చిన్నబోయిన వార్ రూం

by Shyam |
చిన్నబోయిన వార్ రూం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి అమలు కోసం సచివాలయంలో వంద మంది సాంకేతిక నిపుణుల బృందంతో ఏర్పాటు చేసిన వార్​ రూం చిన్నబోయింది. పోర్టల్​ అమలులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పంపించేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 20 నుంచి 30 మందికే పరిమితం చేసినట్లు సమాచారం. ఇక్కడ ఉండే నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండి 33 జిల్లాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారంటూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్​కుమార్ పలుమార్లు ప్రకటించారు. మంత్రులను ఆహ్వానించి వార్ రూం పనితీరును వివరించారు. డేటాను భద్రంగా చూసుకుంటారని పేర్కొన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం కూడా వార్ రూం పనితీరును కొనియాడింది. ఇప్పుడేమో ఎక్కడి సమస్యలు అక్కడ ఉండగానే వార్ రూం నుంచి వారిని తొలగించారు. ధరణి పోర్టల్​ కోసం కృషి చేసిన సీనియర్ ఐఏఎస్​ అధికారులు సందీప్​ కుమార్ ​సుల్తానియా, రిజ్వి, రాహుల్​ బొజ్జా కూడా వార్​ రూంకు రావడం లేదని తెలిసింది. సోమవారం నుంచి వారి సొంత శాఖలపై దృష్టి పెట్టారని సమాచారం. అక్కడ కాంట్రాక్టు ఉద్యోగులే అధికం. ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం వారంతా 99 శాతం సమస్యలు పరిష్కరించారు. అందుకే వారి అవసరం ఉండదని భావించారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ‘తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు–2020’ చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక మద్దతు కల్పించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వార్ రూంను బల​హీనపరచడం అనుమానాలకు దారి తీస్తోంది.

పరిష్కారమేదీ?

ప్రస్తుతం ధరణి పోర్టల్​ ద్వారా సేల్​ డీడ్​, పార్టిషన్ డీడ్​, గిఫ్ట్​ డీడ్​ చేసేందుకు మాత్రమే ఆప్షన్లు రూపొందించారు. జీపీఏ, ఏజీపీఏ, పౌతి వంటి అనేక సేవలను పునరుద్దరించలేదు. పెండింగు కేసులకు పరిష్కారాన్ని చూపలేదు. తప్పొప్పులను సవరించేందులా తహసీల్దార్లకు అధికారం ఇవ్వలేదు. దీంతో చిన్నపాటి పొరపాటుకు కూడా యజమానులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వారంతా కోర్టులను ఆశ్రయించడం మినహా మరే మార్గాన్ని తయారు చేయకుండా ప్రభుత్వం ఇక్కట్లకు గురి చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం కోర్టు డిక్రీ ఇస్తే అమలు చేయాలి. ధరణి అందుకు ససేమిరా అంటోంది. పీఓబీ జాబితాలోని పొరపాట్లను సరి చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. వందలాది మంది పీఓబీ బారీన పడి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మార్గదర్శకాలేవీ?

ధరణిలో తలెత్తే సమస్యల పరిష్కారానికి రూపొందించిన వార్​ రూం ఇంకా 80 శాతం పనులు చేయాల్సి ఉందని రెవెన్యూ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడొకరు చెప్పారు. ఇప్పటి వరకు చట్టానికి గానీ, నాలా కన్వర్షన్ కు గానీ మార్గదర్శకాలనే జారీ చేయలేదు. వాటిని అమలు చేసేటప్పుడు తలెత్తే సాంకేతిక సమస్యలకు కూడా వార్ రూం నుంచి జవాబు చెప్పాలంటున్నారు. కనీసం అసైన్డ్​, భూములు పట్టా భూములుగా, పట్టా భూములు అసైన్డ్​ గా నమోదైన అంశాన్ని కూడా అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. ఆస్తిని ఇద్దరు, అంత కంటే ఎక్కువ మంది విక్రయించే అవకాశం కూడా లేదు. పెండింగ్​ మ్యూటేషన్ల కోసం వేలాది మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్​ సంతకాలు చేయని కారణంగా పాస్ పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పార్టు బి లెక్క తేలకుండా వార్​ రూంను కుదిస్తే భవిష్యత్తులో అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed