- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ధీమాతో సైలెంట్‌గా టీఆర్ఎస్.. ఫుల్ జోష్‌లో బీజేపీ
దిశ, తెలంగాణ బ్యూరో/దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ నేతలు గుంభనంగా ఉన్నారు. పార్టీ నాయకులెవ్వరూ కామెంట్ చేయడానికి సుముఖంగా లేరు. అధిష్టానం నుంచి అనుమతి లేకుండా ఎవ్వరూ మాట్లాడవద్దనే ఆదేశాలు రావడంతో మౌనంగానే ఉండిపోయారు. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న హరీష్ రావు మాత్రం పోలింగ్ తర్వాత ఒక ప్రకటనతో సరిపెట్టుకున్నారు. కానీ, విజయం తమదేననే ధీమాను మాత్రం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం ఓపెన్‌గానే ఈటల రాజేందర్ విజయం ఖాయమంటూ ఫుల్ కాన్ఫిడెన్సుతో ఉన్నారు. పోలింగ్ ట్రెండ్‌పై పార్టీ అధినేత కేసీఆర్ శనివారం రాత్రే అందుబాటులో ఉన్న నాయకులతో రివ్యూ చేశారు. పార్టీ విజయావకాశాలపై క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని, ఇంటెలిజెన్స్ విభాగం రిపోర్టులతో విశ్లేషించుకున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఓట్ల లెక్కింపు వరకూ ఎవ్వరూ ఎలాంటి కామెంట్ చేయవద్దని పార్టీ నాయకత్వం నుంచి సీనియర్ నేతలకు, స్టార్ క్యాంపెయినర్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత 30 వేల మెజారిటీ తప్పకుండా వస్తుందని అంచనా వేసినా.. పోలింగ్ ట్రెండ్ చూసిన తర్వాత స్వల్ప తేడాలు ఉండొచ్చని, కానీ అంతిమంగా విజయం మాత్రం ఖాయమని నాలుగు నెలల పాటు అక్కడ క్యాంపెయిన్ నిర్వహించిన నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కౌంటింగ్ తర్వాతనే హరీష్ రావు స్పందన
ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే మంత్రి హరీశ్‌రావు గ్రామాలవారీగా పార్టీ శ్రేణులతో ఫోన్‌లో మాట్లాడారు. ఓటింగ్ సరళిపై అంచనాకు వచ్చిన ఆయన పోలింగ్ బూత్‌ల బాధ్యులకూ దిశానిర్దేశం చేశారు. సాయంత్రం తర్వాత మారిన ట్రెండ్‌మీద ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నది. పెరిగిన పోలింగ్ శాతం కలిసొస్తుందనే ధీమాను వ్యక్తం చేసినట్లు జమ్మికుంట పట్టణంలో పార్టీ తరపున పర్యవేక్షకుడిగా ఉన్న ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి పోలింగ్ బూత్‌ల వారీగా ఎక్కడెక్కడ ఎంతశాతం ఓట్లు పడ్డాయి, అందులో పురుషులు, మహిళలు ఎంత మంది, ఓవరాల్‌గా పోలింగ్ శాతం ఎంత తదితర వివరాలన్నింటినీ నివేదిక రూపంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపించిన కాపీకి అనుగుణంగా నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమీక్షిస్తున్నారు.
తెలంగాణ భవన్‌కు నేతలు
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్2వ తేదీన జరుగనున్నందున తెలంగాణ భవన్‌కు ఆ పార్టీ నేతలు చేరుకోనున్నారు. కౌంటింగ్ ఫలితాలకు అనుగుణంగా మీడియాతో మాట్లాడాలని, అప్పటివరకూ స్పందించబోమని పేర్కొన్నారు. కనీస స్థాయిలోనైనా మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమాను బైటకు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంతకాలం ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన పొరపాట్లు, సరిదిద్దుకోవాల్సిన అంశాలు, ప్రచార వ్యూహంతో పార్టీకి కలిగిన ప్రయోజనం తదితరాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సైలెంట్ ఓటే.. శాసనం!
