Hyderabad Book Fair : డిజిటల్‌ యుగంలోనూ బుక్స్‌కు అద్భుత ఆదరణ

by Bhoopathi Nagaiah |
Hyderabad Book Fair : డిజిటల్‌ యుగంలోనూ బుక్స్‌కు అద్భుత ఆదరణ
X

డిజిటల్ యుగం పెరిగింది. అందరూ మొబైల్, ట్యా్బ్స్, కంప్యూటర్లలో తమకు కావాల్సిన పుస్తకాలు చదివేస్తున్నారు. సమాచారం సైతం సేకరించుకుంటున్నారు. కానీ ఎంత డిజిటలైజేషన్ పెరిగినా అచ్చు పుస్తకానికి మాత్రం ఆదరణ తగ్గడం లేదు. దీనికి ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శనే ఉదాహరణగా చెప్పొచ్చు. గతంలోకంటే ఈ సారి నిర్వాహకులు ఎక్కువ స్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయడం, పబ్లిషర్స్ సంఖ్య కూడా పెరగడంతో పుస్తక ప్రియులు, విద్యార్థులు, సాహితీ వేత్తలు బుక్ ఫెయిర్‌కు భారీగా క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 50 వేల నుంచి 80 వేల మంది, సెలవు దినాల్లో లక్షకు పైగా మంది సందర్శిస్తున్నారంటే పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. - మొహమ్మద్ నిసార్


హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఈ నెల 19వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందని నేతలూ హాజరయ్యారు. వీరితో పాటు వేలాది మంది పుస్తక ప్రియులు, సాహితీ వేత్తలు, విమర్శకులు, వివిధ పబ్లికేషన్ల నిర్వాహకులు సైతం అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా పుస్తకం, బుక్ ఫెయిర్ ఆవశ్యకత గురించి సీఎంతో పాటు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతానికంటే భిన్నంగా ఈ సారి బుక్ ఫెయిర్‌లో 347 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సంస్కృతి, పర్యాటకం గురించి తెలిసేలా 171 స్టాళ్లు, ఇంగ్లిష్ పబ్లిషర్స్ 135, స్టేషనరీకి 10 స్టాళ్లు కేటాయించారు. అంతే కాకుండా రచయితలు తాము రాసుకున్న పుస్తకాలు విక్రయించేందుకు గాను వారికి ప్రత్యేకంగా ఆరు స్టాళ్లు కేటాయించారు. వీటితో పాటు పిల్లల పుస్తకాలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, పోటీ పరీక్షల బుక్స్ అమ్మేస్టాళ్లు సైతం ఎన్నో ఉన్నాయి.

తోపుడుబండి సాదిక్ వేదికగా పుస్తకావిష్కరణలు

బుక్ ఫెయిర్ సాహిత్య ప్రియులతో పాటు కవులు, రచయితలకు వేదికగా మారింది. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తోపుడుబండి సాదిక్ వేదికపై రోజుకు పదుల సంఖ్యలో పుస్తకాలను ఆవిష్కరిస్తున్నారు. ప్రధానంగా యువ రచయితలు తాము రాసిన పుస్తకాలను ఆవిష్కరించేందుకు పోటీ పడుతున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో రకాల బుక్స్ ఈ వేదికపై నుంచి ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా లోటుపాట్లు రాకుండా బుక్ ఫెయిర్ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాటు చేస్తూ పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు, కవులు, రచయితల మన్ననలు పొందుతున్నారు. కాగా, కంచె ఐలయ్య రాసిన ‘శుద్ర రెబిలియన్‌’ పుస్తకం హైదరాబాద్ వేదికగా రిలీజ్ అయింది. సంఘటిత స్త్రీవాద కవిత్వం, ఎర్ర రంగు బురద నవల అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు. దాచేస్తే దాగని సత్యం, జీవ పరిణామం, బాలామణి రచించి నవతెలంగాణ ప్రచురణలో వచ్చిన ‘స్త్రీ ఆధునిక కళాకారిణిగా శతాబ్ద యానం- సమాజ ప్రతి బింబం, భారతీయ దృశ్య కళా చరిత్ర’ పుస్తకాలను ఆవిష్కరించారు. అదే విధంగా పాపారావు రాసిన ‘మానవాళికి మహోదయం’ పుస్తకాన్ని ఎమ్మె్ల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ పుస్తకాన్ని పరిచయం చేశారు. ధూపాటి ప్రభాకర్ రాసిన ‘వెలుగు వైపుగా’ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ కవి యాకూబ్ ఆవిష్కరించారు. ఇంగ్లిష్‌లో రాసిన ఈ పుస్తకాన్ని పలువురు రచయితలు తెలుగులోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవి శ్రీవిశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘మ్రోయు తుమ్మెద’ 5వ ముద్రణను ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆవిష్కరించారు.


స్టాళ్లలో వేల పుస్తకాలు

జాతీయ స్థాయి బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన 347 స్టాళ్లలో వేలాది రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సాహిత్యం, బాల సాహిత్యం, కథలు, రచనలు, సైన్స్, నవలలు, కవితలు, కాంపిటేటివ్​ఎగ్జామ్స్‌కు సంబంధించిన బుక్స్, ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు బుక్ ఫెయిర్‌లో అందుబాటులో ఉన్నాయి. కేవలం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడికి వచ్చి రూ.వేలు ఖర్చు చేసి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం పుస్తక ప్రదర్శనను సందర్శించి తమకు కావాల్సిన సైన్స్, జనరల్ నాలెడ్జ్ వంటి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.

