నిన్న రాత్రి మొదటిసారి నాకు చచ్చి‌పోవాలనిపించిందమ్మా.. ప్రైవేట్ టీచర్ కన్నీటి ‘కథ’

by Anukaran |
Private teacher
X
  • ‘దిశ-కథాస్రవంతి’ పోటీలలో మూడో బహుమతి పొందిన కథ

గురుదక్షిణ

ఉజ్వల తన కూతురు కౌముదిని తీసుకొని పక్క వీధిలోని కిరణ్మయి ఇంటికి బయలుదేరింది. ‘ఈ కరోనా సమయంలో బయటకు వెళ్లడం అవసరమా?’ అని అత్తగారు అగుణుగుతున్నా ఎందుకో కిరణ్మయిని కలవాలని బలంగా అనిపించింది ఉజ్వలకు. దానికి కారణం లేకపోలేదు. ఉజ్వల, కిరణ్మయి ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్స్. ఎనిమిది నెలల క్రితం కిరణ్మయి స్కూల్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్లు టెస్టులు చేసి కిడ్నీ ప్రాబ్లం అన్నారు. విశ్రాంతి చాలా అవసరమన్నారు. ఈ కారణంతో పాపం కిరణ్మయి టీచింగ్ మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. బాబు టెన్త్ క్లాస్, పాప ఇంటర్మీడియట్. కిరణ్మయి వాళ్లాయన కూడా ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. ఇద్దరూ సంపాదిస్తూ పిల్లల్ని మంచి కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివిస్తున్నారు. ఆరు నెలల క్రితం వరకు బాగానే సాగింది కుటుంబం. కిడ్నీ సమస్యతో కిరణ్మయి ఆరోగ్యం బాగా దెబ్బతింది. వాళ్ల ఆయన కాలేజీ అయిపోగానే సాయంత్రం 4 నుండి 7 వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో పార్ట్‌ టైం టీచర్‌గా చేరారు.

ఉజ్వల నిన్న ఫోన్ చేస్తే తన ఆరోగ్యం బాలేదని చెప్పింది కిరణ్మయి. ఓసారి పలకరించివద్దామని, అత్తగారు వారిస్తున్నా వినకుండా వంట చేసి, అన్నీ రెడీగా డైనింగ్ టేబుల్ పైన సర్ది, గుత్తొంకాయ కూర అంటే కిరణ్మయికి ఇష్టమని ఒక బాక్స్‌లో వేసుకుని, కొన్ని పండ్లు తీసుకుని కూతురు కౌముదికి ఒక మాస్క్ ఇచ్చి, తానూ మాస్క్ తగిలించుకుని, ‘అలా వెళ్లి ఇలా వస్తానని’ అత్తగారితో చెప్పి బయలుదేరింది. మంచి ఎండ, మిట్ట మద్యాహ్నం. తనకు పనే సరిపోతుంది. సమయం దొరకదు మరి. ఇంకా ఇంట్లో తెలియకుండా వేస్తున్న చిట్టి డబ్బులు కట్టమని చిట్టి ఓనర్ ఒకటే ఫోన్లు. కిరణ్మయిని పలకరించినట్లు ఉంటుంది. చిట్టి డబ్బులు కట్టినట్లు ఉంటుందని ఆలోచించి బయటకు వెళ్లింది ఉజ్వల. ఆలోచిస్తూనే గేటు తీసుకుని లోపలికి నడిచారిద్దరూ. కౌముది ‘అక్కా’ అంటూ కిరణ్మయివాళ్ల అమ్మాయి దగ్గరకు వేగంగా పరిగెత్తితే, వద్దు అన్నట్టు కోపంగా కళ్లతోనే వారించింది ఉజ్వల. కరోనా కష్టకాలం కదా భౌతిక దూరం పాటించాలి అని గుర్తు చేస్తూ. ‘సంతోషంగా ఆడుకునే హక్కును కూడా లాగేసుకుంది కదా! ఈ డర్టీ వైరస్’ అని తనలో తాను గొణుక్కుంటూ ‘హాయ్ కౌముదీ’ అని పలకరించింది కిరణ్మయి కూతురు. తను కూడా చాలా నీరసంగా కనిపించింది. ‘నమస్తే ఆంటీ’ అంది ఉజ్వల చేతుల వంక అప్రయత్నంగా చూస్తూ. తీసుకెళ్లిన పండ్ల కవర్, కూర బాక్స్ పాప చేతికందించింది ఉజ్వల.

వెంటనే తింటుందేమో అనుకుంది. కానీ, కవర్‌ లోపల పెట్టి వచ్చి కామ్‌గా కూర్చుంది. కిరణ్మయి మంచం మీద కూర్చుని ‘మధుమంజరి’ కార్యక్రమం వింటోంది. అది చూసి ‘కిరణ్మయీ నీకు సినిమా పాటలు అంతగా నచ్చవుగా’ వింటున్నావే అంది ఉజ్వల. రేడియోలో ఒంటిగంట పదినిమిషాలకు వార్తలు వస్తాయి. క్రమం తప్పకుండా వింటాను. స్కూల్ ఎప్పుడు తెరుస్తారో చెబుతారని ఆశగా వింటూనే ఉంటాను. ఇప్పటిలో బడులు తెరిచేలా లేరు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది కిరణ్మయి. అవును ‘మీ వారు బయటికి వెళ్లి వచ్చారా ఏంటి?’ అని అడిగింది ఉజ్వల. లేదు. ‘ఎందుకలా అడిగావ్?’ అంది కిరణ్మయి. ‘ఏం లేదే, మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి 50 డిగ్రీల ఎండ మాడిపోతుంటే మీ వారు ఇప్పుడు వంట చేస్తుంటే సందేహం కలిగి అడిగా అంతే’ అంది ఉజ్వల.

‘ఓ అదా! తండ్రి కూతురు ఇద్దరు ఉపవాసం. మధ్యాహ్నం మూడింటికి భోజనం చేస్తారు’ చెప్పింది కిరణ్మయి. ‘ఏంటీ? మూడింటికా, ఎందుకు? ఈరోజు శుక్రవారం ఉపవాసమా! సరే అయితే, పాప ఎందుకు ఉపవాసం!?’ అడిగింది ఉజ్వల. ‘మంచి రిజల్ట్ రావాలని’ అంటూ పెద్దగా ఏడ్చింది కిరణ్మయి. ‘నిజం చెప్పు’ అంటూ గట్టిగా అడిగింది ఉజ్వల. లాక్‌డౌన్ మొదలవగానే మా ఆయన పనిచేసే కాలేజీవాళ్లు పిలిచి తెలివిగా ‘ఈ విద్యా సంవత్సరానికి మీ సేవలు అవసరంలేదు, అవసరమైతే పిలుస్తాం’ అంటూ చేతులు దులుపుకున్నారు. ఇక ప్రైవేట్ స్కూల్‌వాళ్ల సంగతి సరేసరి. ‘మీది పార్ట్ టైం జాబ్ కదా ఫుల్ టైం టీచర్లకే నెల సగం జీతం ఇస్తున్నాం, మీకు జీతం ఇవ్వలేం’ అని తేల్చేశారు. ఇంట్లో సరుకులు సరిపోవని, తండ్రి-కూతురు ఇద్దరు ఈ నిర్ణయం తీసుకున్నారు’ చెబుతున్నపుడు తన గొంతు గద్గదమయింది.

ఆ రోజు నుండి తండ్రి కూతురు ఇద్దరు మధ్యాహ్నం మూడింటికి భోజనం చేస్తున్నారు. ‘నేను పేషెంట్‌ని కాబట్టి ఉదయం నావరకు ఓ చిన్న కప్పు ఉప్మా ఉడకేసి పెడ్తున్నారాయన’ అంటూ కన్నీళ్లపర్యంతమైంది కిరణ్మయి. కడుపులో కెలికినట్లయింది ఉజ్వలకు. తేరుకుని ‘అయినా, మిట్ట మధ్యాహ్నం వంట ఎందుకు చేయడం’ అని అడిగింది. వెంటనే కిరణ్మయి కూతురు కల్పించుకుని ‘నాన్న త్వరగా వంట చేస్తే నాకు తినెయ్యాలనిపిస్తుందని నేనే ఆలస్యంగా వండమన్నానాంటీ’ అంది. కూతురు. ఆ చిన్నదాని పేదదైన పెద్ద మనసుకు నా కళ్లు చెమర్చాయి. కౌముది ఏడుస్తూనే ‘మా అమ్మకు ఫోన్ చేయొచ్చు కదా అక్కా?’ అంది. ‘ఆయనకి అభిమానం ఎక్కువ, ఎవరి ముందు చేయి చాచి అడగరు. అడిగితే ఊరుకోరు అందుకే గుట్టుగా ఇలా గడిపేస్తున్నా’ అంది కిరణ్మయి.

మొన్న ఎవరో పేదవారికి సరుకులు పంచుతున్నారని తెలిసి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని అక్కడి వరకు వెళ్లారట. తన స్టూడెంట్ ఎవరో ఎదురొచ్చి, ‘ఏంటి సర్, ఇలా వచ్చారు. ఈ సరుకులు మీరు కూడా స్పాన్సర్ చేశారా?’ అనడిగాడట. వెంటనే వెనక్కి వచ్చేసారు. నిరాశగా చెప్పింది కిరణ్మయి. మనసంతా ఏదోలా అయిపోయింది. తానూ ఓ ప్రైవేట్ స్కూల్ టీచరే. కానీ, వాళ్లాయనది చిన్న పర్మనెంట్ ఉద్యోగం. వీళ్ల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. మాట్లాడుతూనే ఉంది కానీ, మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. సమాజ నిర్మాణం చేసే విద్యాదాతల దయనీయ స్థితి తల్చుకుని లోలోపల కుమిలిపోతోంది ఉజ్వల. ప్రైవేటు పాఠశాలల వాళ్లు విద్యా సంవత్సరం సగం అయే లోపు సంవత్సరానికి సరిపడ ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తారు. వీరినే నమ్ముకున్న ఉపాధ్యాయుల జీవితాన్ని మాత్రం నడి రోడ్డుపై నిలుచోబెడుతారా?

ఈ ప్రభుత్వాలు కూడా తాగి తలకు పోసుకునేవాడికి పిలిచి మరీ వేలకు వేలు ఇస్తారు. వలస కార్మికుల గురించి, యాచకుల గురించి, అందరి గురించి పట్టించుకుంటారు, ప్రైవేటు ఉపాధ్యాయులను మాత్రం గాలికొదిలేసారు. ‘అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా’ అనే శ్లోకం కళ్ల ముందు మెదిలింది. అజ్ఞానమనే చీకటిని పారదోలి మన కండ్లకు జ్ఞానమనే కాటుకను దిద్దే గురువుల కండ్లనే పొడిచి, వారి జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నాం అన్న సంగతి ఈ సమాజం, ప్రభుత్వం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో !? ప్రతి ఒక్కరూ తాము లేదా తమ పిల్లలు ఏదో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకునే ఉంటారు. ఇప్పుడు ఎంతో ఉన్నతస్థితికి ఎదిగి ఉంటారు. అలాంటి వారంతా తమ తమ టీచర్ల స్థితిని గమనించి వారి రుణం కొంతైనా తీర్చుకోడానికి ఇది గొప్ప తరుణం. వారు విద్యాదాతలు ఎవరి ముందు చేయి చాచి యాచించరు.

‘టీచర్ల ఫోన్ నంబర్లు ఎతికి మరీ ఈ మధ్య ‘గెట్ టు గెదర్’ పెట్టుకోవడం, ఆహా, ఓహో అనుకోవడం, ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం కామనైపోయింది. సంతోషమే. కానీ, మీరిచ్చేది దానం అని అసలు అనుకోకుండా మీ ఉన్నత స్థితికి కారకులైనవారికి గురుదక్షిణ చెల్లించండి’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనిపించింది. ఉజ్వలకు. ‘ఏమాలోచిస్తున్నావే?’ కిరణ్మయి అడగడంలో తేరుకుంది. ‘ఇంతకీ బాబు కనిపించట్లేదు, ఎటెళ్లాడు?’ అడిగింది. ‘పదో పరీక్షలు ఆగిపోయాయని తెలియగానే అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు. వాళ్ల బాబుకూడా సేమ్ క్లాస్, ఇద్దరూ కలిసి చదువుకుంటారని’ చెప్పింది కిరణ్మయి. ఈలోగా వంట గదిలోంచి, ఓ చేతిలో గరిటతో నిలువునా చెమటలతో వచ్చి ‘బావున్నావామ్మా’ అంటూ పలకరించారు వాళ్లాయన. ‘అన్నయ్యా, ఈ పూటకి నేను తెచ్చిన కూరతో తినేయండి. సాయంత్రం వండుకోవచ్చు’ అని అంటున్నా, ‘సాయంత్రం అయినా చేయాలి కదమ్మా’ అంటూ లోపలికి వెళ్లిపోయారు కిరణ్మయి వాళ్లాయన.

చిట్టి ఓనర్ ఫోన్లు చేస్తూనే ఉన్నది మధ్య మధ్యలో. ‘రేపు వచ్చి కలుస్తాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఉజ్వల. వెంటనే పర్స్‌లోంచి కట్టాల్సిన చిట్టి డబ్బులు రూ. ఐదు వేలు తీసి కిరణ్మయి చేతిలో పెట్టింది. ‘ఆయనకి ఇష్టం ఉండదు’ అని తిరిగి ఇచ్చేసింది కిరణ్మయి. అన్నయ్యా అంటూ పిలిచింది ఉజ్వల. కిరణ్మయి వాళ్లాయన వచ్చాడు. ‘ఇది మీ చెల్లి మీకు ఇస్తున్న కానుక కాదనకండి’ అంటూ బలవంతంగా ఐదు వేలు ఆయన చేతిలో పెట్టింది. దానికి ఆయన పెద్దగా ఏడ్చి, ‘నిన్న రాత్రి మొదటిసారి నాకు చచ్చి‌పోవాలనిపించిందమ్మా, భార్యాపిల్లలను పెంచలేని, పోషించలేని దౌర్భాగ్యస్థితి నాకెందుకిచ్చావ్ భగవంతుడా !? అని ఏడ్చాను. దేవుడున్నాడమ్మా, ఇదిగో నీ రూపంలో వచ్చాడు’ అని బిడియపడుతూనే, వణుకుతున్న చేతులతో ఆ డబ్బు తీసుకున్నాడు. ‘మరి ఈ డబ్బు తిరిగి‘ అంటుండగా, ‘అన్నా ! ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంటికి కావలసిన సరుకులు తీసుకురండి’ అని చెప్పి కిరణ్మయి వైపు తిరిగింది. ‘ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని’ చెప్పి వడివడిగా బయటకు నడిచింది కూతురు కౌముదితో. కౌముది ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కష్ట సమయంలో స్నేహితురాలిని ఆదుకున్నానని, తన కూతురు కౌముదికి మానవతా విలువలు నేర్పగలిగానని సంతోషం కలిగింది ఉజ్వలకు.

-తురుమెళ్ల కళ్యాణి
89770 18592

Advertisement

Next Story