కేంద్రంపై పోరు.. ఢిల్లీకి టీఆర్‌ఎస్ ఎంపీలు, మంత్రులు

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం పంటపై కేంద్రంపై పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తైందని, ఇంకా 20 శాతం కొనుగోలు ఉన్నాయని, వాటిని కొనుగోలు చేయాలని కోరనుంది. అందులో భాగంగానే ఈ నెల 18న సాయంత్రం ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు వెళ్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం నష్టపోతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో ఇంటా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చిత్తశుద్దితో పోరాడారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడిందని మండిపడ్డారు. దానికి తోడు పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వం మంత్రులతో అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు.

గతంలో అంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, కానీ కేంద్రం రాత పూర్వకంగా ఇచ్చిన వాటికే దిక్కులేదు .. నోటి మాటలకు విలువ ఎక్కడుందన్నారు. ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం ఆధీనంలోనే ఎఫ్ సీ ఐ అని, గోదాంలు.. రైళ్లు అని .. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యమని మండిపడ్డారు. బీజేపీ నేతలవి పిచ్చి ప్రేలాపనలు .. అవగాహన లేని వాదనలు అని ధ్వజమెత్తారు.

ఏడేండ్ల మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రంగం కూడా బలపడింది లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకంలోనూ కేంద్ర ప్రభుత్వ అణా పైసా లేదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర నిధులతో నిర్మించుకున్న ప్రాజెక్టు అని కేంద్ర మంత్రే పార్లమెంటులో వెల్లడించారన్నారు. తెలంగాణ రైతులు పరిస్థితిని అర్ధం చేసుకుని ఆరుతడి పంటలు వేస్తున్నారని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే… కేంద్రం క్షుద్రరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతుందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed