అలా చేస్తే అధిక డబ్బులొస్తాయని.. పెద్దపులిని వేటాడిన గొత్తికోయలు

by Sumithra |
అలా చేస్తే అధిక డబ్బులొస్తాయని.. పెద్దపులిని వేటాడిన గొత్తికోయలు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్/ ములుగు : దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఏటూరు నాగారం అభ‌యార‌ణ్యంలో అడుగుపెట్టిన పెద్దపులి వేట‌గాళ్ల ఉచ్చుకు బ‌లైంది. పులిని చంపి పులిగోర్లు, చ‌ర్మం అమ్ముకోవాల‌నే గొత్తికోయ‌ల దుర్మార్గపు ఆలోచ‌న‌కు అరుదైన జంతు జాతి అంత‌మైంది. తాడ్వాయి మండ‌లం కోడిశాల గుంపు, చింత‌ల కటాపూర్ తండాల‌కు చెందిన మడకం నరేష్, మడవి ఇడుమయ్య, మడకం ముకేశ్, మడవి దేవా, మడవి గంగయ్య అనే ఐదుగురు గొత్తికోయ‌లు పెద్దపులికి ఉచ్చుపెట్టి చంపేసిన‌ట్లు వ‌రంగ‌ల్ స‌ర్కిల్ సీసీఎఫ్ ఎస్‌.జె. ఆశ, ములుగు ఎస్పీ సంగ్రామ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ములుగు ఎస్పీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఘ‌ట‌న వివ‌రాల‌ను వెల్లడించారు.

తాడ్వాయి మండ‌లం కొడిశల గుంపు, చింత‌ల క‌టాపూర్ గూడెంల‌కు చెందిన మడకం నరేష్, మడవి ఇడుమయ్య, మడకం ముకేశ్, మడవి దేవా, మడవి గంగయ్యలు జంతువుల‌ను వేటాడుతూ మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే పెద్దపులి సంచ‌రిస్తున్న విష‌యం తెలుసుకున్న వీరు దాన్ని అంతం చేసి చ‌ర్మం, గోర్లను విక్రయిస్తే ఎక్కువ డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చనే దుర్మార్గపు ఆలోచ‌న‌తో ఉచ్చులు పెట్టారు. గ‌త నెల 21న పులి ఉచ్చులో ప‌డి మృతి చెందగా.. మడకం రాము, మడకం ఉంగయ్య, కోవాసి ఇడుమయ్యలు పెద్దపులి క‌ళేబ‌రం నుంచి చ‌ర్మాన్ని, గోర్లను, ఎముక‌ల‌ను తీసుకుని అట‌వీలోనే ఓ ప్రదేశంలో ర‌హ‌స్యంగా దాటి పెట్టారు.

న‌లుగురి అరెస్ట్‌..

పులి గోర్లను, చ‌ర్మాన్ని ఛత్తీస్‌గ‌ఢ్‌కు తీసుకెళ్లేందుకు గొత్తికోయ‌లు ప్రయ‌త్నాలు చేస్తున్న విష‌యంపై పోలీస్‌శాఖ అధికారుల‌కు స‌మాచారం అందింది. ఈ మేర‌కు వారి క‌ద‌లిక‌ల‌పై నిఘా ఉంచారు. ఆదివారం క‌టాపూర్ క్రాస్ వద్ద ఓ వాహ‌నంలో వెళ్తున్న న‌లుగురు అనుమానాస్పదంగా క‌నిపించ‌డంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద ఉన్న సంచుల్లో వెత‌క‌గా ఓ పులి గోరు క‌నిపించింది. దీంతో మడవి నరేశ్, మావి ఇరుమయ్య, మడకం ముకేశ్, మడవి దేవల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం విచార‌ణ‌లో పులికి ఉచ్చుపెట్టి చంపిన విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు ఎస్పీ సంగ్రామ్ తెలిపారు. నిందితులు ఉచ్చు పెట్టిన స్థలాన్ని, పెద్దపులి క‌ళేబ‌రం, అవ‌య‌వాల‌ను దాచిన ప్రదేశాల‌ను చూప‌డంతో వెట‌ర్నరీ డాక్టర్ సాయంతో పులిచ‌ర్మం, ఎముక‌లు, గోర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆగ‌స్టులోనే క‌ద‌లిక‌ల గుర్తింపు..

ఇదిలాఉండ‌గా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు అడ‌వుల్లో పెద్దపులి సంచ‌రిస్తున్నట్లుగా గ‌త ఆగ‌స్టులోనే గుర్తించి మహబూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, వ‌రంగ‌ల్, ములుగు జిల్లాల డీఎఫ్‌వోల ప‌ర్యవేక్షణ‌లో ప్రత్యేకంగా గ‌స్తీ బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని సీసీఎఫ్ ఆశ తెలిపారు. అటవీ ప్రాంతంలో నిఘాను కూడా పెంచామ‌ని, బేస్ క్యాంప్ వాచర్, ఏనిమల్ ట్రాకర్స్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు.అయినా, వేట‌గాళ్ల ఉచ్చుకు పెద్దపులి బ‌లి కావ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. అంత‌రించిపోతున్న పెద్దపులుల‌ను ర‌క్షించుకోవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని ఆమె పిలుపునిచ్చారు. వేట‌గాళ్లపై క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

Next Story

Most Viewed