అడవిలో వీడని మిస్టరీ.. వాటి జాడేది ?

by Anukaran |   ( Updated:2021-10-04 23:15:07.0  )
అడవిలో వీడని మిస్టరీ.. వాటి జాడేది ?
X

..అభయారణ్యాల్లోనే పెద్దపులులకు రక్షణ కరువైంది. నాలుగేండ్ల వ్యవధిలో నాలుగు టైగర్స్ హతమయ్యాయి. మరో 12 పులుల జాడ తెలియడం లేదు. తెలంగాణ, మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్​లలోనూ వాటి జాడ కనిపించడం లేదు. ఈ విషయాలను అటవీశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కేంద్రం పరిధిలో ఉండే ​ఎన్​టీసీఏకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడమే ఇందుకు కారణం..

దిశ, ప్రత్యేక ప్రతినిధి : ఉత్తర తెలంగాణ అడవుల్లో వేటగాళ్లు తరుచూ పంజా విసురుతున్నారు. అభయమివ్వాల్సిన అరణ్యాల్లోనే పెద్దపులులకు రక్షణ కరువైంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్న టైగర్లు ఉన్నట్టుండి మాయమవుతున్నాయి. ఛత్తీస్ గఢ్​, మహారాష్ట్ర నుంచి తెలంగాణ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకున్న చాలా పెద్దపులుల జాడలు కనిపించడం లేదు. కాగజ్​నగర్​ అడవుల్లో 8 పిల్లలకు జన్మనిచ్చి సూపర్ మామ్ గా పేరు తెచ్చుకున్న ​ఫాల్గుణ మొదలు కాగజ్​నగర్‌‌–4పులి వరకు అడ్రస్​ కరువైంది. వేటగాళ్ల ఉచ్చుకు బలైనట్టు అనుమానాలున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్​లలో ఎక్కడా దాని చిత్రం కనిపించడం లేదు.

2019లో చెన్నూరు, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ పరిధిలోని శంబీ ప్రాంతంలో రెండు పెద్దపులులు హతమయ్యాయి. వాటిని చంపారన్న సమాచారాన్ని మహారాష్ట్రకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బయటపెట్టారు. అప్పటి వరకు తెలంగాణ అటవీశాఖకు ఆ సమాచారం తెలియదు. చివరకు సమాచారమిచ్చిన ఎన్జీవో నిర్వాహకునిపైనే మన అధికారులు కేసు పెట్టారు. పెద్దపులులు మాయమవుతున్నా , వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నా అటవీశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిలో పెద్దగా చలనం లేదు. పైగా ఎక్కడైన పులి వేటగాళ్ల ఉచ్చులకు బలైతే అక్కడే కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2018లో వేటగాళ్ల ఉచ్చుకు గాయపడ్డ ఆడపులి కే‌‌–4ను అదుపులోకి తీసుకోవడానికి అటవీశాఖ అధికారులు చేయని ప్రయత్నం లేదు. దానిని సురక్షితంగా పట్టుకొని చికిత్స చేయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అది ఇటీవల పూర్తిగా కనుమరుగైందన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారనే ప్రచారం బలంగా ఉంది. ఎందుకంటే పులి చనిపోయిందంటే దానికి మొత్తం అటవీ యంత్రాంగం భారత ప్రధాని పర్యవేక్షణలోని నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ( ఎన్​టీసీఏ)కు జవాబు చెప్పాలి. దానికి పెద్ద తతంగమే ఉంటుంది. క్రమశిక్షణా చర్యలుంటాయి. ఇదంతా ఎందుకని రాష్ట్ర అధికారులు పులుల సమాచారాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు.

సూపర్​మామ్ కూడా..

వాస్తవానికి 2013నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి ఉత్తర తెలంగాణకు పెద్దపులుల వలస మొదలైంది. ఆదిలాబాద్​ సరిహద్దులలోని మహారాష్ట్ర చంద్రాపూర్, గడ్చిరోలి, తిప్పేశ్వర్​, ఛత్తీస్​గఢ్ నుంచి ​ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కాగజ్​నగర్​, చెన్నూరు, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​లోకి పులుల రాక పెరిగింది. 2014లో ​ఫాల్గుణ అనే పెద్దపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చి కాగజ్ నగర్​ అడవుల్లో స్థిరపడింది. ఆ తర్వాత మరో విడతలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చి సూపర్​మామ్​గా పేరొందింది. కాగజ్​నగర్​లో ​ఫాల్గుణ పిల్లలు సందడి చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్​ అడవులకే కొత్త కళ వచ్చింది. కానీ ఆ తర్వాత మరో 15వరకు పెద్దపులులు ఉమ్మడి ఆదిలాబాద్​లో సందడి చేశాయి. 2014నుంచి ఇప్పటి వరకు దాదాపు 22పెద్దపులులు వలస వచ్చినట్లు కెమెరా ట్రాప్​లు, పాదముద్రలు ఇతర సమాచారాల ద్వారా తెలుస్తున్నది. అందులో సూపర్​మామ్​తో పాటు కాగజ్​నగర్​లో జన్మించిన 8 పిల్లల జాడ కనిపించడం లేదు. కాగజ్​నగర్​ పేరుతో ఉన్న పులులు యుక్త వయస్సు వచ్చే వరకు అక్కడే సంచరించాయి. ఇప్పుడు వాటి జాడ పొరుగు రాష్ట్రాల్లో కూడా కనిపించడం లేదు. కొన్నేండ్లుగా రాష్ట్ర అడవులలో నాలుగు పెద్దపులులు హతమయ్యాయి. అందులో ఒకటి ప్రమాదవశాత్తు కాగా మిగతావి వేటగాళ్ల ఉచ్చుకు బలైనవే కావడం విశేషం. మరి కె–4కూడా వేటగాళ్ల ఉచ్చుకే బలైనట్లుగా భావిస్తున్నారు. పెద్దపులుల అడుగుజాడలను, వాటి కదలికలను ట్రాకింగ్​ చేయడంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మొదట్లో ఉన్న శ్రద్ధ చూపడం లేదు. అసలు తమ ప్రాంతంలో పులి తిరుగుతుందన్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడానికి కూడా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది జంకుతున్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు బలి..

గొత్తికోయల చేతిలో ములుగు అటవీ ప్రాంతంలో బలైన పెద్దపులి ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో చాలా ఏండ్ల తర్వాత ఆగస్టు నెలలో మొదటి సారి అడుగు పెట్టిన పెద్దపులి అంతలోనే వేటగాళ్లు బలి తీసుకోవడం గమనార్హం. ఛత్తీస్ గఢ్​ రాష్ట్రం నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్ద పులి జాడలను మొదటిసారిగా ఆగస్టు1న గుర్తించారు. కెమెరా ట్రాప్​లు, పాదముద్రల ద్వారా పులి.. ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాల్లో సంచరించినట్లు తెలిసింది. అది వచ్చిన రెండు నెలల్లోనే వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. పెద్దపులుల సంచారంపై ట్రాకింగ్​ పెంచి స్మగ్లర్​లు , వేటగాళ్లపై గట్టి నిఘా వేసి కఠినచర్యలు తీసుకుంటే తప్ప పెద్దపులుల మనుగడ సాధ్యం కాదు.

Advertisement

Next Story

Most Viewed