రాజధానిపై ప్రతిష్టంభన..

by Ramesh Goud |
రాజధానిపై ప్రతిష్టంభన..
X

మ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన నాటి నుంచి విభజిత ఏపీలో రాజధానిపై ఆరేండ్ల నుంచి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. నాడు ఆంధ్రప్రదేశ్ విడిపోతుందనీ తెలిసి కూడా ఏపీలోని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమానికి తెర లేపాయి. అదెలాగు సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాజకీయంగా లాభం చేకూరుతుందని సమైక్య ఉద్యమం నడిపారు. కానీ, విభజన జరిగింది. నేడు మూడు రాజధానుల అంశం, అమరావతిలోనే రాజధాని కొనసాగాలని అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు అడుగుతున్నాయి. రైతులు జేఏసీ పేరిట ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

ప్రతీది రాజకీయమే..

2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ, విభజిత ఏపీలు రాష్ట్రాలుగా విభజింపబడే సమయంలో రాజకీయ పార్టీల వైఖరి ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఏపీ విభజనపై..ఆర్టికల్ 3 ప్రకారం చేయండి, విభజన గురించి తమను అడగొద్దనీ, తమకు అవసరం లేదని వైసీపీ చెప్పింది. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించనివ్వం, మా దగ్గరి అస్త్రాలతో ఆపుతామంటూ టీడీపీ చెప్పింది. ఆ సమయంలో రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు విభజన ఖాయమనీ, కనీసం ఏపీ రాజధానికి ప్రత్యేక హోదాను ఏపీ రీఆర్గనైజేషన్ యక్ట్‌లో చేర్చాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని సూచించారు. కానీ, రాజకీయ పార్టీలేవీ పట్టించుకోలేదు. అప్పటి పార్లమెంటు‌లో ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల సభలో దేశ రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధానిగా అమరావతి నిర్మిస్తామని నాటి ప్రధాని అభ్యర్థి మోడీ చెప్పారు. కానీ, ఆచరణలో అమరావతికి మోడీ, బీజేపీ ప్రత్యేక హోదా కట్టబెట్టలేదు.

ప్రత్యేక హోదాపై ప్రధాన పార్టీల మల్లగుల్లాలు

ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక హోదాపై ప్రధాన రాజకీయ పార్టీల మల్లగుల్లాలు ప్రజల ఎదుట స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట ప్రత్యేక హోదా కావాలని టీడీపీ అడిగింది. ఆ తర్వాత హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అంటూ..బీజేపీ నేతలకు సన్మానాలు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా లక్ష్యమని చెప్పి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైంది. ఇక వైసీపీ ప్రత్యేక హోదాపై బీజేపీని అడిగింది లేదు. కానీ, హోదా సాధించడంలో టీడీపీ విఫలమైందని నాడు విమర్శించింది. నేడు అధికారంలోకొచ్చాక బీజేపీకి కేంద్రంలో సుస్థిర మెజార్టీ ఉంది కాబట్టి హోదా అడిగినా వాళ్లు ఇచ్చేలా లేరంటూ హోదాపై దాటవేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై రాజకీయం చేశారనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక తరగతి హోదా కావాలని జనసేన ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. కాకినాడ సభలో ప్రత్యేక తరగతి హోదాపై హిందీలో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ పెద్దలను నిలదీశారు. నేడు బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

నాటి నుంచి..

నాడు 2014 అనంతరం ఏపీ రాజధాని అమరావతికి నిధుల కేటాయింపు, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు ప్రజలు పోరాటాలు చేశారు. నేడు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానులొద్దంటూ పోరాటాలు చేస్తున్నారు. 49 రోజులుగా అమరావతిలో రైతులు తాము భూములిచ్చింది పిల్లల భవిష్యత్ కోసమేననీ, కాని ప్రభుత్వం రాజధాని తరలించడం వల్ల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనా!

ప్రత్యేక హోదాపై నిన్న పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ ప్రత్యేక హోదా ముగిసిన అంశమనీ, దాని స్థానంలో ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. 14 వ ఆర్థిక సంఘం వద్దొద్దంటూ సాకు చెబుతున్నారు. ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు ప్రత్యేక హోదా విషయంలో సంఘానికి ఎలాంటి పాత్ర ఉండదనీ, ప్లానింగ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎన్డీసీ(నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయినా, కేంద్రం ఆర్థిక సంఘం సాకుతో ప్రత్యేక హోదాను పక్కకు నెడుతోంది.

గ(ఉ)ట్టి పోరాటమేదీ..?

తమ డిమాండ్ల సాధన కోసం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలపై గట్టిగా పోరాటాలు చేస్తాయి. కానీ, ఏపీ విషయంలో డిమాండ్ల సాధనలో ప్రాంతీయ పార్టీలు గట్టి కాకుండా ఉట్టి పోరాటమే చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో అధికారంలోకొచ్చిన టీడీపీ ప్రత్యేక హోదాపై బీజేపీ గట్టిగ మొదటినుంచి పోరాడలేదు. తన రాజకీయ పలుకుబడి తగ్గిపోతుందనీ, ప్రజల్లో హోదా సెంటిమెంట్ వచ్చిందని తెలుసుకున్నాకే..బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ప్రత్యేకహోదాపై గళం విప్పింది. అప్పడు వైసీపీ బీజేపీని ఏ మాత్రం విమర్శించకుండా..ప్రత్యేక హోదా టీడీపీ వల్లే రాలేదని విమర్శించింది. అదే సీన్ ఇవాళ రిపీట్ అవుతుంది. అధికారంలో ఉన్న వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారనీ, మీ హామీ మేరకు ప్రత్యేక హోదా సాధించాలంటూ టీడీపీ ఎంపీ నాని వైసీపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రశ్నిస్తానన్న పవ(ర్)న్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టొద్దు అంటూ కాకినాడ, వైజాగ్‌ల్లో సభలు పెట్టి మరీ ప్రత్యేక హోదాపై పవర్‌ఫుల్ వాయిస్ హిందీలోనూ వినిపించారు. ఆ తర్వాత మెళ్లి మెళ్లిగా ఫేడ్ అవుట్ అయ్యారు. నేడు ఆత్మగౌరవం ఏడ పోయిందో తెలియదు..కానీ, బేషరతుగా బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఏపీ డిమాండ్స్ పై పోరాటం చేయాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రతిష్టంభన తొలగేదెప్పడు..?

ఓ విభజిత నూతన రాష్ట్రంలో రాజధానిపై ఇన్ని మల్లగుల్లాలు ప్రతిష్టంభన ఏపీకే సాధ్యమనీ, మరెక్కడా ఇలా జరగలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీల పోకడల వల్లే ఇలా జరిగిందనీ, ప్రజల అభివృద్ధి లక్ష్యం కాకుండా రోజుకో కొత్త అంశాన్న తెరమీదకు తెచ్చి తమ రాజకీయ ప్రయోజనాల పరమావధిగా పార్టీలు పని చేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. రాజధానిపై ప్రతిష్టంభన మిగతా అంశాలపై చర్చ జరగకుండా చేస్తోందని చెబుతున్నారు. కేవలం రాజధానిపై గందరగోళం నెలకొనడం వల్ల ఇతర అంశాలు కేంద్రం నుంచి భాజాప్తా రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఎయిర్‌పోర్టు, పెట్రోలియం రిఫైనరీ ఆయిల్ క్రాకర్స్ ఫ్యాక్టరీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, విద్యా సంస్థలకు నిధులు, అక్షరాస్యతలో వెనుకబడ్డ ఏపీకి ప్రోత్సాహకం, పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ నిధులు, అభివృద్ధిపై సునిశిత చర్చ మరుగున పడుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టంభనకు కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed