గడ్డి అన్నారంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దంటున్న వ్యాపారులు

by Shyam |   ( Updated:2021-08-02 10:16:31.0  )
గడ్డి అన్నారంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దంటున్న వ్యాపారులు
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్‌: గ్రేట‌ర్ ప‌రిధిలో నాలుగు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆదివారం జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశం ప‌చ్చజెండా ఊపింది. మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణ‌ ప‌నులు త్వర‌లో ప్రారంభించాల‌ని కూడా అధికారుల‌ను ఆదేశించింది. దీంతో గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను బాట‌సింగారం త‌ర‌లించే దిశ‌గా అధికారులు పావులు క‌దుపుతున్నారు. సోమ‌వారం మార్కెటింగ్ శాఖ అధికారులు పండ్ల మార్కెట్‌లోని కార్యాల‌యంలో కొంద‌రు వ్యాపారుల అభిప్రాయాలు సేక‌రించారు. ఆ శాఖ ఉన్నతాధికారి ప‌ద్మహ‌ర్షతో పాటు ఇంజినీరింగ్ అధికారులు, వ్యాపారుల‌తో చ‌ర్చలు జ‌రిపారు. ప్రస్తుతం బ‌త్తాయి సీజ‌న్ కావ‌డంతో బ‌త్తాయి వ్యాపారుల‌తోనే మాట్లాడి బాట‌సింగారంలో తాత్కాలికంగా వ్యాపారం కొన‌సాగించ‌డానికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌పై చ‌ర్చించారు. పండ్ల మార్కెట్ స్థలంలో అత్యాథునిక ఆసుప‌త్రి నిర్మాణానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున కేబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకోవ‌డంతో త‌ర‌లింపు త‌థ్యమ‌ని అధికారులు వ్యాపారుల‌కు తేల్చిచెప్పారు. కోహెడ‌లో మార్కెట్ నిర్మాణం జ‌రిగే వ‌ర‌కు తాత్కాలికంగా బాటసింగారంలో కొన‌సాగించ‌క త‌ప్పద‌నే అభిప్రాయాలు అధికారుల నుంచి వ్యక్తమ‌వుతున్నాయి.

అధికారుల మ‌ల్లగుల్లాలు

ఓవైపు పండ్ల మార్కెట్‌ను వెంట‌నే త‌ర‌లించాల‌ని ప్రభుత్వం అధికారుల‌ను ఆదేశించ‌డం.. మ‌రోవైపు వ్యాపారులు కోర్టును ఆశ్రయించ‌డంతో… అధికారులు మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నారు. దీంతో పండ్ల మార్కెట్ త‌ర‌లింపుపై సందిగ్ధత నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో వ్యాపారుల‌తో చ‌ర్చించి మార్గం సుగుమం చేసేందుకు అధికార యంత్రాగం రంగం సిద్ధం చేసింది.

స‌సేమిరా అంటున్న వ్యాపారులు

వ్యాపారులు మాత్రం బాట‌సింగారం వెళ్లడానికి స‌సేమిరా అంటున్నారు. అక్కడ వేలం పాట‌లు నిర్వహించ‌డానికి అనువుగా ప్లాట్‌ఫారాలు లేవ‌ని, అంత‌కంటే ప్రధానంగా బ్యాంకులు లేవ‌ని దీంతో లావాదేవీలు ఎలా కొన‌సాగించాల‌ని అధికారుల‌ను వ్యాపారులు నిల‌దీస్తున్నారు. పండ్ల మార్కెట్‌లో నిత్యం కోట్లాది రూపాయ‌ల లావాదేవీలు కొన‌సాగుతాయ‌ని, రైతుల‌కు, వ్యాపారుల‌కు ఇబ్బందులు ఏర్పడతాయ‌ని, డ‌బ్బుల‌కు సెక్యూరిటీ ఏంట‌న్న ప్రశ్న ఉత్పన్నమ‌వ‌డంతో అసంపూర్తిగానే చ‌ర్చలు ముగిసాయి. మ‌రోసారి వ్యాపారుల‌తో మార్కెటింగ్ శాఖ అధికారులు చ‌ర్చలు జ‌రుప‌నున్నట్లు స‌మాచారం.

Advertisement

Next Story