అంతా సైలెంట్.. అయోమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు

by Anukaran |
trs leader
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలపై మాట్లాడే నేతలు ముఖం చాటేశారు. రాష్ట్రమంతా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకుంటుంటే అధికార పార్టీ నేతలు మాత్రం కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. వారిలో భరోసా నింపే నేతలు సైతం కరువయ్యారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్టోబర్ 30న ఎన్నికలు జరుగగా మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. అన్ని పార్టీల నేతలు తమ కార్యాలయాలకు చేరుకొని ఓట్ల లెక్కింపును పార్టీ శ్రేణులతో కలిసి టీవీల్లో తిలకించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కానీ.. టీఆర్ఎస్ నేతలు మాత్రం తెలంగాణ భవన్‌కు రాలేదు. ఏ పని లేకున్నా భవన్‌కు వచ్చే నేతలు హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కరు కూడా రాలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులు లేక పార్టీ ఆఫీస్ వెలవెలబోయింది. కనీసం ఎన్నికల ఫలితాలపై స్పందించేవారే కరువయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం వారిలో మనోధైర్యం నింపేవారే లేకుండా పోయారు.

కార్యాలయానికి వచ్చింది నాలుగురే..!

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నాలుగురైదుగురు మాత్రమే వచ్చారు. వారిలో ఇద్దరు ఓ చానెల్‌లో చర్చలో పాల్గొనేందుకు రాగా, వారితో మరో ఇద్దరు వచ్చారు. అయితే చర్చ అనంతరం వారు కూడా వెళ్లిపోయారు. ఉప ఎన్నికల ఫలితాలపై నోరుమెదపలేదు. వీరే కాదు గ్రేటర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఫలితాలపై స్పందించలేదు. కేవలం వారి ఇళ్లకే పరిమితమై ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడంతో పాటు విశ్లేషించారు. అయితే కౌంటింగ్ చివరి రౌండ్ సమయంలో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మిగతావారు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

ఉప ఎన్నికల్లో సత్తాచాటి మరోసారి టీఆర్ఎస్‌కు ఏ ఎన్నికలు వచ్చినా తిరుగులేదని తెలియజేయాలని అధిష్టానం భావించింది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డింది. మంత్రులను, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పార్టీ కార్యవర్గంతో ప్రచారం చేయించింది. ఈ ఎన్నికలు రాబోయే ఎన్నికలకు నాంది అని.. పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించేందుకు ఈ ఫలితం దోహదపడుతుందని భావించింది. ప్రభుత్వ పథకాలతో పాటు కోట్ల రూపాయలను నియోజకవర్గానికి కేటాయించింది. అయినప్పటికీ ప్రజల అభిమానం చూరగొనలేక చతికిలపడింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఓటమిపై ఏం చేయాలో తెలియక పార్టీ అధిష్టానం మల్లగుల్లలు పడుతోంది.

Advertisement

Next Story