పంజాబ్‌లో ‘వ్యాక్సిన్’ దుమారం

by Shamantha N |
పంజాబ్‌లో ‘వ్యాక్సిన్’ దుమారం
X

ఛండీగడ్: పంజాబ్‌ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 వయస్సు వారికి వేయడానికి రాష్ట్ర కోటా నుంచి కొనుగోలు చేసిన టీకాలను ప్రైవేటు హాస్పిటళ్లకు విక్రయించింది. దీనిపై ప్రతిపక్షం అకాలీదళ్ ఆరోపణలు సంధించింది. తక్కువ ధరలకు కొవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసి ప్రైవేటు హాస్పిటళ్లకు భారీ ధరలకు అమ్ముకుంటున్నదని, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నదని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విరుచుకుపడ్డారు. విమర్శలు పదునుదేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఈ ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అందుకే ఉపసంహరించుకుంటున్నట్టు రాష్ట్ర వ్యాక్సినేషన్ ఇంచార్జీ వికాస్ గార్గీ ఓ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు కొన్ని గంటల ముందు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశింది.

40వేల డోసులు అమ్మింది: అకాలీదళ్

ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసిన 40వేల కొవాగ్జిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటళ్లకు అమ్మిందని అకాలీదళ్ లీడర్ బాదల్ ఆరోపించారు. డోసుకు రూ. 400 చొప్పున కొనుగోలు చేసి రూ. 1060 ధరతో ప్రైవేటు హాస్పిటళ్లకు విక్రయించిందని, ప్రైవేటు హాస్పిటళ్లు ప్రజలకు రూ. 1,560కు పంపిణీ చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అనైతిక నిర్ణయాలపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన స్టాకు మొత్తం రిటర్న్ చేయండి: పంజాబ్

18-44ఏళ్ల వయసువారికి వన్ టైమ్ ఏర్పాటు ద్వారా ప్రైవేటు హాస్పిటళ్లలో టీకా వేయాలన్న నిర్ణయాన్ని తప్పుగా స్వీకరిస్తున్నారని, అందుకే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యుడు వికాస్ గార్గ్ తెలిపారు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం అందించిన టీకాలను వెంటనే రిటర్న్ చేయాలని, ఇప్పటికే ఉపయోగించిన డోసులను ఉత్పత్తిదారుల నుంచి టీకాలు పొందగానే ప్రభుత్వానికి పంపించాలని ప్రైవేటు హాస్పిటళ్లను ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటళ్లు డిపాజిట్ చేసిన వ్యాక్సిన్ ఫండ్ వెంటనే రీఫండ్ చేస్తామని పేర్కొన్నారు.

టీకా పంపిణీ నుంచి లాభార్జనా?: కేంద్రం

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం టీకా పంపిణీ నుంచి లాభార్జన చేయాలనుకుంటున్నదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ విమర్శలు కురిపించారు. అసలిది ఎలాంటి ప్రభుత్వం? అంటు ప్రశ్నించారు. పంజాబ్ ప్రభుత్వం కొవాగ్జిన్ డోసులు రూ. 400 చొప్పున కొనుగోలు చేసిందని, ప్రైవేటు హాస్పిటళ్లకు రూ. 1000కి అమ్ముకుంటున్నదని ఆరోపించారు. పంజాబ్ ప్రజల యోగక్షేమాల కోసం ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల వల్ల ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి చేరారని, రాష్ట్ర పరిస్థితులను ఎవరు చూడాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇతరులకు లెక్చర్ ఇచ్చే బదులు ముందు సొంతపార్టీ పాలిస్తున్న రాష్ట్ర బాగోగులను పట్టించుకోవాలని చురకలంటించారు.

Advertisement

Next Story