ఆయుర్వేదానికి తగ్గని క్రేజ్

by srinivas |
ఆయుర్వేదానికి తగ్గని క్రేజ్
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ప్ర‌పంచమంతా పాశ్చాత్య పోక‌డ‌ల‌ను అల‌వ‌ర్చుకుంటోంది. ఫాస్ట్ క‌ల్చ‌ర్ వైపు యువ‌త అడుగులేస్తోంది. ఎన్నో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు యువ‌తీ యువ‌కులు తోడ్ప‌డుతున్నారు. ఆక‌లికి, అనారోగ్యానికి అన్నింటికీ ఇంగ్లిషు మందులున్నాయి. ఇంత‌టి ఆధునిక యుగంలోనూ ఆయుర్వేదానికి క్రేజ్ త‌గ్గ లేదు. క‌రోనాతో మరింత ఆదరణ పెరిగింది. కొవిడ్ స‌మ‌యంలో క‌షాయం తాగారు. ఇప్ప‌టికీ ఇళ్ల‌లో క‌షాయం, వేడి నీళ్లు తాగ‌డం మాన‌లేదు. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో నివ‌సించే ఆదివాసీలు, గిరిజ‌నులు, చెంచులు ఔష‌ధ గుణాలున్న‌ చెట్లు, గ‌డ్డ‌లు, మొక్క‌లు, కాయ‌లు, కొన్ని ర‌కాల తీగ‌లు సేక‌రించి అమ్మ‌డంతో ఉపాధి పొందుతున్నారు.

అనంత‌పురం, క‌డ‌ప‌, గుత్తి, డోన్ ప్రాంతాల‌కు చెందిన కొంద‌రు హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు ఇలాంటివి త‌ర‌లించి మంచి ఆదాయం గ‌డిస్తున్నారు. వీరికి ఆద‌ర‌ణ ఏవిధంగా ఉందంటే కేవ‌లం తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోనే సుమారు 15 చోట్ల దుకాణాలు ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు అన్ని ఖ‌ర్చులు పోను రూ. 1500దాకా ఆదాయం గ‌డిస్తున్న‌ట్టు చెబుతున్నారు. రోడ్డుప‌క్క‌న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వీరి ద‌గ్గ‌ర న‌ల్ల ఉల‌వ‌లు, తిప్ప తీగ‌, తుల‌సి, ర‌త‌న‌పుల‌స‌, నేల గుమ్మ‌డి, నేల‌యామి, క‌ర‌క్కాయ‌, తానేకాయ‌లు, ఎర్ర‌మ‌ద్ది, తెల్ల‌మ‌ద్ది, తెల్ల ఈశ్వ‌రి, న‌ల్ల ఈశ్వ‌రి, స‌నాముఖి, నేల‌తంగ‌డి, గొట్టివేళ్లు, మాద‌గ‌గపూవులాంటి ఔష‌ద గుణాలు ఎక్కువ ఉన్న తీగ‌లు, గ‌డ్డ‌లు, వేళ్లు దొరుకుతున్నాయి. తామ‌ర‌, షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు, గ్యాస్‌ట్ర‌బుల్ వంటి స‌మ‌స్య‌ల‌కు ఇవి చాలా బాగా ప‌నిచేస్తాయ‌ని, రోగాల‌ను 100 శాతం త‌గ్గిస్తాయ‌ని చెబుతున్నారు. శ్రీ‌శైలం, న‌ల్ల‌మ‌ల అడ‌వుల నుంచి వీటిని తీసుకొస్తామ‌ని, కొన్ని వ‌స్తువులు అడ‌వుల్లో ఉండే చెంచు వాళ్ల ద‌గ్గ‌రా కొనుక్కొస్తామ‌ని చెబుతున్నారు.

వంశపారంపర్యంగా మందు ఇస్తున్నాం

మా తాతముత్తాత‌ల కాలం నుంచి ఆయుర్వే దం, చెట్ల మందులు అమ్మి జీవ‌నం సాగిస్తున్నాం. షుగ‌ర్‌, గ్యాస్ ట్ర‌బుల్‌, కీళ్ల నొప్పుల‌కు మా దగ్గర ల‌భించే ఔష‌ధాల‌తో క‌చ్చితంగా జ‌బ్బు న‌యం అవుతుంది. ఇటీవ‌లి కాలంలో ఆయుర్వేదం, చెట్ల మందుల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఆయుర్వేద‌, చెట్లు మందులు అమ్మ‌డం మా వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తోంది. కుటుంబంలో ఎంత‌మంది ఉన్నా ఒక‌రికి క‌చ్చితంగా ఆయుర్వేదం, చెట్ల మందుల చిట్కాలు నేర్పిస్తాం. మా కుటుంబంలో ఐదుగురు అన్న‌ద‌మ్ములు ఇదే వృత్తిలో కొన‌సాగుతున్నాం, హైద‌రాబాద్‌తో పాటు వివిధ ప‌ట్ట‌ణాల్లో రోడ్డుప‌క్క‌న దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్ర‌యిస్తున్నాం.

-స‌ప్పిడి హ‌న్మంత్‌, గుంత‌క‌ల్లు,అనంత‌పురం జిల్లా

ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫ్టెక్ట్ లేదు..

ఆయుర్వేద మందులతో ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయాసంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో చెట్ల మందులు, ఆయుర్వేదాన్ని ఆశ్రయించాను. కొంత ఉపశమనంగా ఉంది.. ఇంగ్లిష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ లు ఉండేవి.ఆయుర్వేద మందులతో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు.

– రమేష్, వినియోగదారుడు

Advertisement

Next Story