వేణుగోపాలా.. కాపాడుకోలేవా.. ఆలయ భూములు పూజరివేనట..

by Shyam |
 వేణుగోపాలా.. కాపాడుకోలేవా.. ఆలయ భూములు పూజరివేనట..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వనపర్తి జిల్లా పెబ్బేరులో 30 ఎకరాలకు పైగా ఆలయ భూమి అన్యాక్రాంతమవుతోంది. ఆలయానికి చెందిన భూములు పూజారి పేరుమీదకు బదిలీ అయిపోతున్నాయి. జిల్లా కలెక్టర్ ససేమిరా కాదన్నారు. ఆలయం భూములను వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలూ వెళ్ళాయి. అయినా ‘ఓఆర్సీ’ ద్వారా భూములు బదిలీ అయిపోయాయి. దాదాపు నలభై ఏళ్ళుగా సంత అవసరాలకు వాడుతున్న ఈ భూమి వేలాది మంది సామాన్యులకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వానికి ఆదాయాన్నీ సమకూరుస్తోంది. కానీ కోట్లాది రూపాయల విలువైన ఈ భూమిపై రాజకీయ గద్దల కన్ను పడడంతో పూజారి ద్వారా పని కానిచ్చేస్తున్నారు.

గ్రామస్తులంతా ఒక్కటై పోరాడుతున్నా అక్రమార్కులకు అనుకూలంగానే ఉత్తర్వులు వెలువడుతున్నాయి. కోట్ల రూపాయల విలువజేసే ఆ భూములపై రియల్టర్ల కన్ను పడింది. ఆ స్థలానికి హక్కులు తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులు దందా నడిపించేశారు. ఇంకేముంది? చకచకా ఆర్డర్లు పాస్ అవుతున్నాయి. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు, తెల్లారేసరికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. సామాన్యులకు చుక్కలు చూపించే రెవెన్యూ అధికారులు ఒక్క రోజులోనే అన్ని పత్రాలూ ఇచ్చేశారు. వీఆర్వో మొదలు కలెక్టర్ దాకా ఉత్సాహంగా పనులు చేసి పెట్టారు. పరాధీనమవుతున్న వనపర్తి జిల్లా పెబ్బేరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమి కథ ఇది.

అది మాదంటే మాదే..

రాజులు, జమీందార్లు దేవుడి గుడికి భూమి కేటాయించడం ఆనవాయితీ. గుడి పేరిటనే ఆ భూములను రాసేచ్చేవాళ్లు. ఆ భూమిపై రకరకాల రూపాల్లో వచ్చే ఆదాయంతో ఆలయ కైంకర్యాలు చేసుకోడానికి ఇలాంటి ఆనవాయితీ ఉండేది. పెబ్బేరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల స్థలం కూడా అలాంటిదే. సంస్థాన్ సుగూర్ ‘ఇనాం’ పేరుతో ఇచ్చిన భూమిపై గత కొన్నేళ్ళుగా వివాదం కొనసాగుతూ ఉంది.

దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం పెబ్బేరు సర్వే నెం. 392లో 15.18 ఎకరాల ఖుష్కి, సర్వే నెం. 405లో 15.01 ఎకరాల ఖుష్కి, సర్వే నెం. 398లో 2.02 ఎకరాల తరి, సర్వే నెం. 402లో 0.30 ఎకరాల తరిపొలాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ భూముల్ని ‘దేవస్థానం ఇనాం’గా దేవస్థానం రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆర్సీ నెం. బి/3726/91, తేదీ. 15.10.1998న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.మోహనాచారి వనపర్తి ఆర్డీఓకు పూర్తి వివరాలతో లేఖ రాశారు. దీన్ని ‘సర్వీసు ఇనాం’ భూమిగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, భూమిని తమకే ఇనాం ఇచ్చారని, గుడికి ఎలాంటి సంబంధమూ లేదంటూ నంబి రామలక్ష్మయ్య ఆ భూమిలో 15.18 ఎకరాలు తనకే చెందుతాయంటూ విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘నేచర్ ఆఫ్ ల్యాండ్ మాఫీ ఇనాం’ అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తనకే ‘ఇనాం’గా సంక్రమించిందని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడి పేరు రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. రెవెన్యూ శాఖ అధికారులు సైతం రామలక్ష్మయ్యకే వత్తాసు పలుకుతున్నారు

ఓఆర్సీ జారీ

దేవుడి సేవా కైంకర్యాల కోసం ఇచ్చిన భూమిపై పూజారి కుటుంబానికి అధికారులు ‘ఓఆర్సీ’ (ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్) ఇచ్చారు. పిటిషనర్‌కు ఎలాంటి సమాచారం లేకుండా ఆర్డీవో నుంచి ఆర్డర్ జారీ అయింది. ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీపై కొద్ది రోజుల తర్వాత విచారణ చేసిన వనపర్తి జాయింట్ కలెక్టర్ ఆ ఉత్తర్వులను రద్దుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వి.ఉషారాణి ఉత్తర్వులు నెం. ఎఫ్-2/10/2007, తేదీ. 11.04.2007 ప్రకారం సర్వే వనపర్తి డివిజన్ పెబ్బేరులోని నెం. 392, 405లోని 15.18 ఎకరాలు, 15.01 ఎకరాల చొప్పున మొత్తం 30.19 ఎకరాలు ఇనాం భూములుగా ఉన్నాయని, అవి పూజ, అర్చక విధులు నిర్వహించడానికే నంబి కృష్ణయ్య పేరిట ఉన్నాయని స్పష్టం చేశారు. సదరు భూములన్నీ శ్రీగోపాలస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలకే చెందుతాయని పేర్కొన్నారు. చాలా రెవెన్యూ రికార్డుల్లో ఇదే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఈ భూములపై చేసిన అన్ని రిజిస్ట్రేషన్లనూ రద్దు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్‌ను కలెక్టర్ ఆదేశించారు. కానీ మళ్లీ ఓఆర్సీ ఇచ్చారంటూ పెబ్బేరు గ్రామస్తులు ఆరోపించారు. దీని ఆధారంగా మళ్లీ క్రయ విక్రయాలకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

