నాల గోవర్థన్​ రెడ్డి రూ. 7,50,000, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000, 2014లో సింగిరెడ్డి జైహింద్​ రెడ్డి రూ. 9,50,000, 2015లో కళ్లెం మాధవ మోహన్​ రెడ్డి రూ. 10,32000, 2016లో స్కైలాబ్​ రెడ్డి రూ. 14, 65,000, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15,60,000, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్​ గుప్త రూ. 16,60,000, 2019లో కొలన్​ రామ్​ రెడ్డి రూ.17,60,000 లక్షలకు బాలాపూర్​ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు.

ఈయేడు వేలం పాటను నిర్వహిస్తాం..

గత యేడు కొవిడ్​ కారణంగా బాలాపూర్​ గణేష్​ లడ్డు వేలం పాట వేయలేకపోయామని, తిరిగి ఈయేడు వేలం పాటను నిర్వహిస్తామని బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్​ రెడ్డి స్పష్టంచేశారు. ఈయేడు కొవిడ్​ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేష్​ నవరాత్రుల్లో ప్రతీరోజు 10 వేల మంది బాలాపూర్​ గణేషున్ని దర్శించుకుంటారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సారి బాలాపూర్​ వినాయక విగ్రహానికి కళ్లు, చెవులు కదిలే విధంగా ప్రత్యేకంగా తయారు చేయించినట్టు నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు.

-అధ్యక్షుడు కళ్లెం నిరంజన్​ రెడ్డి

Advertisement

Next Story