వివాదాల్లో TRS మంత్రులు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యల్లో వారే టాప్.!

by Anukaran |   ( Updated:2021-10-04 23:35:21.0  )
TRS vijaya garjana sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నోరు జారుతున్నారు. సోయి తప్పి మాట్లాడుతున్నారు. అవసరం లేకున్నా.. వారికివారే వివాదాల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఎందుకు ఫ్రస్టేషన్ పెరుగుతుందో కానీ.. అమాత్యులు, ఎమ్మెల్యేల నోటికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. కీలకమైన పదవుల్లో ఉండి కూడా వల్గర్‌గా మాట్లాడుతున్నారు. అబద్దాలు చెప్పుతున్నారు. సారీ అంటూ తర్వాత నాలుక కరుచుకుంటున్నారు. ఐయామ్​సారీ అంటూనే మళ్లీ.. మళ్లీ నోరు జారారు. గట్టు దిగుతున్నారు. కట్టు దాటుతున్నారు. సింగిల్‌ విండో లీడర్‌ షిప్‌ ఉన్న పార్టీలో పటిష్టమైన నాయకత్వంలో ఉన్న గులాబీ శిబిరంలో వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు ఒక విధంగా అవకాశం కల్పించనట్టే అవుతోంది.

సభల్లోనే ‘తూలుతున్నారు’..

బహిరంగ సభల్లోనే అమాత్యులు నోరు జారుతున్నారు. సందర్భంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఆయా సందర్భాల్లో ఎదురవుతున్న నిరసనలతో కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫ్రస్టేషన్‌కు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి ఫ్రస్టేషన్ సందర్భాల్లో కాకుండా సాధారణ సమావేశాల్లో కూడా అదే నెలకొంది. గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మహిళా ఎంపీడీఓపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ కూడా వివాదానికెక్కారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఆవరణలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపనకు వెళ్లిన మంత్రితో ఓ విద్యార్థి కాలేజీ కాంపౌండ్‌లో ఉన్న ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తాను పది మంది మధ్యలో ఉన్నానన్న సంగతి మరిచిపోయిన మంత్రి.. ఆ యువకుడిపై అసహనం వ్యక్తం చేశారు. ‘తోక తెల్వదు.. తొండెం తెల్వదు.. పోరన్ని రెండు సంపి పంపు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో అధికారితో ‘ఫస్ట్ మీరు పద్దతి మార్చుకోవాలంటూ’ చెప్పడం కలకలం సృష్టించింది.

మంత్రుల వివాదం ముగిసిందని అనుకునేలోపే మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇంటికో ఉద్యోగం సాధ్యమయ్యే పనికాదని, ఏ ప్రభుత్వమైనా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తీవ్ర నష్టాన్నే కల్గించాయి. ఆయోధ్య రామమందిరం విరాళాల అంశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

మహిళలపై మళ్లీ రాజయ్య..

స్టేషన్​ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మహిళల అంశంలో పదేపదే వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలోనూ ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన మాటలు రాజయ్యకు ఇబ్బందులు తెచ్చాయి. అనంతరం ఓ పాఠశాలలో విద్యార్థినితో అన్నం తినిపించుకోవడం కూడా వివాదమైంది. ఇలా పలు సందర్భాల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళలకు సీఎం కేసీఆర్.. భర్త అంటూ సంబోధించడం పార్టీ పరువు తీసింది.

ఓవైపు పార్టీ పెద్దలంతా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అంటూ చెప్పుకుంటుంటే.. ఎమ్మెల్యే రాజయ్య మాత్రం మొత్తానికే మార్చేశాడు. దీనిపై రాష్ట్రంలోని మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ఘటన మరువక ముందే.. ఓ మహిళను బుగ్గపై గిల్లుతున్న వీడియో మరోటి తెరపైకి వచ్చింది. దీనికి తోడుగా ఇటీవల నిర్మల్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కూడా మహిళలపై నోరు జారారు. పెండ్లికాని వారందరికీ కళ్యాణలక్ష్మీ వస్తుందంటూ పేర్కొనడంపై మహిళల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది.

మంత్రులు మళ్లీ.. మళ్లీ..!

అధికార పార్టీ మంత్రులు జిల్లాల పర్యటనల్లో నోరు జారుతుండటం సాధారణమవుతూనే ఉంది. అంతేకాకుండా ప్రశ్నిస్తున్న వారిపై, పత్రికలపై అసహనం ప్రదర్శిస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య జనంపై కోప్పడుతున్నారు. గతంలో వరంగల్‌లో వర్షాలు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ పర్యటనకు వెళ్లారు. జనంతో కేటీఆర్‌ మాట్లాడే సమయంలో స్వామి అనే వ్యక్తి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఏటా తమ కాలనీ వరద నీటిలో మునిగిపోతోందని, ఐదారుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు, పోతున్నారు తప్పితే.. సమస్య తీరడం లేదన్నారు.

దీంతో మంత్రి ఎర్రబెల్లి ఒక్కసారిగా ఆగ్రహానికి గురై అడ్డుకున్నారు. ‘‘ఏయ్‍.. అరేయ్‍.. ఆగు.. ఏం చేయాలో చెప్పురా..’’ అంటూ స్వామిని మాట్లాడకుండా చేశారు. అది సోషల్‍ మీడియాలో వైరల్ అయి ఎర్రబెల్లిపై విమర్శలు వచ్చాయి. అదే సందర్భంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍, ఎర్రబెల్లి కలిసి వరంగల్‍ రూరల్‍ జిల్లాలో పర్యటించారు. మైలారం రిజర్వాయర్‍లో చేప పిల్లలను వదిలి, అక్కడున్న వారితో చేప పిల్లల అంశంపై మాట్లాడుతూ పత్రికలపై నోరు జారారు. ‘‘ఈ మధ్య పత్రికల్లో కొన్ని పిచ్చిరాతలు వచ్చినయి.. ఏదో క్వాలిటీ లేదు. సైజు లేదు. లేకపోతే ఏదేదో.. .. .. అది బొంగయిన్రు అంటూ మాట్లాడుతున్నారు” అంటూ నోరు జారారు.

నిధులివ్వడం లేదంటూ సొంత పార్టీలోనే ఆరోపణలు..

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏదోరకంగా మంత్రులపై విమర్శలు చేస్తున్నారు. ఎంపీటీసీలకు కనీసం కుర్చీ కూడా లేదంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. ఇదే నేపథ్యంలో సోమవారం జరిగిన అసెంబ్లీలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంత్రి కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేసిన రీతిలో మాట్లాడారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం లేదని, ఎన్నికలు ఉంటేనే నిధులిస్తున్నారంటూ అసెంబ్లీలో పేర్కొనడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. అంతేకాకుండా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​కూడా మంత్రి మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జేపీ దర్గాల నిధులతో నిర్వహిస్తున్న ఐటీఐ కాలేజీని మహబూబ్​నగర్ నుంచి షాద్​నగర్‌కు మార్చే అంశంలో పట్టించుకోవడం లేదంటూ ఆక్షేపించారు.

Advertisement

Next Story

Most Viewed