మున్సిపాలిటీకి అక్షయపాత్ర

పెబ్బేరు మున్సిపాలిటీకి ఈ భూమి ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. దేవుడి పేరిట ఉన్న 30.19 ఎకరాల్లోనే 1981 నుంచీ సంత జరుగుతోంది. తెలంగాణలో అతి పెద్ద సంతగా దీనికి పేరుంది. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చే చిరు వ్యాపారులతో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి ప్రతీ ఏటా మూడున్నర కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతోంది. ఈ సంతపై ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నాయి. తాగునీటి కోసం నాలుగు బోర్లు, పంపు హౌజ్ కూడా ఈ సంత స్థలంలోనే ప్రభుత్వం చాలా కాలం క్రితం నిర్మించింది. పశువుల తాగునీటికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మిర్చి, ఉల్లిగడ్డ నిల్వలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు సేద తీరేందుకు నిర్మాణాలు కూడా జరిగాయి. హై మాస్ట్ లైట్లనూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇన్ని పనులు జరిగేటప్పుడు హక్కుదారులమంటూ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎలాంటి అభ్యంతరాలనూ వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ భూమి హాట్ కేకులా మారడంతో గద్దలు వచ్చి వలాయి. పాత తేదీలతో రకరకాల భూమి పత్రాలు పుట్టుకొచ్చాయి. కైంకర్యం చేసుకోడానికి రకరకాలప్రయత్నాలు మొదలయ్యాయి.

పోరాడుతున్న సంరక్షణ కమిటీ

2007లో గుడి పూజారి రెండెకరాలను విక్రయించారు. గ్రామ ప్రజలంతా ఏకమై పోరాడి ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు. దేవుడి పేరిట ఉన్న భూమిని మార్కెట్ ధర ప్రకారం గ్రామ పంచాయతీకే అమ్మాలని అధికారులను కోరారు. దానికి సంబంధించిన డబ్బులు రూ. 10 లక్షలను వనపర్తి ఆర్డీఓ పేరిట డిపాజిట్ కూడా చేశారు. 2007 ఏప్రిల్ 9న గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం కాపీని కలెక్టర్‌కు పంపారు. కానీ మళ్లీ పూజారికి ‘ఓఆర్సీ’ ఇవ్వడంతో పెబ్బేరు పట్టణ ప్రజలు, వేణుగోపాలస్వామి దేవాలయ భూ సంరక్షణ కమిటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి మాన్యానికి ఆలయ పూజారికి ఇచ్చిన ‘ఓఆర్సీ’ని రద్దు చేయాలంటూ తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అనేక అర్జీలు పెట్టుకున్నారు. స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి ఆలయ భూమిని కాపాడాలని, ఓఆర్సీని రద్దు చేయించాలని వేడుకున్నారు. లిఖితపూర్వకంగా అందరూ సంతకాలు చేసి వినతి పత్రాలు కూడా సమర్పించారు. చివరకు భూమి చేతులు మారుతూ ఉంది. ఈ భూమిపై హక్కులు పోయిన తర్వాత సంత ఎక్కడుంటుంది, దశాబ్దాలుగా ఈ సంతపై ఆధారపడి బతుకుతున్న ప్రజలు ఎక్కడకు పోవాలి, వారి జీవితాలు ఏం కావాలనేదానిపై ఎవరి నుంచీ సమాధానం దొరకడంలేదు. ఆలయ భూములు కళ్ళ ముందు చేతులు మారుతున్నా పట్టించుకునే నాధులు కరువయ్యారు. సామాన్యుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.

పెద్దల హస్తముంది : కె.బాలస్వామి, అధ్యక్షుడు, వేణుగోపాలస్వామి దేవాలయ సంరక్షణ కమిటీ

”మేం 2007 నుంచి పోరాటం చేస్తున్నాం. ఓసారి ‘ఓఆర్సీ’ ఇచ్చారు. అప్పుడు అందరం ఏకమై రద్దు చేయించుకున్నాం. ఇప్పుడు మళ్లీ ‘ఓఆర్సీ’ జారీ అయింది. ఆలయ భూములను అమ్మకాలకు అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. పూజారికి ఎలాంటి హక్కులు లేవు. ఇదే విషయాన్ని అధికారులకు, మంత్రికి మొర పెట్టుకున్నాం. ‘ధరణి’లోనూ ఇప్పుడు పూజారి పేర్లే కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు భూమి బదలాయింపుకు, అమ్మకాలకు రాచమార్గంగా మారింది. గ్రామ పంచాయతీ తరపున కొనేందుకు రూ. 10 లక్షలు కూడా డిపాజిట్ చేశాం. కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అగ్రిమెంటు రూపంలో చేతులు మారుతున్నాయి. మేం ఎంతగా పోరాడినా అధికారులు స్పందించడం లేదు. దీని వెనుక పెద్దల హస్తముంది. అందుకే అధికారులు మా గ్రామస్తుల విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు”.

Advertisement

Next Story