హుజురాబాద్ గెలుపు ఓటముల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న సైలెంట్ ఓట్లు గెలుపోటములను శాసిస్తాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మోహమాటంగా తమ ఓటు ఎటువైపో అని చెప్పిన ఓటర్లు కాకుండా తమ నిర్ణయాన్ని బయటకు వెల్లడించని ఓటర్లే అత్యంత కీలకంగా మారారు. వారు ఏ పార్టీవైపు మొగ్గు చూపారన్నదే పజిల్‌గా మారింది. 10 నుండి 12 శాతం మంది ఓటర్లు తాము ఎవరిపక్షాన నిలబడ్డమో చెప్పడానికి నిరాకరించారు. వీరు కారుకు వేశారా? లేక కమలానికా? అన్నదే అంతు చిక్కకుండా తయారైంది. వీరు బాసటగా నిలిచిన వారు కచ్చితంగా గెలుపును అందుకుంటారన్న భావన వ్యక్తం అవుతున్నది. కాగా, అప్పటి వరకు టీఆర్‌ఎస్ 15 నుంచి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని భావించిన వారు ఓటర్లు.. అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు బయటకు రావడంతో సీన్ మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరి గంటే కీలకం..
పోలింగ్‌కు చివరి గంటలో వచ్చిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారన్నది తేలాల్సి ఉంది. సాయంత్రం వేళల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే వారంతా కూడా వ్యవసాయ పనులు పనిచేసే వారే ఎక్కువగా ఉంటారు. వీరి నిర్ణయం కూడా గెలుపోటములను శాసించే అవకాశం లేకపోలేదు. మరో వైపున స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు నియోజకవర్గం అంతటా తిరుగుతూ పబ్లిక్ పల్స్ పట్టుకున్నట్టు సమాచారం. ఈ నివేదికతోనే సీఎం కేసీఆర్ గెలుపు ధీమాతో ఉన్నారని తెలుస్తున్నది.
టీఆర్‌ఎస్ అంచనాలివి..
ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలు ప్రధానంగా దళితబంధు స్కీంతో 60 నుంచి 70 వేల ఓట్లు వస్తాయని టీఆర్ఎస్నేతలు అంచనా వేస్తున్నారు. స్థానికంగా జరిగిన ప్రచారం ఓటర్లను ప్రభావితం చేసిన తీరుతో 25 వేల నుండి 30 వేల వరకు ఓట్లు కూడా పడతాయని భావిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువశాతం అనుకూలంగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఇలా మొత్తంగా లక్ష ఓట్లు వస్తాయన్న భావనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా 1500 నుంచి 2 వేల మెజార్టీ వస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నది. మూడు నెలలుగా టీఆర్ఎస్ పార్టీ సీక్రెట్ ఆపరేషన్ కూడా నిర్వహించింది. ప్రతీ పదిమంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీని నియమించి వారి బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించింది. వీరి అంచనాల ప్రకారం పదిమంది ఓటర్ల సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తించి వారిని ఇక్కడకు రప్పించేందుకు కూడా ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. వారు తమకే ఓట్లు వేస్తారన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
బలమే బాసట
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు నియోజకవర్గంలో ఉన్న బలమే బాసటగా నిలుస్తున్నదన్న అంచనాతో ఉన్నారు. 17 ఏళ్లుగా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించి ప్రజలతో మమేకం అయినందున ఇక్కడి ఓటర్లు కచ్చితంగా అండగా నిలుస్తారని భావిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేందుకు నిరాకరించిన చాలామంది సీక్రెట్‌గా బీజేపీకే అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో 10 నుండి 12 వేల ఓట్ల మెజార్టీ వస్తుందన్న అంచనాల్లో ఉన్నారు. పోలింగ్‌కు చివరి మూడు రోజుల్లో చాలామంది స్థానిక నేతలు ఈటలకు అనుకూలంగా ప్రచారం చేశారన్న ఫీడ్ బ్యాక్ రావడంతో బీజేపీ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది.