వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి ఒకరు మృతి.. భయాందోళనలో ఏజెన్సీ

by Sumithra |
వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి ఒకరు మృతి.. భయాందోళనలో ఏజెన్సీ
X

దిశ, వాజేడు: ములుగు జిల్లాలోని వాజేడు మండల పరిధిలోని భువనపల్లి గ్రామంలో వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఒకరు బలైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వన్యప్రాణుల వేటగాళ్లు ధర్మవరం-చెరుకూరు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు అమర్చారు. ఈ సమయంలో అటుగా వెళ్లిన భువనపల్లి గ్రామానికి చెందిన బంధం నారాయణ (40) ఆ విద్యుత్ ఉచ్చులో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అది గమనించిన వేటగాళ్లు వెంటనే విద్యుత్ తీగలను తొలగించి అతని మృతదేహాన్ని అటవీ ప్రాంతంలోనే పడేశారు. అనంతరం మృతదేహం పక్కన కట్టెలు కొట్టే గొడ్డలిని పెట్టారు. కట్టెల కోసమే అడవికి వెళ్లి మృతి చెందినట్లుగా డ్రామా ప్లే చేశారు.

ఇదే దారిలో మేత కోసం అడవికి వెళ్ళిన పశువుల కాపరులు.. ఆ మృతదేహాన్ని చూసి బంధువులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో అడవిలోనే గోతి తీసి ఖననం చేశారు బంధువులు. కానీ, అసలు విషయం ఆ నోటా.. ఈ నోటా బయటపడి వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందినట్లు భువనపల్లి, ధర్మవరం గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

మృతి చెందిన నారాయణ భార్య ఛత్తీస్‌గఢ్‌లో ఉండటం, అతని తల్లి వృద్ధురాలు కావడంతో ఎలా చనిపోయాడు అనేది ఎవరు అంతగా ఆరా తీయలేక పోయారు. దీనిని ఆసరాగా చేసుకుని వన్యప్రాణుల వేటగాళ్లు డ్రామా ప్లే చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోగా ఆ నోట ఈ నోట వేటగాళ్ల రహస్య విషయం బయటకు పొక్కడంతో.. పేరూరు ఎస్సై పోగుల శ్రీకాంత్ రంగంలోకి దిగి పూర్తి వివరాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. వన్యప్రాణుల వేటగాళ్ల ఉచ్చులో పడి ఒకరు మృతి చెందినట్లు ప్రచారం సాగుతుండటంతో ఏజెన్సీ ప్రజానీకం భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed