- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ పట్టభద్రుల స్థానంపై గులాబీ మల్లగుల్లాలు
దిశ, తెలంగాణ బ్యూరో : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. వచ్చే సాగర్ ఉప ఎన్నిక, మినీ పురపోరుకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంపై అధికార పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టే భావిస్తోంది. ఆ స్థానం నుంచి వరుసగా ఓటమిపాలవుతుండటంతో అపజయాల భయం వెంటాడుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చేదు అనుభవమే మిగులుతోంది. ఇప్పటికే కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు రాష్ట్రంలో రెండు మండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనిలో వరంగల్–నల్గొండ–ఖమ్మం సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ కోటరీలోని ప్రధానవర్గంలో ఒకరైన పల్లా ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుండగా… అటు ప్రగతిభవన్ నుంచి కూడా ప్రత్యేక ఆదేశాలిచ్చి మంత్రులపైనే ప్రధాన బాధ్యతలు పెట్టారు. కానీ మరో నియోజకవర్గంలో మాత్రం ఇంకా అభ్యర్థిని తేల్చలేదు. అసలు ఇక్కడ అభ్యర్థిని పార్టీ తరుపున అధికారికంగా పోటీకి దింపరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ గులాబీ కండువాతో పోటీ చేసిన వారెవ్వరూ గెలుపు అంచుకు కూడా రావడం లేదు.
దూరంగానే ఉందామా..?
ఎన్నికలు ఏవైనా అభ్యర్థులను ప్రకటించడంలో ముందు నిలిచే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెనకంజ వేస్తోంది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి గులాబీ దళం దాదాపుగా దూరంగా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఇక్కడ గెలిచినా ఓడినా అధికార పార్టీకి పెద్దగా ఫాయిదా ఏముండదు. కానీ వచ్చే ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఫల్యాలను మూటగట్టుకుంది. అంతకు ముందు కరీంనగర్–మెదక్–నిజామాబాద్ పట్టభద్రుల స్థానంలో దెబ్బతింది. అక్కడ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి గెలిచారు. వరుస పరాజయాలు, ఎదురుదెబ్బల నేపథ్యంలో ఇప్పుడు రెండు మండలి సెగ్మెంట్లకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి భయం గులాబీ అధిష్టానాన్ని వెంటాడుతోంది.
అయితే హైదరాబాద్ స్థానానికి మాత్రం అధికార పార్టీ దూరంగా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఈ స్థానం కోసం ముందుగా కొంతమంది పోటీ పడ్డారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆసక్తి చూపించారు. కానీ పరిణామాలు మారడంతో మళ్లీ వెనకడుగు వేశారు. అదే సమయంలో మేయర్ పీఠం కోసం మళ్లీ పోటీపడ్డారు. కానీ పార్టీ ఆయనకు మొండిచేయి చూపించింది. ఆ తర్వాత టీఎస్ఏడబ్ల్యూడీసీ ఛైర్మన్ నాగేందర్‌గౌడ్, పీఎల్ శ్రీనివాస్, శుభప్రసాద్ పటేల్‌తో పాటు గతంలో పోటీ చేసి ఓడిన దేవీ ప్రసాద్ కూడా కొంత ఆసక్తి చూపించారు. కానీ తీరా సమయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ ఓడిపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇస్తే మాత్రం పోటీ చేస్తామంటూ చెప్పుతున్నారు. దీంతో అధికార పార్టీ డైలామాలో పడింది.
గెలుపు చరిత్ర లేదుగా…
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్కు వరుస పరాజయాలు లిఖించాయి. 2007లో టీఆర్ఎస్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని పోటీకి దింపింది. కానీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2009లో ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో అభ్యర్థిని వద్దనుకుంది. అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతునిచ్చింది. వాస్తవంగా అప్పటికే నాగేశ్వర్ గెలుపు ముంగిట ఉన్నారు. అది గుర్తించిన టీఆర్ఎస్ ఆయనకే మద్దతు తెలిపింది. ఆ తర్వాత 2015లో ఎంతో కొంత నమ్మకంతో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న దేవీ ప్రసాద్‌ను బరిలోకి దింపింది. ఉద్యోగానికి రాజీనామా చేయించి పోటీకి దింపింది. కానీ మళ్లీ పాత కథే. ఆయన కూడా ఓటమి పాలయ్యాడు. ఇలా ఈ స్థానంలో టీఆర్ఎస్ బోల్తా పడుతూనే ఉంది.
ఇప్పుడు కూడా నాగేశ్వర్‌కే మద్దతా…?
ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. వాస్తవంగా పట్టభద్రుల ఓటరు నమోదు సందర్భంగా టీఆర్ఎస్ చాలా హడావుడి చేసింది. గెలుపు మాదేననే రీతిలో ప్రచారం చేసింది. కానీ వాస్తవ పరిస్థితులు గుర్తించి మళ్లీ సైలెంట్ అయింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరుపున ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రారావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రకటించాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం ఎవరినీ ప్రకటించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈసారి కూడా మళ్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతునివ్వాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఆశావాహులకు సంకేతాలిచ్చినట్లు చెప్పుతున్నారు. ఎలాగూ గెలిచే పరిస్థితులు లేవని, పోటీ చేసి పరువు తీసుకోవడం కంటే తటస్థంగా ఉండి మద్దతు ఇవ్వడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.