మీకు ఈ విషయం తెలుసా..? అందుకు ఈ నెలే చివరి తేదీ

by Sridhar Babu |   ( Updated:2021-11-28 03:03:30.0  )
register-to-vote1
X

దిశ, కాటారం: ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎన్నికల సంఘం అవగాహన, చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. జిల్లా ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 1న విడుదలైంది. ఈ నెల 30 వరకు ఓటరు నమోదు సవరణ మార్పులు చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముసాయిదా అనంతరం తుది జాబితా రూపొందించేందుకు తాజాగా మరోసారి అవకాశం కల్పించారు.

మండలాల్లో అవగాహన అంతంత మాత్రమే..

కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో అవగాహన శిబిరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక శిబిరాల ఊసేలేదు. బూత్ స్థాయి అధికారులకు ఓటరు జాబితా ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్ధేశిత ప్రాంతాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించాలి. కానీ, ఈ ప్రక్రియ గ్రామాలలో సక్రమంగా నిర్వహించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ లో www.voterportel.eci.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే ప్రచురణ అయిన ముసాయిదా జాబితాను జిల్లాలోని ఆర్డీవో, ఎమ్మార్వో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. వాటి ఆధారంగా సవరణలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. తుది జాబితాను 2022 జనవరి 5న విడుదల చేయనున్నారు.

నెల రోజుల్లో..

ప్రస్తుతం అర్హులైన వారితోపాటు 2022 జనవరి 1 లోపు 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు సమర్పించవచ్చు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం నెంబర్ 6, స్టేషన్ మార్పునకు ఫారం నెంబర్ 8, తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం నెంబర్ 7 నింపాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోండి: శ్రీనివాస రావు(ఎమ్మార్వో, కాటారం)

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. సందేహాల నివృత్తికి బూత్ లెవల్ అధికారి లేదా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఆన్ లైన్ విధానం అందుబాటులో ఉంది. ఓటరు helpline మొబైల్ ద్వారా ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed