రెవెన్యూ కోసం టీఎస్ సర్కార్ న్యూ ప్లాన్.. అమ్మేస్తే పోలా?

by  |
రెవెన్యూ కోసం టీఎస్ సర్కార్ న్యూ ప్లాన్.. అమ్మేస్తే పోలా?
X

భూ అమ్మకాలపైనే సర్కారు భారం వేసుకున్నది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపిస్తూ హౌసింగ్​బోర్డు భూములను అమ్మకానికి పెడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. హౌసింగ్​బోర్డు డివిజన్ల వారీగా చేతిలో ఉన్న భూమి లెక్కలు తేల్చారు. దాదాపుగా 894 ఎకరాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. గతేడాది నుంచి ఈ భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అవకాశంగా దొరికింది. ఈ భూముల విక్రయాల ద్వారా రూ.50 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇవి సమకూరితే బడ్జెట్‌లో కూడా స్పెషల్​ఫండ్‌గా రూ.50 వేల కోట్లను పెట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వానికి ఇప్పుడు భూ అమ్మకాలే ప్రధాన వనరుగా కన్పిస్తోంది. దీంతో హౌసింగ్ బోర్డు పరిధిలో 894 ఎకరాల భూమిపై దృష్టి పెట్టింది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టు పక్కల భూములపైనే కేంద్రీకరించింది. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలపై ఈసారి రూ.50 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ 651 ఎకరాలు అమ్మితేనే రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటితో పాటుగా వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, మెదక్​ లాంటి ఉమ్మడి జిల్లాల పరిధిలో 243 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి ద్వారా సుమారు రూ.10 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. వేలం ద్వారానే వీటిని అమ్మకం చేయాలని అధికారులు నివేదికలో సూచించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

గంపగుత్తనా.. ప్లాట్లా?

హౌసింగ్ బోర్డు భూములకు చాలా డిమాండ్​ఉంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలువ పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని భూములు హాట్​కేకుల్లా ఉంటున్నాయి. అయితే వీటిని కొన్ని సంస్థలకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నా, వేలం వేయాలని ఇప్పటికే కేబినెట్​సబ్​కమిటీ పేర్కొంది. దీంతో సదరు సంస్థలను వేలానికి రావాలని సూచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలకమైన నేతలకు కూడా ఈ భూములను ఆనుకుని కొద్దిమేరకు భూమి ఉందని తెలుస్తోంది. వారు కూడా వీటిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్నిచోట్ల గంపగుత్తగా వీటిని అమ్మేందుకు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎలా అమ్మితే ఎంత మేరకు ఆదాయం వస్తుందనే అంశాలపై కూడా పరిశీలన చేస్తున్నారు.

బడ్జెట్‌లో స్పెషల్ ఫండ్‌?

హౌసింగ్​బోర్డు భూములపై ప్రభుత్వం ఆచితూచీ వ్యవహరిస్తోంది. గతేడాదే హైదరాబాద్​శివారులోని కోకాపేటలోని సుమారు 100 ఎకరాలను అమ్మి రూ.10 వేల కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం స్పెషల్​ఫండ్‌ను కూడా బడ్జెట్‌లో చూపించింది. కానీ దీనిపై కోర్టు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఈ భూములపై ప్రభుత్వమే నెగ్గింది. దీంతో వీటిని ఇప్పుడు అమ్మకానికి పెడుతోంది. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శివారులోని భూములను అమ్మితే రూ.40వేల కోట్లు వస్తాయని హౌసింగ్​బోర్డు అధికారులు ప్రాథమిక నివేదికలో సూచించారు. జిల్లాల్లోని భూములకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వేశారు. ఇలా మొత్తం రూ.50 వేల కోట్లు సమకూరితే బడ్జెట్‌లో కూడా స్పెషల్​ఫండ్‌గా రూ.50 వేల కోట్లను పెట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పుతున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఇది అతిపెద్ద ఊరట కానుంది.

త్వరలోనే..

హౌసింగ్ బోర్డు భూములపై ప్రభుత్వానికి సంబంధిత అధికారులు పూర్తి నివేదికను అందించారు. ఇటీవల ప్రగతిభవన్​నుంచి వీటిపై వివరాలడిగారు. దీంతో పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే హౌసింగ్​బోర్డు భూముల అమ్మకం మొదలుకానున్నట్లు చెప్పుతున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత వేలానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed