అడ్డం తిరిగిన ‘అడ్డి’ కథ

by Aamani |
అడ్డం తిరిగిన ‘అడ్డి’ కథ
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అధిష్టానం పంపిన సీల్డ్ కవర్ ఆ పార్టీ వర్గాలను, నేతలు, కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది. ఇక తానే చైర్మన్ అని ఆ నేత, పార్టీ వర్గాలు, ఆయన అనుచరులు సంబరాలు చేసుకునే సమయంలో చివరి క్షణం వారిని ఆశ్చర్యపరిచింది. ఏంటా..క్షణం అని అనుకుంటున్నారా..వివారాల్లోకెళితే..ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఆదిలాబాద్‌కు చెందిన అడ్డి భోజారెడ్డికే దక్కుతుందని ప్రచారం జరిగింది. చివరిక్షణం వరకు కూడా ఆయన పేరే బలంగా వినిపించింది. ఆయనే డీసీసీబీ చైర్మన్ కావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈ విషయమై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి‌తో పాటు జిల్లాకు చెందిన శాసనసభ్యులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు‌తో పాటు ఇతర వ్యవహారాల కోసం భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టుకున్నారు. ఎన్నికల రోజున తననే చైర్మన్‌గా ప్రకటిస్తారని ఆయన ధీమాతో ఉన్నారు. కానీ, ఎన్నికల రోజున సీల్డ్ కవర్‌లో చైర్మన్ పదవికి ఆయన పేరును ప్రకటించలేదు. దీంతో ఒకేసారి అన్ని వర్గాలవారు విస్మయానికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే..?

సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం జిల్లా నేతలు భారీగానే పోటీపడ్డారు. డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని తూర్పు ప్రాంత నేతలు ఒకే అంగీకారానికి వచ్చేందుకు ముందుకువచ్చారు. అనుకున్నట్టుగానే చైర్మన్‌గా మంచిర్యాలకు చెందిన తిప్పన లింగయ్య, ఆసిఫాబాద్‌కు చెందిన కొమురం మాంతయ్య పేర్లను ఖరారు చేసి, వారి పేర్లను సీల్డ్ కవర్‌లో అధిష్టానానికి పంపారు. కానీ, అనుకోని విధంగా చివరిక్షణంలో డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో మాత్రం అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. దీనికంటే ముందే అంతర్గత రాజకీయాలు జరిగాయి. అదేమిటంటే తాము ప్రతిపాదించినవారు కాకుండా వేరేవారు ప్రతిపాదించిన నేత చైర్మన్ అయితే తమ పేరు ఎక్కడ మసకబారుతుందోనని నేతలు అంతర్గతంగా అధిష్టానికి తమ అనుచరులకే అవకాశం కల్పించాలంటూ ప్రతిపాదించినట్టు సమాచారం. ఓ పక్క మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరుడైన రఘునందన్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తే, మరోపక్క ఎమ్మెల్యే జోగు రామన్నతనకు సన్నిహితుడైన అడ్డి భోజా‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. కానీ, వీరిద్దరినీ కాకుండా అదిష్టానం మాత్రం జిల్లాలోని నార్నూర్‌కు చెందిన కాంబ్లె నాందేవ్ పేరును ఖరారు చేసింది. దీంతో అందరూ విస్మయానికి గురయ్యారు. 1997లో ఏడాదిపాటు డీసీసీబీ ఇన్‌చార్జి చైర్మన్‌గా నాందేవ్ పని చేశారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. మరోపక్క ఇందుకు జిల్లా నేతల నడుమ నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తున్నది. మొత్తంగా నాందేవ్‌కు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా అదృష్టం వరించింది.

అల్లోల, జోగుల విభేదాలే కారణమా!

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నడుమ నెలకొన్న అంతర్గత విభేదాలే అడ్డి భోజారెడ్డిని చైర్మన్ కాకుండా అడ్డుపడ్డాయని జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. తాను ప్రతిపాదించిన నేత చైర్మన్ కాకపోతే జిల్లాలో తన పేరు ఎక్కడ మసకబారుతుందోనని అల్లోల భావించి తన అనుచరుడైన రఘునందన్ రెడ్డి పేరును ప్రతిపాదించారని సమాచారం. జోగు రామన్న అనుచరుడికే చైర్మన్ పదవి దక్కితే జిల్లాలోని ఇతర నేతలు తనను మంత్రిగా కాకుండా తక్కువగా చూసే ప్రమాదం ఉందని ముందుగా ఊహించి మంత్రి అల్లోల వీరిద్దరినీ కాకుండా వేరే వారెవ్వరికైనా చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానానికి సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో జోగు రామన్న తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. తాను చేసే ప్రయత్నం చేశాననీ, అధిష్టానం మాత్రం తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని రామన్న అధిష్టానంపై బలంగా ఒత్తిడితేలేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మొత్తంమీద ఉమ్మడి జిల్లాలో అడ్డి భోజారెడ్డి కథ అడ్డం తిరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

Next Story