ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాత్మకం.. ఈసీకి చిక్కకుండా భారీ ప్లాన్..!

by Sridhar Babu |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాత్మకం.. ఈసీకి చిక్కకుండా భారీ ప్లాన్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు చిక్కకుండా వ్యవహరించినట్టు స్పష్టం అవుతోంది. పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ రంగును చూపించాలని నిర్ణయించుకున్న వీరు స్కెచ్ మాత్రం పర్‌ఫెక్ట్‌గా వేసినట్టుగా అర్థం అవుతోంది.

పంతం నెగ్గించుకున్నారా..?

తమ పార్టీ జెండా రంగు అయిన గులాబీ రంగును ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్య నాయకులు తమ లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చుకున్నారనే చెప్పాలి. పార్టీ కండువాలతో అందరం ఓటింగ్ వేసేందుకు రావాలని ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల ఖచ్చితంగా దొరికిపోతాడని ప్రత్యర్థులు భావించి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా మంత్రి గంగులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అందరూ గులాబీ రంగు కండువా అయితే వేసుకున్నారు. కానీ పార్టీ గుర్తు కానీ, కేసీఆర్ ఫొటో కానీ లేనివి వేసుకుని వచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చేశారు. తాము తుడుచుకునేందుకు వేసుకున్న కండువాలను ఎలా వద్దంటారని, పార్టీ ఆనవాళ్లు ఉన్నాయా అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో పోలీసులు కిమ్మనకుండా పోలింగ్ కేంద్రంలోకి పంపించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కేవలం పురుషులే కాకుండా మహిళా ప్రతినిధులు కూడా అవే కండువాలు వేసుకుని ఓట్లు వేసి రావడం గమనార్హం.

జగిత్యాలలో..

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓట్లు వేసిన మహిళా ప్రజా ప్రతినిధులు మరో బిగ్ స్కెచ్ వేశారనే చెప్పాలి. పార్టీ కండువాలు కాకుండా తమ పార్టీ సింబాలిక్ కలర్‌ను ఎక్స్ ప్రెస్ చేయాలని భావించినట్టు ఉంది. ఇందు కోసం ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటూ ఎవరూ అభ్యంతరం చెప్పకుండా వ్యవహరించారు. మహిళా ప్రజా ప్రతినిధులంతా కూడా లైట్ గులాబీ రంగులో ఉన్న చీరలు ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో తమ పార్టీ బ్రాండ్ కలర్‌తోనే పోలింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ అయి తమ పంతాన్ని నెగ్గించుకున్నట్టు అయిందని టీఆర్ఎస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యర్థుల అంచనాలకు కూడా చెక్ పెట్టినట్టుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed