రవాణాశాఖలో అవినీతి జలగలు

by Shyam |   ( Updated:2020-03-16 02:45:34.0  )
రవాణాశాఖలో అవినీతి జలగలు
X

దిశ, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతికి అలవాటు పడ్డ రవాణా శాఖ అధికారుల అక్రమ ఆదాయం రోజుకు రూ. 20 లక్షలు పైమాటే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ పరిసరాల్లోని ఏజెంట్ల ద్వారా పనులు చక్కబెడుతున్న అధికారులు.. వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు సమాచారం. కొన్నేండ్లుగా ఈ లంచాల వ్యవహారం అటెండర్ నుంచి అధికారి వరకు యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగం రహస్యమే! అయినప్పటికీ అధికారుల అక్రమ దందాపై శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారుల నెలవారీ అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు.

ఒక్కరోజు సంపాదన రూ. 2 లక్షలు ?

రవాణాశాఖలో వాహనదారులకు లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ, తదితర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే ఎలాంటి పనైనా వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఏజెంట్ అడిగినంత ముట్టజెప్పాల్సిందే. ఉదాహరణకు లెర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్ జారీకి సర్కార్ నిర్ణయించిన ఫీజు రూ.1900 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఏజెంట్ మాత్రం అదనంగా రూ. 2100 తీసుకుని ఎలాంటి పరీక్ష లేకుండా లైసెన్స్ జారీ చేయిస్తాడు. లైసెన్స్ జారీ చేసే ఎంవీఐ (మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ )కు రూ.1400 ముట్టజెప్పి సదరు ఏజెంట్ రూ. 700 కమీషన్ తీసుకుంటాడు. టూ వీలర్ రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు లేకపోయినప్పటికీ వాహనదారుడు రూ. 400 లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 200 ఎంవీఐ, రూ. 100 క్లర్క్, రూ. 100 సూపరింటెండెంట్ తీసుకోవడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ మాదిరిగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 600 లైసెన్స్‌లు, 500 వాహనాలకు రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పనులకు గానూ రూ. 10 లక్షలకు పైగా లంచాల రూపంలో వసూలు చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. వీటికితోడు వాహనాల ఫిట్‌నెస్‌లు, పేర్ల మార్పిడి, ఓవర్ లోడ్ వెహికల్స్‌కు ఫైన్ల పేరిట అదనంగా మరో రూ. 10 లక్షలు గుంజుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఒక జిల్లాలో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న అధికారి రోజువారీ అవినీతి సంపాదన రూ. 2 లక్షలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా శాఖ అధికారుల నెలవారీ అవినీతి సంపాదన రూ. 10 కోట్ల దాటిందనే ప్రచారం జరుగుతోంది.

పాఠశాలల ప్రారంభంలో పండగే..?
ప్రతి ఏడాది జూన్‌లో పాఠశాలల ప్రారంభానికి ముందు రవాణాశాఖ అధికారులు పండగ చేసుకుంటారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సామర్థాన్ని చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్కూల్ యాజమానులు ఆ జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి బస్సుల ఫిట్‌నెస్ పరీక్షించుకోవాలి. ఇందుకుగానూ రూ. 800 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ చేతి వాటం ప్రదర్శించే అధికారులు బస్సుకు అదనంగా రూ.3300 వసూలు చేస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 4 వేల బస్సులు ఉన్నాయి. ఈ మేరకు బస్సుల ద్వారా ప్రతీ ఏడాది జూన్ మాసంలో కోటికి పైగా ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. దీనికితోడు జిల్లాల్లో ఇసుక, గ్రానైట్ రవాణా చేసే లారీలు పెద్దసంఖ్యలో తిరుగుతున్నాయి. లారీలు ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్నందున రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి. కానీ లారీ యాజమానుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. రవాణాశాఖలో పెద్దమొత్తంలో అవినీతి జరుగుతున్నప్పటికీ ఏసీబీ, మీడియా పట్టించుకోకుండా ఉండేందుకు గానూ ఆయా వర్గాలను మేనేజ్ చేస్తున్నారనే ప్రచారమూ లేకపోలేదు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టుకుంటూ ప్రతీ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి తప్పుడు ఆదాయ లెక్కలు చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed