ఆ బిల్లు అమలుపై అనుమానాలు

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ బిపాస్ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. కొత్త మున్సిపల్ చట్టం -2019లోని సెక్షన్ 172 నుంచి 193 ప్రకారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భూములు, భవన నిర్మాణాల అభివృద్ధికి సంబంధించి, పట్టణ ప్రణాళిక కార్యకలాపాల పనుల విషయంలో నిబంధనలు రూపకల్పన చేశారు. అదే చట్టంలోని సెక్షన్ 238 ద్వారా సంక్రమించిన అధికారాలను పురస్కరించుకుని గతంలో సర్కారు జారీచేసిన జీవో 245, జీవో 168లో జారీచేసిన భవన నియమాలకు సవరణలు ప్రతిపాదిస్తూ తెలంగాణ సర్కారు టీఎస్ బిపాస్ బిల్లును ప్రవేశపెట్టింది. సోమవారం జరిగిన శాసనసభలో సభ్యుల చర్చ అనంతరం టీఎస్ బిపాస్ బిల్లుకు ఆమోదం లభించింది.

అధికారులు, ప్రజల్లో సందేహాలు..

టీఎస్ బిపాస్ బిల్లు ఆమోదం వరకు బాగానే ఉన్నా, అమలుపైనే అన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలు రూపొందిస్తున్నారు, వాటితో మార్గనిర్దేశకాలను తయారుచేసి జీవోలను విడుదల చేస్తున్నారు. కానీ, అమలు చేసేందుకు పటిష్ఠమైన అధికార యంత్రాంగం కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం 2019 వచ్చి ఏడాది గడుస్తున్నా అందులో పొందుపరిచిన సెక్షన్లు నేటికీ కార్యరూపంలోకి రాలేదు.

మరి టీఎస్ బిపాస్ ఏమేరకు సమర్థవంతంగా కార్యరూపంలోకి వస్తుందా? అనే దానిపై ఇటు అధికారుల్లోనూ, అటు ప్రజల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జీవో 87ను తీసుకొచ్చి నిర్మించే భవనంలోని 10 శాతం భవనాన్ని మార్టిగేజ్ చేసుకుంటున్న అధికార యంత్రాంగం ఆ జీవోను అమలు పరచడంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తుంది. 87 జీవోను సవరించి జీవో 168ను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మార్టిగేజ్‌లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

జీవో 67 ప్రకారంగా స్థానిక సంస్థ (Executive Authority)లు తమతమ పరిధిలో అనధికారిక నిర్మాణాలు, లేఅవుట్లు రాకుండా నియంత్రించేందుకు పర్యవేక్షణ చేయాలి. ఎగ్జిక్యూటివ్ అథారిటీలపై జిల్లా పంచాయతీరాజ్ అధికారి పర్యవేక్షణచేసి బాధ్యతలను విస్మరిస్తే చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లు వెలుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం ద్వారా టీఎస్ బిపాస్ అమలుతో ఎస్‌టీఎఫ్‌లు తెరపైకి వచ్చాయి. ఇవి ఏ మేరకు సక్సస్ అవుతాయో చూడాలి.

జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఎస్‌టీఎఫ్‌లు..

అనధికారిక నిర్మాణాలను, లేఅవుట్లను, భూముల అభివృద్ధి విషయాలను క్రమంగా పరిశీలించడం, తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (Special Task Force) బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందానికి అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహఅధ్యక్షుడిగా, సభ్యులుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఎస్ఈ లేదా ఈఈ (Public Health), ఇరిగేషన్ నుంచి ఎస్ఈ లేదా ఈఈ, ప్రభుత్వం లేదా ఈ బృందంతో నామినేట్ చేయబడిన ఇతర అధికారి, జిల్లా హెడ్‌క్వార్టర్ కమిషనర్ పట్టణ స్థానిక సంస్థ సభ్యసమావేశకర్తగా వ్యవహరిస్తారు.

ఈ ఎస్‌టీఎఫ్ తనకు కావాల్సిన ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేసుకుంటుంది. స్క్వాడ్‌లో పోలీసు ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ ఈఈ, టౌన్ ప్లానింగ్ అధికారి లేదా తహసీల్దార్, అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని మరో టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ సిబ్బందిని తీసుకుంటారు. ఎస్‌టీఎఫ్‌లు తాము తీసుకున్న చర్యల నివేదికలను సర్కారుకు ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు.

కూల్చివేసి, ఖర్చు వసూలు..

టీఎస్ బిపాస్‌తో ఇక అనుమతులు లేకుండా లేదా అనుమతులను అతిక్రమించి నిర్మించే భవనాలను నోటీసులు లేకుండానే కూల్చివేస్తారు. లేదా సీల్ చేస్తారు. ఆ భవనం కూల్చివేతకు అయిన వ్యయం కూడా సంబంధిత భవన యజమాని నుంచి వసూలు చేస్తారు. ఆ కట్టడాలకు తాత్కాలికంగా లేదా, శాశ్వతంగా నీటి, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని ఆయా విభాగాలకు సంబంధిత మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తారు. అనధికార నిర్మాణాలంటూ అధికారులకు ఫిర్యాదు లేదా సమాచారం అందిన 48 గంటలలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు వచ్చి ఆ ప్రదేశాన్ని లేదా కట్టడాన్ని తనిఖీలు చేసి నివేదికను రూపొందించి తగిన చర్యలు తీసుకుంటారు.

భవనం విలువలో 25% జరిమానా..

అధికారిక సంస్థలచే మంజూరైన ప్రణాళికను తుంగలోతొక్కి లేదా చట్టం ఉల్లంఘనలకు పాల్పడుతూ నియమాలకు విరుద్ధంగా, పొందిన అనుమతిని అతిక్రమించి కట్టడాలు లేదా భవనాల్లో మార్పులు చేస్తున్నవారికి, నిర్మాణంలోని పార్కింగ్ స్థలంలో ఏదేని కట్టడం చేస్తున్న వారికి ఆ స్థలం లేదా ఆ స్థలం, భవనం విలువలో 25 శాతం జరిమానాగా స్థానిక మున్సిపల్ కమిషనర్ విధిస్తారు.

దరఖాస్తుదారుకు సౌలభ్యం..

ప్రతి దరఖాస్తుకు 21 రోజుల్లోపే అనుమతులు మంజూరు చేయిస్తారు. దరఖాస్తు అధికారి వద్దనే ఉంటే 22వ రోజు నుంచి అనుమతి మంజూరు చేసినట్లు పరిగణించబడుతూ ఒక దృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఆ పత్రం ప్రభుత్వ విభాగాల్లో అధికారిక ధృవీకరణ పత్రంగా చలామణి అవుతుంది. ఏదేని దరఖాస్తుకు ఏవేని లోపాలున్నా, షార్ట్‌ఫాల్ వచ్చినా 10 రోజుల్లోనే తిరస్కరించాలని చట్టం స్పష్టం చేసింది. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న దరఖాస్తులకు 21 రోజుల్లోపే భవన నిర్మాణ అనుమతులు మంజూరు ఇవ్వాలి.

అన్ని పట్టణాలకు మాస్టర్‌ప్లాన్లు: కేటీఆర్

‘చట్టమంటే అందరికీ భయముండాలి. లేకుంటే నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి’ అని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో టీఎస్ బిపాస్ బిల్లు చర్చ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలుంటాయని, అనధికారిక నిర్మాణాలు, లేఅవుట్లను నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బల్దియా పరిధిలో జోన్ల కమిషనర్లు మానిటరింగ్ చేస్తారని, జీహెచ్ఎంసీలో 6 జోన్లున్నాయని, వాటి ప్రాంతాల్లో వారే పర్యవేక్షణ చేస్తారని చెప్పారు.

75 చ.గ.లలోపు భూముల్లో చేపట్టే నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదన్నారు. 600 చ.గ.లు ప్లాట్లు అనుమతులకు వచ్చే దరఖాస్తులు 95.15 శాతంగానూ, వీటికిపైబడిన ప్లాట్లలో అనుమతులుకు వచ్చే దరఖాస్తులు 4.85 శాతంగా ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రతి వారం లేదా 10 రోజులకొకమారు మానిటరింగ్ సెల్ సమావేశమై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుందని తెలిపారు. నోటరైజ్డ్ ప్లాట్ల విషయాన్ని పరిశీలిస్తామని, వన్ టైం సెటిల్‌మెంట్ పన్ను విషయాన్ని తుదిగడువును అక్టోబర్ 31 వరకు 45 రోజుల పాటు పొడిగిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌లు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Advertisement