అలరిస్తున్న బోయి విజయ భారతి వేదిక

బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బోయి విజయ భారతి వేదికపై ప్రతి రోజూ నిర్వహిస్తున్న సంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు అందరినీ అలరిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం అవుతున్న ఈ వేదికపై పిల్లలో దాగున్న సృజనాత్మకత, విజ్ఞాన వికాసానికి సంబధించిన అంశాలు వెలికి తీసేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించడంతో పాటు స్టేజీపై ప్రదర్శిస్తున్నారు. ప్రతిభ కనబరుస్తున్న విద్యా్ర్థులకు బహుమతిగా పుస్తకాలు అందజేస్తున్నారు.


ప్లాస్టిక్ కవర్స్‌కు నో పర్మిషన్

పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సారి బుక్ ఫెయిర్‌లో ప్లాస్టిక్‌ను అవైడ్ చేసేందుకు నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సందర్శకుల కోసం బట్టతో కూడిన బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఒక బ్యాగు బయట కొనుగోలు చేస్తే రూ.10 నుంచి రూ.15 తీసుకుంటారు. కానీ బుక్ ఫెయిర్‌లో కేవలం రూ.5 కే ఇస్తున్నారు. ఈ సారి తీసుకున్న ఈ నిర్ణయం సందర్శకుల నుంచి మంచి రెన్పాన్స్ వస్తున్నదని నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్‌లో 1980 నుంచే పుస్తక ప్రదర్శన

హైదరాబాద్‌లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన షురూ అయ్యింది. కానీ పుస్తకాలు ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో అంటే 1948 నుంచి వట్టికోట అళ్వారు స్వామి తన ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ నుంచి ప్రచూరించిన పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకెళ్లారు. 1961 వరకూ ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు ముందు వచ్చాయి. కోఠీలోని బడీచౌడి పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడీచౌడి బుక్ సెల్లర్సే హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద్ర ప్రకాశన్, ఎమ్మెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రదర్శనలో భాగస్వామ్యం అవుతున్నాయి.


అశోక్ నగర్ నుంచి ప్రారంభం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన మొదటి సారిగా 1985లో అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో మొదటి సారిగా నిర్వహించారు. నాడు పబ్లిషర్స్‌ను, పుస్తక విక్రయదారులు ఒకే వేదికపై పుస్తకాల ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, ఎగ్జిబిషన్ గ్రౌంట్ వంటి ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. 12 ఏండ్లుగా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

పుస్తకం - చరిత్ర

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్ మొదలుకొని కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వరకూ పుస్తక ప్రదర్శనలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సంస్కృతి వైభవంగా నిలుస్తున్నాయి. 17వ శతాబ్దం నాటి యూరప్‌లో పుస్తక దినోత్సవాన్ని సెయిట్ జార్జ్ డేగా పాటించేవారట. స్పెయిన్‌లో కూడా పుస్తక దినోత్సవం వేళ ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీ బహుమతిగా ఇస్తారంట. సె వాంతెస్, షేక్ స్పియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 ఏప్రిల్ 23న మరణించినందున ఆ రోజున పలు దేశాల్లో పుస్తక దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఏటా ఏప్రిల్ 24న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో 1955లో ప్రకటించింది. 2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కొనాక్రీ సిటీని, 2018లో గ్రీస్‌లోని ఏథెన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది యునెస్కో.


అధిక పుస్తక ప్రియులు ఉన్న దేశం ఇండియానే

ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువగా పుస్తక ప్రియులు ఉన్న దేశం ఇండియానే. భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు బుక్ రీడింగ్ చేస్తారని ఓ అధ్యయనంలో తేలింది. 2013 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరిగిందంటే 2024లో అది మరింత రెట్టింపు అయ్యి ఉండొచ్చని పుస్తక ప్రియులు చెబుతున్నారు.

బుక్​ఫెయిర్​బాగుంది

నేను బుక్‌ఫెయిర్‌లో అన్ని స్టా్ల్స్​తిరిగాను. ఇక్కడ చాలా చాలా బుక్స్​ఉన్నాయి. నాకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేశారు. కాలేజీలో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్లి బుక్స్​చదివేదాన్ని. అన్ని పుస్తకాలు అక్కడ ఉండేవి కావు. కానీ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో వేలాది రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నేను సైలెంట్​పీస్,​ఇల్యూషన్‌తో పాటు ఫిక్షన్​బుక్స్ కొనుగోలు చేశారు. నెక్ట్స్​ఇయర్​ కూడా తప్పకుండా వస్తాను.

-మమత (కూకట్‌పల్లి)

రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణ

బుక్ ఫెయిర్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది. పుస్తక ప్రియుల కోసం 347 స్టాళ్ల ఏర్పాటు చేశాం. వారికి కావాల్సిన సౌకర్యలూ కల్పించాం. ఇక్కడ అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడికి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది. కవులు, రచయితలు తమ పుస్తకాలను ఆవిష్కరించేందుకు గాను తోపుడుబండి సాదిక్ వేదిక ఎంతో ఉపయోగ పడుతుంది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సైతం ఇటీవలే బుక్ ఫెయిర్‌ను సందర్శించి అభినందించారు. ఈ నెల 29వ తేదీ వరకూ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. పుస్తక ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.

-కవి యాకుబ్, వాసు.. బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు

Advertisement

Next Story

Most Viewed