ఫ్యాన్సీ నెంబర్లపై ఆరోపణలు.. చెక్ పెట్టిన రవాణాశాఖ

by Shyam |
ఫ్యాన్సీ నెంబర్లపై ఆరోపణలు.. చెక్ పెట్టిన రవాణాశాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో గత నెల నుంచి ఈ నెల 8 వరకు రూ. 11.23 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ నెలలో స్పెషల్ నెంబర్ల ఆదాయం రూ. 7.50 కోట్లు ఉండగా.. ఈ నెలలో 8 రోజుల్లోనే రూ. 3.73 కోట్లు తెచ్చింది. వాహనాలకు కేటాయించే రిజిస్ట్రేషన్ నెంబర్ల అంశంలో పక్కాగా వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. ఇటీవల కొంతమందికి ఫ్యాన్సీ నెంబర్లను దొంగచాటుగా కేటాయించారనే అంశాలను ఈ సందర్భంగా కొట్టి పారేశారు. అంతేకాకుండా ఫ్యాన్సీ నెంబర్లను ఆన్‌లైన్‌లోనే వేలం వేస్తుండటంతో ఆదాయం కూడా పెరిగిందని రవాణా శాఖ ఉన్నతాధికారులు వివరించారు. అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 9999 నెంబర్ కు సంబంధించి పుకార్లు వచ్చాయని, ఆన్‌లైన్‌లో ఉన్న నెంబర్లను అధికారులు బ్లాక్ చేయడం అసలే ఉండదన్నారు.

దీన్ని సాఫ్ట్‌వేర్ కూడా అనుమతించదని ఈ సందర్బంగా వెల్లడించారు. దరఖాస్తుదారులు ఎంచుకున్న నెంబర్‌పై ఎర్రర్ మెస్సేజ్ వస్తే కచ్చితంగా దాన్ని రిజర్వు చేసినట్లేనని, అంతేకానీ దీనిలో రవాణా శాఖాధికారులు దానిపై ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశమే లేదన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయా జిల్లాల్లో ఫ్యాన్సీ నెంబర్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఖరారు అవుతున్నాయని, దీనిలో రవాణా శాఖ చేసేదేమీ ఉండదని అధికారులు చెప్పుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఫ్యాన్సీ నెంబర్‌ను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో ఉంచి దరఖాస్తులు తీసుకుంటారని, ఎక్కువమంది పోటీపడితే మధ్యాహ్నం 2 – 4 గంటల మధ్య వేలం ఉంటుందని, ఎవరు ఎక్కువ ధర పెడితే వారికి కేటాయింపు జరుగుతుందని, కానీ ఇవేమీ లేకుండా ఆన్‌లైన్‌లోనే నంబరు కనిపించకుండా చేయడం సాధ్యం కాదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ నెలలో కేవలం 8 రోజుల్లోనే రూ. 3.73 కోట్లు రావడం రవాణా శాఖ నిక్కచ్చి పనితీరుకు నిదర్శనమని అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed