అక్కడ సంచలనం సృష్టించిన ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య.. అవే కారణమా..?

by Anukaran |   ( Updated:2021-07-21 06:44:17.0  )
kerala news
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో విషాదం చోటుచేసుకుంది. కేరళ తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం కొచ్చిలోని తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి అనన్య ఆరు సర్జరీలను చేయించుకుంది. ఆ తర్వాత తనకు సర్జరీలు చేసిన వైద్యులు సరిగ్గా చేయలేదని, అందుకే అనారోగ్య సమస్యలు తలెత్తాయని గతంలో ఆమె చాలాసార్లు ఆరోపణలు చేసింది.కానీ, అప్పట్లో ఆమె మాటలను ఎవరు సీరియస్ గా తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు అవే కారణమని తెలుస్తోంది.

కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ అనన్యనే.. అంతేకాకుండా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌ కూడా అనన్యనే కావడం విశేషం. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ(డీఎస్‌జేపీ) అభ్యర్థిగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేసి ఒక్క రాత్రిలోనే స్టార్ గా మారిపోయింది అనన్య. ఆ తర్వాత తన పార్టీ వారే తనను వేరే విధంగా చూసేవారని, మీటింగ్ లకు వెళ్ళినప్పుడు ముఖానికి క్లాత్ కట్టుకోమనేవారని, అవేమి నచ్చకే అనన్య తానూ వేసిన నామినేషన్ ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఆమె డీఎస్‌జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తరువాత మీడియా ముందుకు రాని అనన్య ఇప్పుడు విగతజీవిగా కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనన్య కుమారి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed