మన లైఫ్ స్టైల్ ఇలా మారిపోతుందా!

by vinod kumar |
మన లైఫ్ స్టైల్ ఇలా మారిపోతుందా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ గతిని మార్చేసిన ‘కరోనా’.. అందరి జీవితాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 5 మిలియన్ల ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా.. దాదాపు మూడున్నర లక్షల మంది మరణించారు. కరోనా మన మధ్యే ఉంది. కరోనా భయం కూడా అందరిలోనూ ఉంది. కరోనాతో కలిసి బతకాల్సిన ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో.. ప్రపంచం ఇంతకుముందులానే ఉంటుందా? మన జీవితాలు సురక్షితమేనా ? అంటే.. స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. ఖాళీ థియేటర్లు, మూతపడ్డ షాపింగ్ మాల్స్, తెరుచుకోని రెస్టారెంట్లు, ప్రేక్షకులు లేని స్టేడియాలే నిత్యం మనకు దర్శనమిస్తున్నాయి. అవి ఓపెన్ అయినా.. ఇంకొన్నాళ్లు ఇలాంటి ఒంటరి జీవితాలే కనిపించవచ్చు. ఎందుకంటే.. వాటన్నింటికీ ఆల్టర్నేట్ ఉన్నాయి.

సరికొత్త వెండితెర
కరోనాకు ముందు నుంచే.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు చూసే కొత్త సంస్కృతికి సినీ అభిమానులు, నెటిజన్లు కొద్దికొద్దిగా అలవాటుపడ్డారు. లాక్‌డౌన్ వల్ల మరెంతోమంది ఓటీటీలకు చేరువయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు భాషా చిత్రాలు ఇప్పటికే నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఇక ముందు ఫస్ట్ డే థియేటర్లో సినిమా చూడటం, అభిమాన హీరోల సినిమాలకు థియేటర్ ముందు గోల గోల చేయడం కనిపించడం అరుదే. లైవ్ కాన్సర్ట్స్, స్పోర్ట్ ఈవెంట్స్ కూడా ఓటీటీలో వస్తున్నాయి. ఇంటిల్లిపాది కలిసి సినిమాకు వెళ్లాలంటే.. బోలెడంతా ఖర్చు.. అలాంటిది చాలా తక్కువ మొత్తంలో బోలెడంత ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నాయి ఓటీటీలు. అంతేకాదు ట్రాఫిక్ గోల లేదు.. ఇంటి నుంచి కాలు బయట పెట్టే పని లేదు. దీంతో నెటిజన్లు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో ఉన్న కరోనా భయం కూడా ఓటీటీలకు మేలు చేసిందనే చెప్పాలి.

షాపింగ్
కరోనా ఎఫెక్ట్ వల్ల నేరుగా (ఆఫ్‌లైన్‌లో) షాపింగ్ చేసే వారి సంఖ్య తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలామంది విండో షాపింగ్ చేసే వాళ్లుంటారు. అలానే ఓ పది పన్నెండు షాపింగ్ సెంటర్స్ తిరిగి నచ్చినవి సెలెక్ట్ చేసుకునే వాళ్లుంటారు. కానీ కరోనా వారిలోనూ మార్పు తీసుకొస్తుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అంతేకాదు కరోనాకు ముందు నుంచే ఆన్‌‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇక ముందు అటు వైపు దృష్టి సారించే వాళ్ల సంఖ్య కూడా పెరగొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంగతి చెప్పనక్కర్లేదు. కొత్తగా షాపింగ్ చేయాల్సిన పని లేకుండా పోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్
కరోనా వల్ల .. రెండు మూడు నెలల పాటు చాలా మందికి ఇన్‌కమ్ సోర్స్ లేకుండా పోయింది. బజ్జీల కొట్టు నుంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి వరకు అందరికీ మనీ కష్టాలెదురయ్యాయి. కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ‘ఎమర్జెన్సీ ఫండ్’ అంటూ ఒకటి మన నిత్య జీవితంలో భాగం కావాలని నిశ్చయించుకున్నారు. అంతేకాదు ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడూ ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం పోయినా.. ఓ రెండు, మూడు నెలల పాటు ఆర్థిక కష్టాలు రాకుండా ఇంటిని నడిపించగలగాలంటే.. ‘ఎమర్జెన్సీ ఫండ్’ చాలా ముఖ్యమని భావిస్తున్నారు. ఆర్థిక నిపుణులు కూడా ప్రతి ఒక్కరూ ‘ఎమర్జెన్సీ ఫండ్’ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు.

డిజిటల్ మెనూ అండ్ కాంటాక్ట్‌లెస్ డైనింగ్
ఇప్పటికే ఫుడ్ యాప్‌ల హవా నడుస్తోంది. అలా అని రెస్టారెంట్లకు వచ్చి తినే వారి సంఖ్యలో తగ్గుదల ఏమాత్రం కనిపించలేదు. కానీ కరోనా తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చు. అంతేకాదు ఒకవేళ రెస్టారెంట్‌కు వెళ్లినా.. ఇకపై చుట్టూ జనమే కాదు ఆర్డర్ ఇచ్చేందుకు వెయిటర్ కూడా కనిపించకపోవచ్చు. కాంటాక్ట్‌లెస్ డైనింగ్ కోసం డిజిటల్ మెనూలు అందుబాటులోకి వస్తాయి. హోటల్ స్టాఫ్ అంతా హైజీన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇటు ఫుడ్ యాప్‌లు కూడా కస్టమర్లకు మరింత చేరువయ్యే పనిలో ఉన్నాయి. డెలివరీ బాయ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఫుడ్ డెలివరీ అందిస్తున్నాయి.

టెలీమెడిసిన్ అండ్ హెల్త్ కేర్
కరోనా వైరస్.. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. లాక్‌డౌన్ టైమ్‌లో ఆస్పత్రుల్లో ఓపీ లేకపోవడంతో చాలా మంది ఆన్‌లైన్‌లో డాక్టర్ల ద్వారా ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆస్పత్రిలో గంటలు గంటలు క్యూలో ఉండే పని లేకుండా.. డాక్టర్ అపాయింట్‌మెంట్‌తో ఇంటి వద్దే ఉండి, ఆన్‌లైన్‌లో వైద్యం చేయించుకోవడం ఇక ముందు కామన్‌గా కనిపించవచ్చు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ విధానం.. భవిష్యత్తులో మరింత మందికి చేరువవుతుందని నిపుణుల అంచనా. ఇక డోర్ స్టెప్ డెలివరీ అందించే ‘ఆన్‌లైన్ మెడికల్’ స్టోర్లకు కూడా కరోనా హెల్ప్ చేసిందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed