క్యాంప్ రాజకీయాలపైనే భారం.. అయినా తప్పని ‘క్రాస్’ భయం..

by Sridhar Babu |   ( Updated:2021-12-10 03:22:04.0  )
క్యాంప్ రాజకీయాలపైనే భారం.. అయినా తప్పని ‘క్రాస్’ భయం..
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది. కొన్ని రోజులుగా టూర్లలో ఎంజాయ్ చేసిన స్థానిక ఓటర్లు ఓటేసేందుకు ఖమ్మం చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు స్థానిక ప్రజాప్రతినిధులను గోవా టూర్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే వారు శుక్రవారం ఓటింగ్ ఉండడంతో ఖమ్మం చేరుకున్నారు. వీరందరిని గోవా నుంచి హైదరాబాద్ అక్కడి నుంచి ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రానికి అత్యంత కట్టుదిట్టంగా చేర్చారు. అనంతరం ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ లో ఓటేసేందుకు వెళ్లారు. ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు బాధ్యతను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకున్న విషయం తెలిసిందే.

మండలాల వారీగా విభజించి..

గోవా టూర్ అనంతరం ఓటర్లను అత్యంత పకడ్బందీగా ఖమ్మం చేర్చి ఓటింగ్ కేంద్రానికి తరలించారు. ఓటర్లందరినీ మండలాల వారీగా విభజించి వారి బాధ్యతను స్థానిక కార్పొరేటర్లకు అప్పగించారు. అంతేకాదు ఓటర్లను ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం నుంచి పక్కనే ఉన్న ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రానికి క్యూ పద్ధతిలో తరలించారు. అయితే ఓటర్ల లైన్ ముందు, వెనుక పర్యవేక్షకులు వెన్నంటే ఉన్నారు. ఇదంతా మంత్రి అజయ్ దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం.

క్రాస్ ఓటింగ్ భయంతోనేనా..?

వాస్తవంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు సునాయసమే అయినా పార్టీ పెద్దలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఓటర్లను గోవా టూర్లకు తీసుకెళ్లి వారిని ఎంజాయ్ చేపించారు. అయినా అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు కూడా టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గోవా టూర్లకు వెళ్లిన కొంతమంది తిరిగి వచ్చేందుకు నానా అవస్థలు పడ్డారు. గోవా ఎయిర్ పోర్టులో బోటింగ్ పాస్ లేకపోవడంతో చాలామంది ప్రజాప్రతినిధులను చివరి నిమిషంలో విమానం ఎక్కనివ్వలేదు. ఆ తర్వాత ఫైట్ కి హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.

అందులో ఇల్లెందు ఎమ్మల్యే హరిప్రియానాయక్ కూడా ఉన్నారు. దీంతో వారు టూర్ సంగతేమో కానీ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం నుంచి ఓటర్లు ఆశించిన మేర తాయిలాలు ఇవ్వట్లేదని, ఇది ఎవరికీ రుచించక అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీటన్నింటి దృష్టా క్రాస్ ఓటింగ్ భయం టీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed