- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటలే తప్ప చేతలు లేవు.. కరోనా వేళ ఇంత నిర్లక్ష్యమా..
దిశ, గోదావరిఖని : అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకండి. ఇల్లు దాటితే మాస్కును ధరించండి శానిటైజర్‌ని వెంట ఉంచుకోండి. అని పౌరులకు, ప్రజలకు సూచనలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి పై ముందుండి పోరాడుతున్న సిబ్బంది మాత్రం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్‌లు, ఇవ్వడంలేదు. ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఆశాలకు ఏఎన్ఎంలకు ముప్పు ఉందని ఉన్నతాధికారులకు తెలిసినా ప్రజారోగ్య పరిరక్షణకు పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం రక్షణ కల్పించే విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి పై మేము సైతం అంటూ నియంత్రణకు కృషి చేస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అష్టకష్టాలు ఎదుర్కొంటూ విధులను నిర్వహిస్తున్నారు. ఇంటింటికి కాళ్లరిగేలా తిరుగుతూ సర్వేలు చేయడంలో కీలక భూమికను పోషిస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలో ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తున్న ఆశ వర్కర్లకు కనీస రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. కరోనా కట్టడిలో యంత్రాంగంతో పాటు భాగస్వామ్యం వహిస్తున్న వారి సేవలకు కనీసం సర్కారు సక్రమంగా మాస్కులు, శానిటైజర్‌లు, గ్లౌజులు, కూడా సరఫరా చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా తొలిరోజుల్లో అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదకర సమయాల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి తిరుగుతున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ నియంత్రణలో క్షేత్ర స్థాయిలో కీలకం వీరే..
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సుమారు గత సంవత్సర కాలంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ఆశాలు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చెప్పే సర్వేలన్నీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కొవిడ్ ప్రమాదంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని త్వరితగతిన గుర్తించి ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి డాక్టర్ల సూచనల మేరకు మందులను ఆహారాన్ని అందిస్తున్నారు. కిట్లను బాధితుల వద్దకు చేరవేస్తున్నారు. ఇచ్చేది అరకొర వేతనమే అయినా తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు.
పని ఒత్తిడిలో సతమతం
పెద్దపెల్లి జిల్లాలో ఆశా వర్కర్లు ప్రతిరోజు సుమారుగా 150 నుంచి 200 ఇళ్లను సందర్శించి సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా పాజిటివ్ బాధితులను ఆస్పత్రులకు తరలించే సమయంలో అతి సమీపంలో ఉంటూ ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఇంత కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం వారికి రక్షణ కల్పించే విషయంలో విఫలం చెందారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెద్దపెల్లి జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కరోనా మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఇచ్చిన మాస్కులు శానిటైజర్ లను వాడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఇంట్లో నుండి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తున్నామన్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు వందల సంఖ్యలో ఇండ్లను తిరుగుతూ సర్వేలు చేస్తున్న తమకు ఎలాంటి రక్షణ లేదని కనీసం ప్రభుత్వం నుండి ఉద్యోగ భద్రత కరువైందని పలువురు పేర్కొంటున్నారు.
అరకొర జీతాలతో ఉద్యోగ భద్రత కరువు…?
చేసేది చిన్న ఉద్యోగం కానీ ప్రాణాలతో చెలగాటం, అయినా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కరువైందని పలువురు ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారితో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నా ఎలాంటి అధైర్య పడకుండా విధులు నిర్వహిస్తున్న తమకు కనీసం జీతాలు కూడా సక్రమంగా లేవని వాపోతున్నారు. నిరంతరం రోడ్లపై తిరుగుతూ సర్వే చేస్తున్న తమకు భద్రత కరువైందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కరోనా వైరస్ నియంత్రణ కోసం ముందుండి శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు సక్రమంగా మాస్కులు, శానిటైజర్ లతోపాటు గ్లౌజులను ప్రభుత్వం అందించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు శనిగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సర్వేలు చేస్తున్న క్రమంలో అనేకమంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి మెరుగైన వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ఏఐటీయూసీ,పెద్దపెల్లి జిల్లా కౌన్సిల్ సభ్యులు, రామగుండం నగర కార్యదర్శి, శనిగల శ్రీనివాస్.