ఓటీటీపై నియంత్రణ ఉండాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-03-04 03:37:05.0  )
supreme court
X

దిశ, వెబ్ డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫాంలపై నియంత్రణ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటీటీల పేరు మీద యథేచ్ఛగా అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. అంతేగాక ఓటీటీలపై నియంత్రణకు గాను రూపొందించిన మార్గదర్శకాలను రేపటి(శుక్రవారం) లోగా కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అమోజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ప్లాట్ ఫాంలలో ఓటీటీ రిలీజ్‌ల పేరు మీద అడల్ట్ కంటెంట్‌ను కూడా ప్రసారం అవుతున్నదని కొద్దికాలంగా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

అమోజాన్ ప్రైమ్ ఇండియా చీఫ్ అపర్ణ పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అపర్ణ సుప్రీంకోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ‘ఆ (ఓటీటీ) వేదికల మీద తప్పనిసరిగా నియంత్రణ ఉండాలి. పోర్నోగ్రఫీని కూడా యథేచ్ఛగా ప్రసారం చేస్తున్నారు..’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటీటీలలో విడుదల అవడానికి ముందు వాటిని స్క్రీనింగ్ చేయాలని అభిప్రాయపడింది.

Advertisement

Next Story