న‌ల్గొండ ‘కారు’లో లొల్లిలొల్లి!

by Shyam |
న‌ల్గొండ ‘కారు’లో లొల్లిలొల్లి!
X

దిశ, నల్లగొండ: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరు కొనసాగించిన కారు పార్టీలో ప్రజెంట్ ఆధిపత్య పోరు నడుస్తోంది. హైకమాండ్ ముందు ఫ్రెండ్లీగా ఉన్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నా నియోజకవర్గంలో మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎవరికి వారు వర్గాలను తయారు చేసుకొని పార్టీలో పట్టుకోసం పోటీ పడుతున్నారు. దీంతో జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దండులను మట్టికరిపించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో చతికిల పడింది. దీంతో రెండు ఎంపీ స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. అయితే దీనికి గులాబీ నేతల మధ్య విభేదాలే కారణమన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల గెలుపు బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో అభ్యర్థుల ఎంపిక వారి చేతుల్లోకే వెళ్లింది. అప్పటి నుంచి నియోజకవర్గాల్లో మళ్లీ గ్రూపులు స్టార్ట్ కావడంతో క్యాడర్ మొత్తం చెల్లాచెదురు అవుతోంది. నల్లగొండలో గుత్తా, బండ అనుచరులకు, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులకు, భువనగిరిలో సందీప్‌రెడ్డి అనుచరులకు మునుగోడులో కర్నె ప్రభాకర్‌ వర్గీయులకు కోదాడలో శశిధర్‌రెడ్డి, చందర్‌రావు వర్గీయులకు మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో టికెట్ కూడ రాక‌పోవ‌డంతో కొన్నిచోట్ల తిరుగుబావుట ఎగుర‌వేశారు. దాని ప్ర‌భావ‌ంతో 18 మున్సిపాలిటీల‌కు టీఆర్ఎస్ కేవ‌లం 8 పుర‌పీఠాల్లో మాత్ర‌మే మ్యాజిక్ ఫిగ‌ర్‌ను సాధించింది.

చిరుమ‌ర్తి వ‌ర్సెస్ వేముల..

నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరింది. స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిప‌ల్‌, స‌హ‌కార ఎన్నిక‌ల్లో వీరేశం వ‌ర్గీయుల‌కు టికెట్ రాకుండా చిరుమ‌ర్తి చెక్‌ పెట్ట‌డంతో వీరేశం వ‌ర్గీయులు తిరుగుబావుట ఎగురవేసి కొంతమేరకు సత్తా చాటారు. త‌న వ‌ర్గీయుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గొంతెత్తిన వీరేశంకు హైకమాండ్ నుంచి సరైన స్పంద‌న రాక‌పోవ‌డంతో సైలెంట్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ చాపకింద నీరులా త‌న వ‌ర్గీయుల‌కు కావాల్సిన అన్నిఏర్పాట్లు చేశాడ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

క‌ర్నె వ‌ర్సెస్ కూసుకుంట్ల‌

మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి మధ్య 2015 నుంచి ఆధిపత్యపోరు నడుస్తోంది. వర్గపోరు ఓ రేంజ్‌లో ఉండటంతో నారాయ‌ణ‌పురం గ్రామ‌పంచాయ‌తీని కూల్చిన విష‌యంలో కౌంట‌ర్ కేసులు పెట్టించిన అప‌ఖ్యాతిని ఇద్దరు నేతలు మూటక‌ట్టుకున్నారు. హైకమాండ్ ఎన్నిమార్లు వార్నింగ్ ఇచ్చినా ఇప్పటికీ సఖ్యత రావట్లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన కర్నె ప్రభాకర్‌కు కాదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్రూపులు ఏర్పడ్డాయి.

ముగ్గురు నేత‌లు.. మూడు ముక్క‌లు

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ప్రస్తుత జడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి ఆశించారు. కానీ, టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్‌ దక్కించుకొని గెలుపొందారు. ఈ స్థానం రెండుసార్లు ఆశించి భంగపడిన నరేందర్‌రెడ్డి ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్ అయినప్పటికీ అసంతృప్తిగానే ఉన్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మధ్య కూడా విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో నల్గొండలో ముగ్గురు నేతలు.. మూడు ముక్కలుగా పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

భువనగిరిలో కోల్డ్‌వార్‌ ?

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై సందీప్‌రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికల ముందు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు పట్టించుకోవడంలేదని సందీప్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎలిమినేటి కృష్ణారెడ్డికి చెందిన క్యాడర్ మొత్తం సందీప్‌రెడ్డితోనే అటాచ్ అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్, సహకార ఎన్నికల్లో సందీప్‌రెడ్డి వర్గీయులకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే చెక్ పెట్టడంతో వారు తిరుగుబాటు చేశారు.

కోదాడలో రగులుతున్న అసంతృప్తి

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న శశిధర్‌రెడ్డి కోదాడలో పార్టీని బలోపేతం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందని భావించిన ఆయనకు చుక్కెదురైంది. దీంతో టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్‌ రావడంతో విజయం సాధించారు. అప్పటి నుంచి శశిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఎన్నికలకు దూరంగా ఉండి రాజధానికి పరిమితమయ్యారు. అటు.. వేనేపల్లి చందర్‌రావుకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని హైకమాండ్ చెప్పినా ఇంతవరకు ఎలాంటి పదవి రాకపోవడమే కాకుండా, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌తో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు.

tags : Nalgonda Trs, Congress, Assembly, Parliament, Elections, Nakrekal, Bhuvanagiri, Munugodu, Karne Prabhakar, Gutta

Advertisement

Next Story

Most Viewed