పురావస్తుశాఖ అధ్యయనానికి అడ్డంకి ఎందుకు ?

by  |
పురావస్తుశాఖ అధ్యయనానికి అడ్డంకి ఎందుకు ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భవనాల కూల్చివేత పనులను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరినా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. భవనాల కూల్చివేత విషయంలో రాష్ట్ర పురావస్తుశాఖ బృందం అధ్యయనం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంటో తెలియజేయాలని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళ్తే… సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించడానికి అనుమతి ఇప్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు వేర్వేలు పిటిషన్లను హైకోర్టులో దాఖలుచేశారు. వాటిని ఒక్కటిగా తీసుకున్న హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు డివిజన్ బెంచ్ కూల్చివేత తదనంతర పరిస్థితిపై దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు, రాజకీయ పార్టీ నేతలకు లేదని వ్యాఖ్యానించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడి పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలిపోయాయంటూ ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించిందని, కానీ మొత్తం భవనాలు కూలుస్తూ ఉన్నందున వీటిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కూల్చివేసిందా లేక నిజంగానే పొరపాటున కూలిపోయాయో తేలాల్సి ఉందని, అందువల్లనే వాటిని పరిశీలించడానికి రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌లను లిఖితపూర్వకంగా కోరామని, కానీ ఇప్పటివరకు ఆ ఇద్దరు ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని ప్రభుత్వాన్ని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అడ్వొకేట్ జనరల్ క్వారంటైన్‌లో ఉన్నందున వివరణ ఇవ్వడానికి రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇచ్చిన బెంచ్ తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేసింది.


Next Story

Most Viewed