అమ్మాయిలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇకనుంచి అందులో కూడా అవకాశం

by Anukaran |   ( Updated:2021-09-08 04:42:36.0  )
అమ్మాయిలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇకనుంచి అందులో కూడా అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో అమ్మాయిలకు కూడా అవకాశం కల్పించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే మహిళల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈ నెల 20లోపు మార్గదర్శకాలను వెల్లడించాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది.

ఎన్డీయేలోకి అమ్మాయిలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం అభినందనీయమని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశ రక్షణలో సాయుధ బలగాలు కీలకపాత్ర పోషిస్తాయని, అయితే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బలగాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎన్డీయే పరీక్షను అమ్మాయిలూ రాయవచ్చని నెల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే ప్రవేశ పరీక్షను నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్టు జూన్ 24న ప్రకటించామని.. అయితే ప్రస్తుతం అమ్మాయిలకు అవకాశం కల్పించే అంశంలో చాలా మార్పులు చేయాల్సి ఉన్నందున పరీక్షలపై యథాతథ స్థితిని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టును కోరారు.

Advertisement

Next Story

Most Viewed