3 అడుగుల వకీల్‌సాబ్.. జీవితంలో ‘ఎత్తు’కు ఎదిగింది!

by Shyam |
Shortest-Lawyer,-Harwinder-
X

దిశ, ఫీచర్స్: ఆమె బాల్యం అందరు అమ్మాయిల్లా సాఫీగా సాగలేదు. అడుగడుగునా అవహేళనలు, అవమానాలతోనే గడిచిపోయింది. కారణం తన ఎత్తు. కేవలం 3 అడుగుల 11 అంగుళాల పొడవున్న తను స్నేహితుల సూటిపోటి మాటలకు భయపడి పాఠశాలకు వెళ్లేందుకే భయపడేది. క్లాసులు డుమ్మా కొడుతూ నైరాశ్యంలో ఏకాంతంగా గడిపేది. ఈ క్రమంలో ‘ఎత్తు’ పెరగకపోవడం పెద్ద నేరమేమీ కాదని, ఇది ‘లా ఆఫ్ నేచర్’ అని గ్రహించిన ఆ యంగ్ గర్ల్.. తనను తాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకోవాలనుకుంది. కష్టపడి చదివి లాయర్‌ పట్టా సంపాదించింది. ప్రస్తుతం జలంధర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ టాలెంటెడ్ యంగ్ లాయర్ పేరు ‘హర్విందర్ కౌర్’.

‘పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, లావు, సన్నం’ అంటూ సమాజం ఎప్పుడూ వివక్ష చూపిస్తూనే ఉంటుంది. ఆ మాటలు బాల్యంలో బాధించినా, ఆమె భవిషత్యు గురించి తల్లిదండ్రులు బాధపడటంతో తన మనసు మార్చుకుంది. సమాజధోరణి పక్కనపెట్టి తన జీవితం గురించే ఆలోచించసాగింది. హర్విందర్ కౌర్ (రూబీ) మొదట ఎయిర్‌హోస్ట్రెస్ కావాలని నిర్ణయించుకున్నా, తన హైట్ కారణంగా అది సాధ్యం పడలేదు. దీంతో చట్టాన్ని అధ్యయనం చేసి, వికలాంగుల గొంతుగా మారాలనుకున్న రూబీ అటువైపుగా అడుగులు వేసింది. మూడేళ్ల లా డిగ్రీ కంప్లీట్ చేసి, ప్రస్తుతం జిల్లా బార్ అసోసియేషన్ (జలంధర్) వైస్ ప్రెసిడెంట్, న్యాయవాది జగపాల్ సింగ్ ధూపర్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో 50,000 మంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గానూ పాపులర్ కావడం విశేషం.

Shortest-Advocate

నన్ను చూసి స్ఫూర్తిపొందుతున్నారు..

శరీరం సాధారణంగా పెరగడం లేదని క్లాస్ IVలో తెలుసుకున్నాను. ఇదే క్రమంలో ఎత్తు కారణంగా స్కూల్‌లో ఎగతాళికి గురయ్యా. కాలేజీలో చేరితే మరోసారి అదే బాధ అనుభవించాల్సి వస్తుందని భయపడేదాన్ని. అయితే ఎవరికీ భారంగా ఉండకూడదనుకుని ప్రపంచాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా. ఈ మేరకు ‘కేసీఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా’లో ప్రవేశం పొందిన తర్వాత జీవితం మారిపోయింది. అక్కడ హ్యాపీగా కోర్సు కంప్లీట్ చేశాను. అభద్రత, ఆత్మన్యూనత‌తో బాధపడేవారు ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. గతంలో నన్ను ఎగతాళి చేసిన వాళ్లే గౌరవించడం సంతోషంగా ఉంది. నా సక్సెస్ పట్ల గర్వపడుతున్నాను. – హర్విందర్ కౌర్, లాయర్

Advertisement

Next Story

Most Viewed