సంచలన ఘటన.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ పోసిన రైతులు (వీడియో)

by Shyam |
Tribal farmers
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు పెట్రోల్ పోసి దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఆజాంనగర్ రేంజ్ పరిధి పందిపంపుల గ్రామ సమీపంలోని పది ఎకరాల ప్లాన్ టేషన్‌ను పరిశీలించడానికి, రేంజ్ ఆఫీసర్ దివ్యతో పాటు సెక్షన్ ఆఫీసర్ మోహన్, బీట్ ఆఫీసర్ అజయ్ వచ్చారు. అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న గిరిజనులు హుటాహుటిన అక్కడికి చేరుకొని అధికారులపై కర్రలతో దాడిచేశారు. అనంతరం వారిపై పెట్రోల్ పోసి నిప్పటించే ప్రయత్నం చేశారు.

దీంతో భయాందోళన చెందిన ఫారెస్ట్ అధికారులు అక్కడినుంచి పరుగులు తీశారు. కాగా, గత పదిరోజుల క్రితం అటవీశాఖ అధికారులు సదరు గిరిజనులు పండించిన పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేసి హల్‌చల్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు(గురువారం) ఆ అధికారులే పరిశీలనకు రావడంతో రైతులు వారిని అడ్డుకొని కర్రలతో దాడి చేశారు. తమ పంటనే ధ్వంసం చేస్తారా? అని ఆగ్రహంతో వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన అటవీశాఖ సిబ్బంది భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed