ఆ పెయింటింగ్ కాలుష్యాన్ని తగ్గిస్తోంది!

by Harish |
ఆ పెయింటింగ్ కాలుష్యాన్ని తగ్గిస్తోంది!
X

దిశ, వెబ్‌డెస్క్: చెట్లు నాటితే పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నది తెలిసిన విషయమే. కానీ గోడమీద వేసిన ఓ పెయింటింగ్ కూడా చెట్ల కన్నా గొప్పగా కాలుష్యాన్ని తగ్గించగలిగితే? ఆశ్చర్యమే కదా! ఇంతకీ అదెలా సాధ్యమంటారా? అయితే ఈ పెయింట్ గురించి తెలుసుకోవాల్సిందే.

రోజురోజుకూ పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని ప్రతిరోజు టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. ప్రత్యక్షంగా కాలుష్యం బారినపడి పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాం. ఇక ఢిల్లీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ భయంకర స్థితికి చేరుకున్నాయి. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణవేత్తలు, ఎన్‌జీవోలు, ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలండ్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ కాన్వర్స్.. ఇటీవలే ‘సిటీ ఫారెస్ట్’ క్యాంపెయిన్‌ను చేపట్టింది.

అందులో భాగంగా ఆ దేశ రాజధాని ‘వార్సా’లో ఎప్పుడూ రద్దీగా ఉండే పాలిటెక్నానికా మెట్రో స్టేషన్ దగ్గరలోని ఓ పెద్ద భవనంపై అద్భుతమైన పెయింటింగ్ వేయించింది. ఇందుకోసం టైటానియం డయాక్సైడ్‌ కలిపిన ‘ఫొటో క్యాటలిటిక్’ పెయింట్‌ను ఉపయోగించింది. సూర్యకాంతితో చర్యనొంది, నైట్రోజన్ ఆక్సైడ్‌ను అట్రాక్ట్ చేసే ఈ పెయింట్‌ను నాక్జావుట్( KNOxOUT)గా వ్యవహరిస్తారు. కార్లు, ఫ్యాక్టరీలు, పవర్ స్టేషన్లు ఉత్పత్తి చేసే నైట్రోజన్ ఆక్సైడ్స్‌ హానికారకంగా మారకుండా ఈ పెయింట్ శోషించుకుని నీరు, కార్బన్ డయాక్సైడ్, కాల్షియం నైట్రేట్‌లుగా మారుస్తుంది. కాగా ఈ చర్యలో సూర్యకాంతి ఉత్పేరకంగా పనిచేస్తుంది. వర్షాలు పడినప్పుడు ఆ పెయింటింగ్‌పై ఉన్న కాల్షియం నైట్రేట్ వాషవుట్ అయిపోతుంది. ఆ వ్యర్థాలు పోవడంతో, మరిన్ని ఎయిర్ బోర్న్ పార్టికల్స్‌ను ఆ మ్యూరల్ పెయింట్ అట్రాక్ట్ చేస్తుంది.

బ్యాంకాక్, బెల్‌గ్రేడ్‌ సిటీల తర్వాత వార్సాలో ఈ పెయింట్స్ వేశారు. ‘సిటీ ఫారెస్ట్’ మ్యూరల్స్ ఎక్కువగా ‘లైమా, సిడ్నీ, జకార్తా, మనీలా, సావో పౌలో, శాంటియగో, జోహన్నెస్ బర్గ్, మెల్‌బోర్న్, బొగొటా, పనామా’ సిటీలో కనిపిస్తుంటాయి. అర్బన్ సిటీల్లో కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా కాన్వర్స్ ఈ ‘సిటీ ఫారెస్ట్ ప్రాజెక్ట్’ను చేపట్టింది. అయితే ఈ ఒక్క పెయింటింగ్, 780 చెట్లు ఎంతటి కాలుష్యాన్నయితే క్లీన్ చేయగలుగుతాయో అంతటి ప్రభావాన్ని చూపిస్తుందని ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Next Story