సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర విడదీయలేనిది

by Ravi |
Sajjala Ramakrishnareddy
X

దిశ, ఏపీ బ్యూరో: సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర విడదీయలేనిదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులలో సేవాగుణం, దానగుణం ప్రస్పుటంగా ఉంటుందని, అలాంటి వారు ప్రజాసేవకులుగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్య ఆత్మీయసమ్మేళనం జరిగింది. ఆర్యవైశ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.

బీజేపీ నేతలు మతం, ఆర్థిక అంశాల ప్రాతిపదికన ప్రజలలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మతం గురించి రెచ్చగొడుతూ బ్రాహ్మణులను, ఆర్యవైశ్యులను ప్రభావితం చేసేవిధంగా ఒక దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. ఆర్యవైశ్యులలో పేదలను ఆదుకునేందుకు ప్రత్యేకనిధిని కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసుకుంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం నుంచి మరికొంత ఇచ్చే విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే గొప్ప మానవత్వం ఆర్యవైశ్యులకు ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. దాతృత్వానికి వారు పెట్టింది పేరని కొనియాడారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గుర్తుగా ఆయనపేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను ఏర్పాటుచేసిన ఘనత వైయస్ఆర్‌కే దక్కుతుందన్నారు. వాసవి ఆలయాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకుండా మనం నిర్వహించుకునే విధంగా జీఓ ఇచ్చింది కూడా వైఎస్సేనని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులంతా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేవాళ్ళమని అయితే చంద్రబాబు నిర్వాకం వల్ల నవంబర్‌ ఒకటవ తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందని మాజీమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం వైఎస్ జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆర్యవైశ్య సంఘ నేతలు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story