ఢిల్లీపై ఎందుకీ వివక్ష… కేంద్రానికి మొట్టికాయలు వేసిన హైకోర్టు..

by Shamantha N |
ఢిల్లీపై ఎందుకీ వివక్ష… కేంద్రానికి మొట్టికాయలు వేసిన హైకోర్టు..
X

న్యూఢిల్లీ : ఆక్సిజన్ కేటాయింపులలో కేంద్ర సర్కారు ఢిల్లీ ప్రభుత్వం మీద వివక్ష ఎందుకు చూపుతున్నదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి.. ఢిల్లీకి అవసరమున్నా ఎందుకు అందజేయడం లేదో సమాధానం చెప్పాలని నిలదీసింది. ఈ వ్యత్యాసానికి సమాధానమైనా చెప్పాలని లేకుంటే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు సవరణలు చేయాలని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీని పట్టి పీడిస్తున్న కొవిడ్-19 మహమ్మారి, ఆక్సిజన్ కొరతపై దాఖలైన పలు పిటిషన్‌లపై కోర్టు విచారణ చేపట్టింది.

గతవారం అత్యవసర కేటాయింపుల కింద ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరినా.. కేంద్రం మాత్రం 400 ఎంటీలనే అందజేసింది. ఢిల్లీలో గడిచిన రెండు వారాలుగా 24 వేల నుంచి 30 వేల మధ్యలో కరోనా కేసులు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరత ఆస్పత్రులను పట్టి పీడిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారానికి 700 ఎంటీల ఆక్సిజన్ కావాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. కేంద్ర సర్కారును కోరినా కేంద్రం మాత్రం 490 ఎంటీలనే కేటాయించింది. దీంతో ఆక్సిజన్ అందక రోజుకు వందలాది మంది మరణిస్తున్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘ఢిల్లీలో ఏం జరుగుతుంది..? మేం 490 ఎంటీల వద్దే ఎందుకు ఆగిపోవాలి. మాకు (న్యాయమూర్తులకు) తెలిసిన వాళ్లు కూడా ఆస్పత్రులలో బెడ్స్, ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీకూ తెలుసు. పదే పదే ఢిల్లీ ప్రభుత్వం దీని మీద మీకు సమాచారం అందజేస్తూనే ఉంది..’ అని కోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు అదనపు కేటాయింపులు ఎందుకు చేయవలసి వచ్చిందో కారణాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇది ఎన్డీయే ప్రభుత్వానికి, ఇతరులకు పోరాటం కాదని ఆయన స్పష్టం చేశారు.

మా ముందు హాజరుకండి : ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాదారులు నేడు (శుక్రవారం) తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దేశ రాజధానిలోని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను ఎలా సరఫరా చేస్తున్నారు..? అనేదానిమీద పూర్తి వివరాలను వెల్లడించాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed